
- మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు
- పూర్తిస్థాయిలో లిఫ్టింగ్మొదలుపెట్టిన ప్రభుత్వం
- వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు
- రోజూ 1.5 టీఎంసీల చొప్పున 22.5 టీఎంసీలు
- నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సహా 7 పంపుల ద్వారా లిఫ్టింగ్
- 24 గంటల కరెంట్ సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి
- కోతల్లేకుండా పంపులకు కరెంట్ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో ప్రయోజనం శూన్యమని మరోసారి తేలిపోయింది. ఎప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవర్‌గ్రీన్ అని నిరూపితమైంది. ఈ ఏడాది కూడా మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు మొదలయ్యాయి. యాసంగి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నిర్మించామని గత పాలకులు చెబుతున్నా.. నిరుడు యాసంగిలోనూ ఎల్లంపల్లే నీటి ఎత్తిపోతలకు దిక్కయింది. ఇప్పుడు కూడా గోదావరికి వరద కొంచెం ఆలస్యమైనా ఎల్లంపల్లి నుంచి నీటి లిఫ్టింగ్ షురూ అయ్యింది.
వాస్తవానికి వచ్చిన కొద్దిపాటి వరదలతో ఈ నెల 14నే నందిమేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలోని 3 మోటార్ల ద్వారా 9,500 క్యూసెక్కుల నీటి లిఫ్టింగ్‌ను ప్రారంభించారు. తాజాగా, ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో ఎత్తిపోతలను స్టార్ట్ చేశారు. నిరంతరాయంగా 15 రోజులపాటు సెప్టెంబర్ 7వ తేదీ వరకు లిఫ్టింగ్ కొనసాగించనున్నారు. ఏడు రిజర్వాయర్లను నింపనున్నారు. మిడ్‌మానేరు నిండాలంటే ప్రస్తుతం ఎల్లంపల్లి నీళ్లే దిక్కు. ఈ క్రమంలోనే ఎల్లంపల్లి నుంచి రోజూ 1.5 టీఎంసీల చొప్పున 15 రోజుల పాటు 22.50 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి.. మిడ్మానేరుతోపాటు 7 రిజర్వాయర్లకు తరలించనున్నారు. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రధాన ప్రాజెక్టులు నిండినా.. మిడ్‌మానేరుకు వరదల్లేకపోవడంతో ఆ ప్రాజెక్టు నిండలేదు. అది నిండితేనే దిగువన లోయర్ మానేరు కూడా నిండుతుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని సింహభాగం ఆయకట్టు ఎల్ఎండీ కిందనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి నుంచి నీటిని ప్రభుత్వం లిఫ్ట్ చేస్తున్నది. నంది పంప్‌హౌస్‌లో 2 మోటార్లు, గాయత్రి పంప్‌హౌస్‌లోని 2 పంపులు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లోని తిప్పాపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ 10)లోని 3 పంపులు, రంగనాయకసాగర్‌లోని చంద్లాపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ 11)లో 3 పంపులు, మల్లన్నసాగర్ (ప్యాకేజీ 12)లోని తుక్కాపూర్‌లో 8 పంపులను నడపనున్నారు. వాటితో పాటు అక్కారం, మర్కూక్‌లోని పంప్‌హౌస్‌ల నుంచి ఒక్కొక్క పంపును రన్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే ఆయా లిఫ్టులకు అవసరమైన కరెంట్ గురించి విద్యుత్ శాఖ అధికారులతో ఇరిగేషన్ శాఖ అధికారులు చర్చించారు. ఈ 15 రోజులపాటు 24 గంటలపాటు లిఫ్టులకు కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఆ శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఆయా లిఫ్టులకు అవసరమయ్యే కరెంట్ వివరాలను అందించారు. ఎల్లంపల్లి నుంచి ఈ 15 రోజులు నీటిని లిఫ్ట్ చేయడానికి దాదాపు 150 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని వివరించారు.
ఇప్పటికీ కొనసాగుతున్న వరద
ప్రస్తుతం గోదావరి బేసిన్‌కు వరద కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌తోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇప్పటికీ వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 54,187 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 80.05 టీఎంసీలున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలకుగానూ 19.40 టీఎంసీల నిల్వ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు 64,172 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 1,02,774 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నిండడంతో వర్షాకాలంతోపాటు యాసంగికీ ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాల నేపథ్యంలో.. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై ఇటు అధికారులు, అటు రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇటు గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులూ నిండాయి. నిజాంసాగర్‌లో 17.8 టీఎంసీలకుగానూ 16.80 టీఎంసీల నిల్వ ఉన్నది. సింగూరులో 29.91 టీఎంసీలకుగానూ 16.97 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో పాటు ఎగువ నుంచి స్వల్ప ప్రవాహాలు ఉండడంతో మిడ్‌మానేరుకు 18,218 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 27.5 టీఎంసీలకుగానూ 17.82 టీఎంసీల నిల్వ ఉన్నది. లోయర్ మానేరులో 24.07 టీఎంసీలకుగానూ 9.07 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ప్రాజెక్టుకు 9,952 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది.
కృష్ణాకు అంతకంతకూ పెరుగుతున్న వరద
కృష్ణా ప్రాజెక్టులకు వరద అంతకంతకూ పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదలు వస్తున్నాయి. ఆల్మట్టికి 2.66 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.75లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉండగా.. 1,50,790 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్‌తోపాటు స్థానికంగా వస్తున్న వరద కలిపి 3.88 లక్షల ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. దీంతో 3,81,773 క్యూసెక్కులను రిలీజ్ చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు ఇటు తుంగభద్ర, అటు సుంకేశుల నుంచి వరద భారీగా వస్తున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,65,420 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. దీంతో దిగువకు 10 గేట్లు, పవర్‌హౌస్‌ల ద్వారా 4,75,650 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు 4,17,085 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతుండగా.. 26 గేట్లు, పవర్‌హౌస్‌ల ద్వారా 4,19,084 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఎల్లంపల్లికి దండిగా వరదలు..
మేడిగడ్డ బ్యారేజీ వాడుకలోకి వచ్చిన (2019) నాటి నుంచి ఎత్తిపోసిన నీళ్లు కేవలం 162 టీఎంసీలేనని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అందులో మళ్లీ తిరిగి సముద్రంలోకే 118 టీఎంసీలు వదిలేశారు. అంటే నికరంగా మేడిగడ్డ నుంచి ఈ ఐదేండ్లలో ఎత్తిపోసిన నీళ్లు 44 టీఎంసీలే కావడం గమనార్హం. అత్యధికంగా బ్యారేజీ ప్రారంభించిన 2019–2020లోనే 61.666 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. 2020లో 31.828 టీఎంసీలు, 2021లో 33.971 టీఎంసీలు, 2022లో 25.971 టీఎంసీలను లిఫ్ట్ చేశారు. అయితే, 2022లో కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు భారీ వరదలకు మునిగిపోయాయి. ఆ పంప్‌హౌస్‌లు కూడా డిజైన్‌లో లోపాలు, పంప్‌హౌస్ ఎఫ్ఆర్ఎల్‌కు తక్కువ ఎత్తులో ఉండడంలాంటి కారణాలతో మునిగిపోయాయి.
ఆ తర్వాత 2023లో 8.932 టీఎంసీల నీటినే లిఫ్ట్ చేశారు. అదే ఏడాది ఆ బ్యారేజీ కుంగిపోయి అసలు లిఫ్టింగ్ అన్నదే జరగలేదు. ఈ ఐదేండ్లలో ఏటా సగటున ఎత్తిపోసిన నీళ్లు కేవలం 32 టీఎంసీలే కావడం గమనార్హం. అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి ఐదేండ్లలో నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా 180 టీఎంసీలకుపైగా జలాలను అధికారులు ఎత్తిపోశారు. ప్రస్తుతం ఎల్లంపల్లికి భారీగా వరదలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 64 వేల క్యూసెక్కుల దాకా ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. లక్ష క్యూసెక్కుల దాకా ఇటు లిఫ్టులు, అటు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.