మెస్సీ ఇండియా టూర్‎కు లైన్ క్లియర్.. సచిన్‌‌, ధోనీ, కోహ్లీతో ఫుట్‌‌బాల్ ఆడనున్న సాకర్ లెజెండ్

మెస్సీ ఇండియా టూర్‎కు లైన్ క్లియర్.. సచిన్‌‌, ధోనీ, కోహ్లీతో ఫుట్‌‌బాల్ ఆడనున్న సాకర్ లెజెండ్

కోల్‌‌కతా: అర్జెంటీనా ఫుట్‌‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌‎‌కు లైన్‌‌ క్లియర్‌‌‌‌ అయింది. డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు మూడు సిటీల్లో మెస్సీ పర్యటించేందుకు అన్ని అనుమతులు లభించాయని ఈవెంట్ ప్రమోటర్ సతద్రు దత్తా శుక్రవారం వెల్లడించాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’ పేరుతో జరగనున్న ఈ టూర్‌‎లో మెస్సీ క్రికెట్ లెజెండ్స్ సచిన్‌‌ టెండూల్కర్‌‌‌‌, సౌరవ్‌‌ గంగూలీ, ఎంఎస్‌‌ ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు బాలీవుడ్ స్టార్లతో ఫుట్‌‌బాల్‌‌ ఆడి అలరించనున్నాడు.  

మెస్సీ తొలుత కోల్‌‌కతాకు వస్తాడు. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శిస్తాడు. మూడు నగరాల్లోనూ ‘గోట్ కచేరీ’,  ‘గోట్ కప్’ ఈవెంట్లలో పాల్గొంటాడు. 2011లో ఇండియా నేషనల్ టీమ్‌‌తో కోల్‌‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన మెస్సీ ఆ తర్వాత ఇండియాకు రావడం ఇదే మొదటిసారి.  మెస్సీ డిసెంబర్ 12 రాత్రి కోల్‌‌కతా చేరుకొని తర్వాతి రోజు అభిమానులతో మీట్-అండ్- గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటాడు. 

ఆ రోజు మెస్సీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఈడెన్ గార్డెన్స్ లేదా సాల్ట్ లేక్ స్టేడియంలో  సౌరవ్ గంగూలీ, లియాండర్ పేస్, జాన్ అబ్రహం, బైచుంగ్ భూటియా వంటి ప్రముఖులతో కలిసి మెస్సీ ఫుట్‌‌ బాల్ మ్యాచ్‌‌ ఆడనున్నాడు. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మెస్సీని సన్మానించే అవకాశం  ఉంది. అనంతరం అదానీ ఫౌండేషన్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు అహ్మదాబాద్ వెళ్తాడు. 

డిసెంబర్ 14న ముంబైలో మెస్సీ సీసీఐ బ్రబౌర్న్‌‌లో మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటాడు.  వాంఖడే స్టేడియంలో మెస్సీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, బాలీవుడ్ యాక్టర్లు షారూక్‌ ఖాన్, రణ్‌ వీర్ సింగ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్‎తో గోట్‌‌ మూమెంట్‌‌, గోట్‌‌కెప్టెన్స్ మీటింగ్‌‌ ఈవెంట్లను ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తోంది.  డిసెంబర్ 15న  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే ఈవెంట్లకు లియోనల్  అటెండ్ అవుతాడు.

 దీనికి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌‌ విరాట్ కోహ్లీ, శుభ్‌‌మన్ గిల్‌‌ను ఆహ్వానించనుంది. యువ ఫుట్‌‌బాలర్లను  ప్రోత్సహించే ఉద్దేశంతో కోల్‌‌కతా, ముంబై, ఢిల్లీలో చిన్నారుల కోసం మెస్సీతో ఫుట్‌‌బాల్ మాస్టర్ క్లాసెస్‌‌ కూడా నిర్వహిస్తారని ఆర్గనైజర్ సతద్రు దత్తా  తెలిపాడు. ఈ టూర్‌‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఈ నెల చివర్లో మెస్సీ ప్రకటిస్తాడని పేర్కొన్నాడు.