
కొల్లాపూర్, వెలుగు : సింగోటం, గోపల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ యుగంధర్ గౌడ్ అధికారులకు సూచించారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) బొల్లారం, వల్లబాపురం, సంగినేనిపల్లిలో సింగోటం, గోపాల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో యుగంధర్గౌడ్ మాట్లాడారు. రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులు పూర్తి చేస్తే వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కానీ ప్రభుత్వం లింక్ కెనాల్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 40 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉన్నా కేవలం 4 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల నీళ్లన్నీ సముద్రంలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కొల్లాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్లో కొల్లాపూర్ గడ్డపై బీసీ బిడ్డని ఎమ్మెల్యే చేస్తామని తెలిపారు. సమవేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ యశ్వంత్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు అరవిందాచారి, నాయకులు పాల్గొన్నారు.