- కెరీర్‌లో 920 గోల్స్ చేసిన ప్లేయర్
- 2022లో అర్జెంటీనా ఫిఫా కప్ గెలవడంలో కీలక పాత్ర
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏలిన అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ.. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇన్‌స్టామ్‌గ్రామ్ వేదికగా తన వీడ్కోలు నిర్ణయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించాడు. తండ్రి మరణం కారణంగా ఆలస్యంగా ఈ ప్రకటనను విడుదల చేసినట్లు వెల్లడించాడు. 18 ఏళ్ల వయసులో ఆగస్టు 2005లో అర్జెంటీనా తరఫున అరంగేట్రం చేసిన మెస్సీ 207 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 గోల్స్ కొట్టాడు. 2022లో అర్జెంటీనాకు ‘ఫిఫా’ వరల్డ్ కప్ అందించాడు. అలాగే 2021, 2024లో కోపా అమెరికా టైటిల్స్‌ను సాధించాడు.
అయితే ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన మెస్సీ బృందం.. రెండోసారి అర్జెంటీనాకు కప్ అందించలేకపోయింది. ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టైటిల్ ఫైట్ ముగిసిన రెండు రోజుల తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని మెస్సీ వెల్లడించాడు. ‘రిటైర్మెంట్ నిర్ణయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. కానీ ఆ సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. అర్జెంటీనా జెర్సీ కోసం మైదానంలో ప్రతి క్షణం శ్రమించా.
జట్టుతో కలిసి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించా. అర్జెంటీనా ప్రజలు గర్వపడేలా చేయడమే నాకు ఆనందాన్నిచ్చింది. జాతీయ జట్టుకు ఇవ్వడానికి నా వద్ద ఇంకేమీ మిగల్లేదు. ఇకపై జాతీయ జట్టును అభిమానించే సాధారణ అభిమానిగా ఉంటా. కుటుంబం, కోచ్‌లు, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను అర్జెంటీనియన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు’ అని మెస్సీ పేర్కొన్నాడు.
మూడు ప్రొఫెషనల్ క్లబ్‌లకు..
అర్జెంటీనా జాతీయ జట్టుతో పాటు మెస్సీ తన కెరీర్‌లో మూడు సీనియర్ ప్రొఫెషనల్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఎఫ్‌సీ బార్సిలోనా (2004-–2021), పారిస్ జెయింట్ జర్మన్ (2021–2023), ఇంటర్ మియామీ (2023 నుంచి) ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి అర్జెంటీనాకు గుడ్‌బై చెప్పినా.. ఇంటర్ మియామీ తరఫున 2028 వరకు కాంట్రాక్ట్ ఉండటంతో క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. ఓవరాల్ కెరీర్‌లో 1166 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 921 గోల్స్ చేశాడు. 419 సార్లు గోల్స్ చేయడంలో సహచరులకు సాయం అందించాడు.
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధికంగా ఎనిమిదిసార్లు ‘బాలెన్ డి ఓర్’ అవార్డును గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ రికార్డు సృష్టించాడు. 2016 ఫిబ్రవరిలో బార్సిలోనా తరఫున అధికారికంగా పది వేల గోల్ కొట్టాడు. సాకర్‌లో అన్ని మేజర్ టైటిల్స్‌ను దాదాపుగా గెలిచిన మెస్సీ.. కోప్ డి ఫ్రాన్స్ (ఫ్రెంచ్ కప్), కాంకాఫ్ చాంపియన్‌షిప్ కప్‌ను మాత్రం గెలవలేకపోయాడు. రియల్ మాడ్రిడ్ మూడుసార్లు, సౌదీ అరేబియన్ క్లబ్స్ అల్ హిలాల్, అల్ ఇతిహాద్ భారీ స్థాయిలో ఆఫర్స్ ఇచ్చినా మెస్సీ రిజెక్ట్ చేశాడు. మరో రెండు, మూడేళ్లు కచ్చితంగా ఆటలో కొనసాగే మెస్సీ.. బ్రెజిల్ లెజెండ్స్ పీలే (1279), రొమారియో (1002) గోల్స్ రికార్డును అధిగమిస్తాడేమో చూడాలి.
