లిక్కర్ అమ్మితే 10 వేలు..కొంటే 5 వేలు ఫైన్ 

లిక్కర్ అమ్మితే 10 వేలు..కొంటే 5 వేలు ఫైన్ 
  • తాగుడుకు ఆరుగురు బలవడంతో గ్రామస్తుల తీర్మానం 
  • సమాచారం ఇచ్చినోళ్లకురూ. 2 వేల రివార్డ్​ 
  • తెలంగాణ రాకముందుగ్రామంలో బెల్టుషాపే లేదు 
  • ఇప్పుడు 12 బెల్టుషాపులు

మెదక్/నిజాంపేట, వెలుగు: అది మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామం. ఐదు వేల జనాభా కూడా లేని ఆ ఊర్లో ఏకంగా డజను బెల్టుషాపులున్నయి. నల్లాల్లో టైంకు మంచినీళ్లు వస్తయో రావో తెల్వదు కానీ.. లిక్కర్ మాత్రం ఎనీటైం దొరుకుతది. దీంతో పీకల దాకా తాగుతున్న కొందరు.. ఇల్లు, ఒల్లు గుల్లచేసుకుంటున్నరు. ఊర్లో మద్యం మత్తులో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయినయి. ‘బెల్టుషాపుల వల్ల ఊరు ఊరంతా నాశనమవుతోంది.. వాటిని మూయించండి సారూ..’ అని ఆబ్కారోళ్లకు, పోలీసోళ్లకు గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామంలోని మహిళలు, కొంతమంది యువత ఏకమై బెల్టుషాపులకు వ్యతిరేకంగా ఉద్యమం షురూ జేశారు. పంచాయతీ పెద్దలపైనా ఒత్తిడి తెచ్చారు. దీంతో దిగివచ్చిన సర్పంచ్ శుక్రవారం గ్రామ సభ ఏర్పాటు చేసి సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించారు.    

కల్వకుంటలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక్క లిక్కర్ షాపు కూడా ఉండేది కాదు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో సీన్ మారింది.  ఐదు వేల జనాభా కూడా లేని కల్వకుంటలో డజను బెల్టుషాపులు వచ్చాయి. ఈ బెల్టుషాపుల్లో 24 గంటలూ రికాం లేకుండా మందు అమ్ముతున్నారు. ఊర్లో రోజూ రూ.1.30 లక్షల లిక్కర్ అమ్ముడుపోతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క గ్రామాల్లోని మందుబాబులకు సైతం ఇక్కడి బెల్టు షాపులు అడ్డాగా మారాయి. దీంతో గ్రామంలో తాగుబోతుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. మహిళలు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. పైసలన్నీ తాగుడుకే తగలేస్తుండడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.   

యాక్సిడెంట్లు, సూసైడ్ లు పెరగడంతో.. 

కల్వకుంటలో గడిచిన రెండు నెలల కాలంలో తాగిన మైకంలో బురాని బాలమల్లు(42), బాస రాములు( 54), మురళి(38) అనే ముగ్గురు వ్యక్తులు సూసైడ్​ చేసుకున్నారు. మత్తు కారణంగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో మరో ఇద్దరు చనిపోయారు. బాస యాదగిరి(52) అనే వ్యక్తి వారం క్రితం ఫుల్లుగా తాగి ఇంటి ముందే జారిపడి చనిపోయాడు. గ్రామానికి చెందిన బక్కనోళ్ల మల్లయ్య తాగిన మైకంలో బిల్డింగ్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు, కొందరు యువత కలిసి బెల్ట్​షాప్​లకు పోయి మద్యం బాటిళ్లు పగలగొట్టారు. గ్రామంలో మందు అమ్మొద్దని హెచ్చరించారు. అయినా పరిస్థితి మారకపోవడంతో పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు సర్పంచ్ తమ్మన్నగారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మలత దిగివచ్చారు. గ్రామ సభ ఏర్పాటు చేసి సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించారు.