10వేల పేజీలతో సీబీఐ లిక్కర్ స్కామ్‌‌‌‌ చార్జ్‌‌‌‌షీట్

10వేల పేజీలతో  సీబీఐ లిక్కర్ స్కామ్‌‌‌‌ చార్జ్‌‌‌‌షీట్
  • ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో దాఖలు
  • బోయినపల్లి అభిషేక్, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌‌‌‌పై అభియోగాలు
  • మిగతా నిందితులపై త్వరలో మరిన్ని చార్జ్‌‌‌‌షీట్లు!
  • ఐదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న సీబీఐ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌‌‌‌ పాలసీ స్కామ్​ కేసులో సీబీఐ ప్రిలిమినరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ దాఖలు చేసింది. సుమారు 10 వేల పేజీలతో కూడిన చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను శుక్రవారం ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ రౌస్‌‌‌‌ అవెన్యూ కోర్టులో ఫైల్‌‌‌‌ చేసింది. ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఎక్సైజ్‌‌‌‌ మాజీ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌సింగ్‌‌‌‌ను, ఏ2గా మాజీ అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్​ నరేందర్‌‌‌‌ ‌‌‌‌సింగ్‌‌‌‌ను, ఏ3గా ఓన్లీ మచ్‌‌‌‌ లౌడర్‌‌‌‌‌‌‌‌ మాజీ సీఈవో విజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌ను చేర్చింది. 

రాష్ట్రానికి చెందిన రాబిన్‌‌‌‌ డిస్టిలరీ డైరెక్టర్లు అభిషేక్‌‌‌‌ బోయినపల్లి, అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్ళై, ఓ ఇంగ్లీష్ చానల్‌‌‌‌ ఎండీ ముత్తా గౌతమ్‌‌‌‌తోపాటు ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రులపై అభియోగాలు మోపింది. ఈ స్కామ్‌‌‌‌లో దేశవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్, ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులు, లిక్కర్ వ్యాపారులు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణతోపాటు ఢిల్లీ, ముంబైకి చెందిన లిక్కర్ వ్యాపారులు, వ్యాపారవేత్తల నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లంచం రూపంలో డబ్బు అందిందని వెల్లడించింది.

రాష్ట్రం నుంచే ఆపరేషన్స్

ఈ స్కామ్‌‌‌‌లో రాష్ట్రానికి చెందిన అభిషేక్‌‌‌‌ బోయినపల్లి, అరుణ్‌‌‌‌ రామచంద్రపిళ్లై, ముత్తా గౌతమ్‌‌‌‌ కీలకపాత్ర పోషించారని చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో సీబీఐ తెలిపింది. హైదరాబాద్‌‌‌‌, ముంబై, ఢిల్లీలో పలు మీటింగ్స్ జరిగినట్లు వెల్లడించింది. ఈ సమావేశాల్లో తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ నేతలు, వారి అనుచరులు, ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులు పాల్గొన్నట్లు ఆధారాలు అందించింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో కుట్ర జరిగిందని తెలిపింది.

ఇందులో అభిషేక్‌‌‌‌, పిళ్లై, గౌతమ్‌‌‌‌కి సంబంధించిన వివరాలను మొదటి చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో వెల్లడించింది. నిందితులకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు అందించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇంకా చాలామందిని విచారించాలని, కీలకమైన ఐదుగురిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. నిందితులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ నెల 30న పరిశీలించాక పరిగణనలోకి తీసుకోనుంది. ఆపై నిందితులపై ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది.

త్వరలో మరిన్ని చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లు!

లిక్కర్ స్కామ్‌‌‌‌లో ఆగస్ట్‌‌‌‌ 17న సీబీఐ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మొత్తం16 మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా స్కామ్‌‌‌‌లో కీలకంగా వ్యవహరించిన ఏడుగురితో కూడిన ప్రిలిమినరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను ఫైల్‌‌‌‌ చేశారు. ఇందులో మనీశ్ సిసోడియా పేరు లేదు. అయితే సిసోడియా సహా ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మరికొందరిపై త్వరలో మరిన్ని చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లు దాఖలు చేసే అవకాశం ఉంది.

శుక్రవారం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులకు లాభం చేకూర్చేలా పాలసీని మార్చారని చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సవరణలు, లైసెన్సులు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. లైసెన్స్‌‌‌‌ ఫీజ్‌‌‌‌, లిక్కర్ రేట్స్, టెండర్స్‌‌‌‌, ఎల్‌‌‌‌-1 లైసెన్స్ పొడిగింపు మొదలైన వాటిలో భారీగా అక్రమాలు జరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని డిజిటల్ రికార్డులు సహా పూర్తి ఆధారాలను డిపాజిట్ చేసినట్లు సీబీఐ వివరించింది. కాగా ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. ఆప్‌‌‌‌ నేత విజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌ను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది.