ఇంటర్‌‌ స్టేట్‌‌ చెక్‌‌పోస్టులతో అక్రమ మద్యం కట్టడి

ఇంటర్‌‌ స్టేట్‌‌ చెక్‌‌పోస్టులతో అక్రమ మద్యం కట్టడి
  • భద్రాచలంలో ఛత్తీస్‌‌గఢ్‌‌, ఏపీ, తెలంగాణ ఆబ్కారీ ఆఫీసర్ల భేటీ

భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్‌‌ స్టేట్‌‌ బార్డర్లలో చెక్‌‌పోస్టులు పెట్టి లిక్కర్‌‌ రవాణాను కట్టడి చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌‌హౌజ్‌‌లో గురువారం ఛత్తీస్‌‌గఢ్‌‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎక్సైజ్‌‌ పోలీస్‌‌ ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌‌ మీటింగ్‌‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్‌‌ జనార్దన్‌‌ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్‌‌, నాటుసారా, గంజాయి దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవడానికి యాక్షన్‌‌ ప్లాన్‌‌ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్‌‌ స్టేట్‌‌ బార్డర్లలో టెంపరరీ చెక్‌‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ దాడులు నిర్వహించాలని మీటింగ్‌‌లో నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్‌‌ ఆఫీసర్‌‌ జానయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా అసిస్టెంట్‌‌ కమిషనర్‌‌ గణేశ్‌‌, ఏలూరు అడిషనల్‌‌ ఎస్పీ సూర్య చందర్‌‌రావు, ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ రామకృష్ణ, సుక్మా ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ గజేందర్​, బీజాపూర్‌‌ సూపరింటెండెంట్‌‌ రాథోడ్​, అల్లూరి సీతారామరాజు జిల్లా అసిస్టెంట్‌‌ ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ కరం చంద్, భద్రాచలం ఎస్‌‌హెచ్‌‌వో రహీమున్నీసా బేగం, కొత్తగూడెం డీటీఎఫ్‌‌ సీఐ సాంబమూర్తి, జంగారెడ్డిగూడెం ఎస్‌‌ఈబీ సీఐ పట్టాభి, చింతలపూడి ఎస్‌‌ఈబీ సీఐ ప్రసాద్‌‌ పాల్గొన్నారు.