ఖమ్మం జిల్లాలో గడువు పెంచినా ఫాయిదా లేదు..!లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం ముగిసిన గడువు

ఖమ్మం జిల్లాలో గడువు పెంచినా  ఫాయిదా లేదు..!లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం ముగిసిన గడువు
  • 4430 అప్లికేషన్ల ద్వారా రూ.132.90 కోట్ల ఆదాయం
  • రెండేళ్ల క్రితం దరఖాస్తుల ద్వారా రూ.144 కోట్ల ఇన్​ కమ్ 
  • ఏపీ వాసుల నుంచి అంతగా కనిపించని ఆసక్తి

ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  లిక్కర్​ షాపుల లైసెన్స్ ల కోసం ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. రెండేళ్ల కిందట వచ్చిన దానికన్నా ఈ సారి అప్లికేషన్లు తక్కువగా వచ్చాయి. దరఖాస్తు రుసుం పెంచినా ఆదాయం కూడా గతంలో కన్నా తక్కువే వచ్చింది. బీసీల బంద్​ కారణంగా ప్రభుత్వం అప్లికేషన్ల గడువు పొడిగించినా, ఫలితం కనిపించలేదు. గురువారం రాత్రి వరకు ఖమ్మం జిల్లాలో 116 షాపుల కోసం 4,430 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 253 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అప్లికేషన్ల ద్వారా ఈ ఏడాది రూ.132.90 కోట్ల ఆదాయం వచ్చింది.

 రెండేళ్ల క్రితం 7,207 దరఖాస్తులు రాగా, అప్లికేషన్​ కు రూ.2 లక్షల చొప్పున రూ.144.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ​ రేటు పెంచి.. అప్లికేషన్లు తగ్గినా రూ. 150 కోట్ల మేరకు ఆదాయం సాధించాలని ఎక్సైజ్​ అధికారులు టార్గెట్​ పెట్టుకున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్​, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారస్తులతో నేరుగా మాట్లాడి ఎక్కువగా దరఖాస్తులు చేయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 

ఏపీ నుంచి ఆసక్తి కరువు 

ఆంధ్రప్రదేశ్​ సరిహద్దులోని సత్తుపల్లి, మధిర ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో వైన్​షాపులకు ఏపీ నుంచి గిరాకీ వచ్చేది. దీంతో ఏపీకి చెందిన లిక్కర్​ వ్యాపారులు కూడా బోర్డర్​ షాపుల కోసం గతంలో పోటీపడ్డారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో ఏపీ వ్యాపారులు బోర్డర్​ షాపుల మీద ఇంట్రస్ట్ చూపకపోవడం కూడా ఆదాయం మీద ప్రభావం చూపింది. మరోవైపు జిల్లాలో 116 షాపుల్లో 76 షాపులు మాత్రమే అన్​ రిజర్వుడ్​ గా ఉన్నాయి. గౌడ కులస్తులకు 18 షాపులు కేటాయించగా, ఎస్సీలకు 14, ఓపెన్​ ఏరియాలో ఎస్టీలకు 2 రిజర్వు చేశారు. కారేపల్లి స్టేషన్​ పరిధిని ఏజెన్సీ ఏరియాగా ప్రకటించి, అక్కడి 6 షాపులను పూర్తిగా స్థానిక గిరిజనులకే రిజర్వ్ చేశారు. 

కొత్తగూడెంలో3,899 దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్​ అధికారులు ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు రాకపోయినా ఆదాయం మాత్రం పెరిగింది. జిల్లాలోని 88 వైన్​ షాపులకు 3,899 దరఖాస్తులొచ్చాయి. మొదట ఈనెల 18 వరకు గడువుండగా 3,799 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 23 వరకు గడువు పెంచడంలో మరో వంద దరఖాస్తులు మాత్రమే పెరిగాయి.

 రెండేళ్ల కింద 5,057దరఖాస్తులు వచ్చాయి. గతంలో అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 100 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి రూ. 116.97కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాలోని వైన్​ షాపులకు ఈ నెల 27న డ్రా తీయనున్నట్టు ఎక్సైజ్​సూపరింటెండెంట్​ జానయ్య తెలిపారు.