- లిక్కర్ ఖర్చు రోజుకు రూ.60 లక్షలకుపైనే
- ఆదివారం యాటల దావత్‌కు ప్రణాళిక
- గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థుల హడావిడి
నిజామాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఓటుకు ‘కోటర్’ చొప్పున లిక్కర్‌ను నేరుగా ఓటర్లకు అందిస్తున్నారు.
రాత్రి భోజనానికి అర కిలో చికెన్ ప్యాకెట్లు అందిస్తుండడంతో ప్రచారం పసందుగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆదివారం యాటలు కోసి దావత్ ఇచ్చేందుకు సర్పంచ్ అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంగా రోజుకు సుమారు రూ.60 లక్షలకుపైగా ఖర్చు చేస్తుండడం విశేషం.
ఓటు లక్ష్యంగా ప్రచార హడావిడి
బోధన్ డివిజన్‌లోని 11 మండలాల్లో ఈ నెల 11న పంచాయతీ పోలింగ్‌జరగనుంది. ఇప్పటికే 29 సర్పంచ్ స్థానాలు, 575 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 155 సర్పంచ్ పదవులు, 1,060 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల కోసం సర్పంచ్ బరిలో 519 మంది, వార్డుల్లో 2,734 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గురువారం ఎన్నికల పోస్టర్లు, స్టిక్కర్లు, బ్యానర్లు సిద్ధం చేసుకొని మద్దతుదారులకు పంపిణీ చేశారు.
శుక్రవారం ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయాలని కోరారు. ఏ పార్టీ మద్దతుతో బరిలో ఉన్నారో తెలియజేయాలనే ఉద్దేశంతో మెడలో కండువాలు వేసుకుని తిరుగుతుండగా, కొన్ని చోట్ల ఎన్నికల గుర్తులు వెంట పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.
ప్రచారంతో పాటు ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో రోజుకు రూ.40 వేల లిక్కర్ పంపిణీ అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం విలేజీల్లో రోజుకు రూ.60 లక్షల మేర మందు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అర కిలో చికెన్ ప్యాకెట్లకే రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇక ఆదివారం మేకపోతుల విందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పోలింగ్‌కి ముందు వారాంతపు సెలవును ఓటర్ల ఖుషీ కోసం వినియోగించాలని అభ్యర్థులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
వెలుగులోకి వచ్చిన కొన్ని ప్రత్యేక సంఘటనలు..
బోధన్ మండలంలోని ఒక గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి ‘నాన్-లోకల్’ అన్న ప్రచారం జరిగితే, తన కుటుంబాన్ని పాత ఇంట్లోకి మార్చి అక్కడే నివసించడం ప్రారంభించారు.
మరో గ్రామంలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి తరఫున కుటుంబీకులు, ఆమె గెలిచిన తర్వాత ఏడాది పాటు గ్రామ యువతీ, యువకుల పెండ్లిళ్లకు రూ.10 వేలు సాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.
పోతంగల్ మండలంలో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఎన్నికలు ముగిసేంతవరకు మద్ధతుదారులకు భోజనాలు పెట్టించేందుకు ఇళ్ల ముందు టెంట్లు వేయించి
ఏర్పాట్లు చేశారు.
బంధువులే ప్రత్యర్థులు
సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తున్న బంధువుల మధ్య ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. బోధన్ మండలంలోని ఒక విలేజీలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అత్తాకోడళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీచర్‌గా రిటైర్డ్అయిన తనకు ప్రజాసేవ కోరిక ఉందని అత్త ప్రచారం చేస్తుండగా యూత్‌ను పాలిటిక్స్‌లో ఎంకరేజ్ చేయాలని పీజీ చేసిన కోడలు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు.
సాలూరా మండలంలో మేనమామ, మేనల్లుడి మధ్య ప్రచారానికి చెందిన మాటల తూటాలు పేలుతున్నాయి. నవీపేట మండలంలోని ఒక గ్రామంలో సర్పంచ్‌గా బరిలో ఉన్న తోడికోడళ్లు పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్నారు. రెంజల్ మండలంలో బాబాయ్ కొడుకుల మధ్య పోటీ టెన్షన్ క్రియేట్ చేస్తోంది.
