
మెదడువాపు.. ఒకప్పుడు బాగా విజృంభించేది. పిల్లల్ని పీడించే ఈ మాయదారి రోగం కొన్నేళ్ల క్రితం తగ్గుముఖం పట్టింది. వార్తల్లో మెదడువాపు వ్యాధి మళ్లీ వినిపిస్తోంది. ఇది ఇంతకు ముందు విన్న మెదడువాపు కాదు. ఇంతకు ముందెన్నడూ మెదడు భరించని సమస్య. డాక్టర్లకూ అనుభవంలోకి రాని సమస్య. ముజఫర్‌పూర్ (బీహార్)లో వందల మంది చిన్నారులను బలితీసుకున్న ఘటన ఒక హెచ్చరిక. పిల్లల ఆహార విషయాల్లో నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పిన విషాదం అది. మెదడును మొద్దుబార్చే ఈ కొత్త మూర్ఛ వ్యాధి ఎట్లొచ్చింది? ఎట్ల పోతుంది?
పిల్లలకు జ్వరం, వణుకు, ప్రవర్తనలో మార్పు, వాంతులు, అపస్మారక స్థితికి చేరుకోవడం, నిద్రమత్తు వంటి లక్షణాలుంటే దీనిని మెదడు సంబంధమైన సమస్యగా పరిగణిస్తారు. దాదాపుగా ఇలాంటి లక్షణాలన్నీ మెదడువాపు రోగులకే ఉంటాయి. ‘ఎన్‌సెఫలైటిస్’ దోమ కుట్టడం వల్ల శరీరంలోకి వైరస్ సంక్రమించడం వల్ల ఈ మెదడువాపు వస్తుంది. కానీ ముజఫర్‌పూర్‌లో ఇవే లక్షణాలతో బాధపడుతున్న పిల్లలకు దోమ కుడితే సోకే వైరస్ వల్ల మెదడువాపు రాలేదు. ఇది లిచి పండ్లు తింటే వచ్చిందని వైద్యులంటున్నారు. తీయని లిచి పండ్లకు, చురుకైన మెదడు మందగించడానికి సంబంధం ఏమిటని అందరూ ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. దీనికంతటికీ కారణం లిచి పండేనట. తియ్యగా ఉండే పండుతోపాటు శరీరంలోకి చేరే ‘మిథైలీన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ (ఎంసీపీజీ)’ అని శాస్త్రవేత్తలు తేల్చారు.
శక్తి ని(త్య)త్వం
మన శరీరంలోని కణాలన్నీ క్రియాశీలంగా పని చేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. శారీరక శ్రమ పెరిగితే వెంటనే ఎక్కువగా శ్వాస తీసుకుంటాం. ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి శరీర కణాలకు వేగంగా చేరుతుంది. మన శరీరంలోని అవయవాలలో మెదడే ఎక్కువ ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఊపిరితిత్తులు గ్రహించే ఆక్సిజన్‌లో నాలుగొంతుల్లో ఒక వంతు మెదడుకు చేరుతుంది. శరీర కణాలకు కావ్సాలిన శక్తి రక్తం నుంచి అందే ఆక్సిజన్, గ్లూకోజ్ నుంచి లభిస్తుంది. ఇవి నిరంతరాయంగా కణాలకు అందడం వల్ల శరీరధర్మ క్రియలు జరుగుతాయి. పరగడుపున ఉన్నపుడు, ఉపవాసం ఉన్నపుడు శరీరానికి గ్లూకోజ్ అందదు. అప్పుడు శరీరంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ (గ్లూకోజ్)ని కాలేయం గ్లూకోజ్‌గా మార్చుతుంది. ఈ నిల్వ కొవ్వుకూడా లేనప్పుడు కణాలకు శక్తి అందదు. అవయవాలు సరిగా పని చేయవు. ఇతర అవయవాలు ఇలాంటి సమస్యతో ఎక్కువ సేపు ఉండగలవు. కానీ, మెదడు కొన్ని నిమిషాలు కూడా తట్టుకోలేదు. మెదడు పనితీరులో మార్పులు వెంటనే రావడంతో వణుకు, తలనొప్పి, మూర్ఛలు, నిద్రమత్తు వస్తాయి. ముజఫర్‌పూర్‌లో దవాఖానలో చేరిన, చనిపోయిన పిల్లలందరూ ఈ రెండో కారణంతో (మెదడులోని నిల్వ కొవ్వులు ఆక్సిజన్‌తో చర్య జరపలేకపోవడంతో) అనారోగ్యానికి గురయ్యారు. అదే వాళ్ల మరణాలకూ కారణమని వైద్యులు నిర్ధారించారు.
హైపోగ్లైసీమియా అంటే?
ఈ పిల్లలందరికీ గ్లూకోజ్ అందకపోవడానికి కారణం రాత్రి పూట తినకుండా పడుకోవడం, ఉదయం వెంటనే తినకపోవడం కారణమని డాక్టర్లు తెలుసుకున్నారు. వీళ్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఉండాల్సిన దానికంటే తక్కువ స్థాయిలో ఉంది. దీనిని వైద్య పరిభాషలో ‘హైపోగ్లైసీమియా’ అంటారు. అయితే ఇలా సరిగా తినని పిల్లలందరూ మెదడువాపు లేదా మూర్ఛలతో బాధపడలేదు. కొంతమందే ఎందుకు ఇబ్బంది పడ్డారు?
లిచి గింజలే కారణం?!
పిల్లలు తినకపోతే నీరసంగా ఉంటారు. అప్పుడు శరీరానికి ఆహారం నుంచి గ్లూకోజ్ అందదు. ఆ సమయంలో కాలేయంలో గ్లైకోజన్ రూపంలో ఉండే గ్లూకోజ్‌ని శరీరం ఉపయోగించుకుంటుంది. మెదడుకు కావాల్సిన శక్తి ఇలాగే అందుతుంది. అయితే కొంత మంది పిల్లల్లో కాలేయంలోని గ్లైకోజన్, గ్లూకోజ్ రూపంలోకి మారలేదు. అప్పుడు మెదడు పనిచేయక అవస్థలు పడ్డారని, అదే మరణానికి కారణంగా భావిస్తున్నారు. దీనికి కారణం వాళ్లు లిచి పండ్లు తినటమేనని డాక్టర్లు భావిస్తున్నారు. ముజఫర్‌పూర్ జిల్లాలో లిచి పండ్లను బాగా పండిస్తారు. ఈ పండ్లు ఎక్కువగా తింటారు. అందువల్ల ఈ సమస్య వచ్చిందట. ఇదేమీ ఊహా గానం కాదు. నిజమే అనడానికి చాలా ఆధారాలున్నాయి. డాక్టర్ టీ జాకబ్ జాన్ నాయకత్వంలో ఒక పరిశోధక బృందం 2012–13 సంవత్సరంలో లిచి పండ్లపై అధ్యయనం చేసి లిచీ పండ్లలో విషపదార్థాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. లిచి పండ్లపై ఇండో–యూఎస్ పరిశోధకులు 2017లో అధ్యయనం చేశారు. ఈ పరిశోధక బృందం లిచి పండ్లలో మిథైలీన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ (ఎంసీపీజీ) ఉన్నట్లుగా కనుగొన్నారు. ఇది శరీరంలోకి చేరడం వల్లనే మెదుడువాపు, మూర్ఛ వ్యాధిలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని గుర్తించారు. ఎంసీపీజీ శరీరంలోకి చేరితే గ్లైకోజన్ గ్లూకోజ్ రూపంలోకి మారదు. శరీరంలో గ్లైకోజన్ (గ్లూకోజ్ నిల్వలు) ఉన్నా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పడిపోతుంది. ఈ స్థితిలో మెదడు కణాలకు శక్తి అందక అవి పనిచేయడం ఆగిపోతాయి. పిల్లలు సరిగా నడవలేక పోవడం, వణుకు రావడం మొదలవుతుంది. కాసేపటికి కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు వస్తాయి. సమస్య తీవ్రమయితే మూర్ఛలు వస్తాయి. కొందరిలో మరణం సంభవిస్తుంది. ఇదే ముజఫర్‌పూర్‌లో జరిగింది.
ముందే పసిగట్టొచ్చు
సాధారణ మెదడువాపు, ఈ హైపోగ్లైసీమియా మెదడువాపు లక్షణాలు ఒకేలా ఉంటాయి. అయినా కొన్ని లక్షణాల ఆధారంగానే ముందే హైపోగ్లైసీమియాని పసిగట్టవచ్చు. మెదడువాపు సమస్య జ్వరంతో మొదలవుతుంది. జ్వరం వచ్చిన కొన్ని రోజులకు వ్యాధి తీవ్రమవుతుంది. కానీ హైపోగ్లైసీమియా మెదడు వాపు వచ్చే వాళ్లకు ముందు జ్వరం రాకుండానే కళ్లు తిరగడం, వాంతులు, ఫిట్స్ వస్తాయి. హైపోగ్లైసీమియా వల్ల నిద్రమత్తు, కోమాలోకి పోయినా ప్రాణాపాయం కాదు. బాధితులకు వెంటనే ఓఆర్‌ఎస్ నీళ్లు తాగించాలి.సెలైన్ ద్వారా గ్లూకోజ్‌ని అందిస్తే ప్రాణాపాయం ఉండదు.