Wimbledon 2025: నేటి నుంచి వింబుల్డన్.. విజేతకు రూ.34 కోట్లు.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

Wimbledon 2025: నేటి నుంచి వింబుల్డన్.. విజేతకు రూ.34 కోట్లు.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

టెన్నిస్ లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వింబుల్డన్ సోమవారం (జూన్ 30) నుంచి ప్రారంభం కానుంది. మెన్స్ సింగిల్స్ లో అల్కరాజ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్నాడు. టాప్ సీడ్ సిన్నర్ తొలి వింబుల్డన్ టైటిల్ పై కన్నేశాడు. మరోవైపు 7 సార్లు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన సెర్బియన్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్ 8 వ టైటిల్ గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ గెలిచి ఫెదరర్ రికార్డ్ సమం చేయాలని భావిస్తున్నాడు. జ్వరేజ్, డ్రాపర్, ఫ్రిట్జ్, మెద్వదేవ్ తొలి వింబుల్డన్ టైటిల్ గెలవాలనే ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. 

 ఈ టోర్నీలో అందరి దృష్టి యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ పైనే ఉంది. గత మూడేళ్ళుగా టెన్నిస్ లో సంచలన విజయాలు సాధిస్తున్న ఈ స్పెయిన్ వీరుడు హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్ పై కన్నేశాడు. 2023 లో ఐదు సెట్ల పోరాటంలో జొకోవిచ్ కు బిగ్ షాక్ ఇచ్చిన అల్కరాజ్.. 2024 లో జొకోవిచ్ ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించాడు. 2025 లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఈ యువ స్పెయిన్ సంచలనం రెండో సీడ్ గా బరిలోకి దిగుతున్నాడు.

రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్లోస్.. 38 ఏళ్ల ఫాబియో ఫోగ్నినితో తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూన్‌తో తలపడే అవకాశం ఉంది. నంబర్ 1 ఆటగాడు సిన్నర్ తొలి రౌండ్ లో లూకా నార్డితో తలపడతాడు. జాక్ డ్రేపర్‌తో క్వార్టర్-ఫైనల్ ఆడే అవకాశం ఉంది. జొకోవిచ్ ఫ్రెంచ్ ఆటగాడు అలెగ్జాండర్ ముల్లర్‌తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన తొలి రౌండ్ లో ఆర్థర్ రిండర్‌క్నెచ్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడే అవకాశం ఉంది.              
 
విజేతకు రూ. 34 కోట్లు:  

వింబుల్డన్‌ 2025 లో ఈ సారి ప్రైజ్‌మనీ భారీగా పెంచారు. టైటిల్ విజేతగా నిలిచిన వారికి ఏకంగా రూ. 34 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. గత సీజన్ తో పోలిస్తే 10 శాతం ఎక్కువ కావడం విశేషం. పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది. తొలి రౌండ్ లో నిష్క్రమిస్తే రూ. 76 లక్షలు అందుతాయి. రన్నరప్ గా నిలిచిన వారికి రూ. 17 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్ అధికారులు వెల్లడించారు. మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్స్ తో పోల్చుకుంటే వింబుల్డన్ కు ఎక్కవ ప్రైజ్ మనీ లభించడం విశేషం. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
  
వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం ఇండియాలో జియో హాట్‌స్టార్ యాప్.. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.  స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.