రైలు కొనుక్కోవాలి.. రూ.300 కోట్లు అప్పు ఇవ్వండి

రైలు కొనుక్కోవాలి.. రూ.300 కోట్లు అప్పు ఇవ్వండి

కొత్త ఇల్లు కొనాలని.. కొత్త కారు కొనాలని.. బ్యాంకు లోన్ అడగటం సహజం. ఆఖరికి విమానాలు కొనడానికి బ్యాంకు లోన్లు తీసుకున్న వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి బ్యాంకు లోన్ తీసుకొని రైలు కొన్న వారిని ఎప్పుడైనా చూశారా! అస్సలు చూసుండరు. ఎందుకంటే మనదేశంలో రైల్వే వ్యవస్థ భారత ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కనుక అలాంటి సాహసాలు చేసిన వారు ఎవ్వరూ ఉండకపోవచ్చు. అలాంటిది ఓ వ్యక్తి సొంతంగా రైలు కొనడానికి.. బ్యాంకు సిబ్బందిని రూ.300 కోట్లు అప్పు అడిగారు.

ఉదయాన్నే లేచింది మొదలు ప్రతి ఒక్కరిని ప్రమోషన్ కాల్స్ విసిగిస్తూనే ఉంటాయి. కంపెనీ ప్రతినిధులు వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఏదో వంకతో వినియోగదారులకు కాల్స్ చేస్తూనే ఉంటారు. ఇలానే ఓ వ్యక్తికి బ్యాంకు సిబ్బంది నుండి కాల్ రాగా.. అతనిచ్చిన సమాధానానికి వారి నోటి నుంచి మాట రాలేదు.

నిషా అనే బ్యాంక్ ఉద్యోగిని.. ఒక ఖాతాదారుడికి కాల్ చేసి సార్ మీకేమైనా లోన్ అవసరం ఉందా అని అడిగింది. అందుకు అవును అని సమాధానమిచ్చిన అతను.. రైలు కొనడానికి రూ. 300 కోట్ల రుణం కావాలన్నారు. ఆ మాటలు విన్న సదరు ఉద్యోగి కాసేపు మౌనం వహించి సరే అంటుంది. ఆపై సార్.. మీకు గతంలో ఏవైనా రుణాలు తీసుకున్నాయా? అని ప్రశ్నించగా.. సదరు వ్యక్తి సైకిల్ లోన్ ఉందని బదులిచ్చారు. గతంలో హీరో సైకిల్  కొన్నానని.. అందుకు తాను రూ. 1600 అప్పు తీసుకున్నట్లు ఆమెతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కాల్ రికార్డింగ్ సంభాషణ విని నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. తాము కూడా ఇలాంటి సమాధానాలే ఇచ్చామని తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వీరి సంభాషణ  ఓసారి వినేసి కడుపుబ్బా నవ్వుకోండి.