క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్

క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్
  • క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్  
  • 2018 నాటి లోన్ అకౌంట్లు క్లోజ్ కావడంతో సమస్య 
  • రైతుల ఫోన్లకేమో రుణమాఫీ అయిందని మెసేజ్​లు
  • బ్యాంకుకు వెళ్తే డబ్బులు జమ కాలేదంటున్న మేనేజర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది బాధితులు 
  • సమస్యకు పరిష్కారం చూపాలని రైతుల వేడుకోలు 

కరీంనగర్, వెలుగు:  క్రాప్ లోన్లు ముందే చెల్లించిన రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. ప్రభుత్వం డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినప్పటికీ, అవి రైతుల అకౌంట్లలో పడడం లేదు. డైరెక్ట్‌‌ బెనిఫిషియరీ ట్రాన్స్‌‌ఫర్‌‌(డీబీటీ) ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంటే, అవి వేసినవి వేసినట్లే రిటర్న్‌‌ అవుతున్నాయి. రుణమాఫీ అయినట్టు రైతుల ఫోన్లకు మెసేజ్ లు వస్తుండగా, తీరా బ్యాంకులకు వెళ్లి చెక్ చేస్తే అకౌంట్లలో డబ్బులు పడలేదని బ్రాంచ్ మేనేజర్లు చెబుతున్నారు. 

లోన్ అకౌంట్ క్లోజ్ కావడం వల్లే ఇలా జరిగిందని సమాధానమిస్తున్నారు. కొన్ని బ్యాంకులు రెన్యూవల్‌‌ చేసిన క్రాప్‌‌లోన్‌‌ అకౌంట్లను మార్చడం, లోన్ రికవరీ కోసం రైతుల వెంటపడి పైసలు కట్టించుకున్న బ్యాంకులు.. మళ్లీ లోన్ ఇచ్చేటప్పుడు పాత అకౌంట్ క్లోజ్ చేసి, కొత్త అకౌంట్ మీద లోన్ ఇవ్వ డం, కొంతమంది రైతుల అకౌంట్లు ఇన్ యాక్టివ్ కావడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో డబ్బులు జమకాక రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇలాంటి సమస్య ఉందని ముందే తెలిసినప్పటికీ అగ్రికల్చర్ ఆఫీసర్లు, బ్యాంకర్లు పరిష్కారం కోసం ఆలోచన చేయలేదని మండిపడుతున్నారు. 

ఇదీ సమస్య.. 

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. లోన్ అమౌంట్ ఎప్పటికప్పుడు చెల్లించకుండా, లోన్ రెన్యూవల్ చేయించుకోకుండా ఉంటే లోన్ అకౌంట్లు మూడేండ్లు మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి. ఆ తర్వాత ఆ అకౌంట్లు నాన్ పెర్ఫామింగ్ అసెట్స్(ఎన్ పీఏ) కేటగిరీలోకి వెళ్తాయి. ప్రతిఏటా రెన్యూవల్ చేసుకుంటే ఎన్నేండ్లయినా అకౌంట్లు యాక్టివ్ గా ఉంటాయి.  కానీ రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే భరోసాతో చాలామంది రైతులు రెన్యూవల్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఇలాంటి అకౌంట్లన్నీ ఇన్ యాక్టివ్ అయ్యాయి. అలాగే కొన్ని బ్యాంకులు ప్రతి మూడేండ్లకు, కొన్ని ప్రతి ఐదేండ్లకు రెన్యూవల్‌‌ చేసిన క్రాప్‌‌లోన్‌‌ అకౌంట్లను మారుస్తున్నాయి. దీంతో లోన్‌‌ అకౌంట్‌‌ మారిపోవడం, ఇవి 2018 డిసెంబరు 11 వరకు ఉన్న అకౌంట్లు కాకపోవడంతో ఆర్థికశాఖ డీబీటీ చేసిన నిధులు రిటర్న్‌‌ అవుతున్నాయి. అలాగే కొందరు అకౌంట్ ఇన్ యాక్టివ్ అయ్యాక లోన్ రెన్యూవల్ చేసుకునేందుకు వచ్చినా పాత లోన్ అకౌంట్ ను తప్పనిసరిగా క్లోజ్ చేసుకుని, కొత్త అకౌంట్ ద్వారా లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా కూడా చాలా మంది అకౌంట్లు క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతం రుణమాఫీ అయిన అర్హుల్లో ఇలాంటి అకౌంట్లు ఉన్నోళ్లు 3 లక్షల మంది ఉంటారని అంచనా.  

రైతుల ఫోన్లకు మెసేజ్ లు..  

ఇప్పటికే 50 వేల లోపు రుణాలున్న 7,19,488 మందికి సంబంధించి రూ.1,943 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించింది. రూ.99, 999 వరకు లోన్ ఉన్న 9,02,843 మంది రైతులకు సంబంధించిన మాఫీకి రూ.5,809.78 కోట్లను ఇటీవల విడుదల చేసింది. దీంతో 4రోజులుగా ‘పంట రుణమాఫీ పథకం కింద ఆన్ లైన్ ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేశాం. మీ రుణం తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసినందన కొత్త పంట రుణం తీసుకోవాలనుకుంటే బ్యాంకు అధికారిని సంప్రదించండి’ అంటూ సదరు రైతుల సెల్ ఫోన్లకు సీఎం కేసీఆర్ పేరిట మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఆ లోన్ అకౌంట్లు యాక్టివ్ గా లేకపోవడంతో చాలా మందికి డబ్బులు జమ కావడం లేదు. 

డబ్బులు కట్టుడే తప్పైంది..  

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన బామండ్ల మల్లేశం 2017లో గన్నేరువరంలోని ఇండియన్ బ్యాంకులో రూ.89,470 క్రాప్ లోన్ తీసుకున్నాడు. ప్రభుత్వం రుణమాఫీ చేసేసరికి మిత్తి మీద పడ్తదనే భయంతో 2019లోనే వడ్డీతో పాటు అసలు కలిపి బ్యాంకుకు చెల్లించాడు. అదే ఏడాది మళ్లీ  కేడీసీసీ బ్యాంకు లో క్రాప్ లోన్ తీసుకున్నాడు. ఆయనకు బుధవారం రాత్రి 8:45 గంటలకు ‘మీ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ చేశాం’ అని మెసేజ్ వచ్చింది. దీంతో ఆశగా వెళ్లి బ్యాంకు మేనేజర్ ను అడిగితే లోన్ అకౌంట్ క్లోజ్ అయిందని, రుణమాఫీ డబ్బులు వచ్చి రిటర్న్ వెళ్లిపోయాయని సమాధానం చెప్పాడు. బ్యాంకుకు బాకీ ఉండడం ఎందుకని డబ్బులు కట్టుడే తప్పైందని మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు. 

అకౌంట్లు క్లోజ్ కావడంతోనే..  

కొందరు రైతులు లోన్ బకాయి ఉండొద్దనే ఉద్దేశంతో డబ్బులు పూర్తిగా కట్టేశారు. ఇలా డబ్బులు కట్టినప్పుడు ఆ లోన్ అకౌంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అలాంటి వారికి రుణమాఫీ డబ్బులు జమ కావడం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

‌‌–  ఘర్షన్, ఇండియన్ బ్యాంక్,బ్రాంచ్ మేనేజర్, గన్నేరువరం, కరీంనగర్