
10–15 శాతం పెరిగిన వడ్డీరేట్లు
వెలుగు బిజినెస్ డెస్క్ : ఓ వైపు వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తూ పోతూ ఉంటే.. మరోవైపు కొన్ని రుణాలపై వడ్డీరేట్లు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. షేర్లపై తీసుకునే రుణాల వడ్డీ రేట్లు గత మూడు నెలల కాలంలో 300 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు తెలిసింది. హై ప్రొఫైల్ వ్యాపారవేత్తలు డిఫాల్ట్ కావడమే ఈ వడ్డీ రేట్ల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. కంపెనీల ప్రమోటర్లు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి లేదా వర్కింగ్ క్యాపిటల్ కోసం, ఏ ఇతర మార్గాల నుంచి క్రెడిట్ పొందడానికి వీలు లేనప్పుడు షేర్లను తాకట్టు పెట్టి స్వల్పకాలానికి అప్పులు తీసుకుంటుంటారు. ఇటీవల లిక్విడిటీ సమస్యతో ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి. కొందరు వ్యాపారుల అప్పులు శక్తికి మించినవి కావడంతో, డిఫాల్ట్ అయ్యారు. దీంతో షేర్లపై అప్పులిచ్చే లెండింగ్ సంస్థలు తమ వడ్డీరేట్లు బాగా పెంచాయి.
ఆర్‌బీఐ గత నాలుగు పాలసీ రివ్యూల్లో 110 బేసిస్ పాయింట్ల రేటు కోతను చేపట్టింది. అయితే ఈ కాలంలో షేర్లపై రుణాల వడ్డీరేట్లు, మూడు నెలల క్రితం 8 శాతం నుంచి 12 శాతముంటే, ఇప్పుడవి 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయి. ఈ వడ్డీరేట్లు కూడా కంపెనీ ప్రొఫైల్, ప్రమోటర్ల ప్రొఫైల్ మీద ఆధారపడి ఉన్నట్టు లెండర్స్ చెప్పారు. సాధారణంగా షేర్లపై లోన్లు ఇచ్చే టెన్యూర్లు ఆరు నుంచి 24 నెలలుంటాయి. ఈ లోన్లను ఒక్కో సంస్థకూ రూ.20 లక్షలకు మించి ఇవ్వవు బ్యాంక్‌లు. ఇప్పుడు అత్యధిక వడ్డీ రేట్లతో పాటు మరింత కవరేజ్‌ను లెండర్స్ డిమాండ్ చేస్తున్నారని యాంబిట్ క్యాపిటల్‌కు చెందిన నారంగ్ చెప్పారు.
గత ఏడాది కాలంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరసగా18 శాతం, 25 శాతం పడిపోయాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ మార్కెట్లో డిఫాల్టర్‌గా నిలిచింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ కూడా రుణాలను తిరిగి చెల్లించడంలో సతమతమవుతోంది. ఎస్సెల్ గ్రూప్ పరిస్థితి కూడా ఇదే. దీంతో ఆ కంపెనీల స్టాక్స్ క్రాష్ అయ్యాయి. మార్కెట్ పడిపోవడంతో.. ఆ షేర్లను తనఖా పెట్టుకుని అప్పులిచ్చిన లెండర్స్‌తో తప్పనిసరి పరిస్థితులలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లు ( అంటే తనఖా షేర్లు అమ్మకుండా వేచివుండేలా) ఒప్పందాలను అప్పులు తీసుకున్న వాళ్లు చేసుకోవల్సి వచ్చింది. అదేవిధంగా షేర్లను తనఖాగా తీసుకుని అప్పులిచ్చిన చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. ఇలాంటి కంపెనీలలో ఒకటి కాక్స్ అండ్ కింగ్స్. ఈ కంపెనీ షేర్లను తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన యెస్ బ్యాంక్ ఇటీవలే ఆ షేర్లను తెగనమ్మింది. ఆగస్టు 13 వరకు రూ.1.86 లక్షల కోట్ల విలువైన షేర్లను 830 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తనఖా పెట్టారు.