ఆర్టీసీ కార్మికులకు లోన్లు ఇస్తలె

ఆర్టీసీ కార్మికులకు లోన్లు ఇస్తలె

సీసీఎస్ కు బకాయిలు చెల్లించని మేనేజ్ మెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు సీసీఎస్ (క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ) నుంచి లోన్ లు ఆగిపోయాయి. సీసీఎస్ కు ఆర్టీసీ మేనేజ్ మెంట్ రెండేండ్లుగా బకాయిలు చెల్లించడంలేదు. దీంతో ఫండ్స్ లేక కార్మికులకు సీసీఎస్ లోన్ లు ఇవ్వడంలేదు. ప్రస్తుతం సీసీఎస్ వద్ద 6,500 మంది కార్మికుల లోన్ అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. కుటుంబ అవసరాలకు తప్పనిసరి కావడంతో కార్మికులు వడ్డీ వ్యాపారుల నుంచి, బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి లోన్లు తీసుకుంటున్నారు. కొందరు బంగారం తాకట్టు పెడుతున్నారు. సీసీఎస్ నుంచి లోన్ లు వచ్చాక ఈ అప్పులు తీర్చొచ్చని, బంగారాన్ని విడిపించుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో  ప్రస్తుతం సీసీఎస్ లోన్లు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో తమ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 

హైకోర్టులో సీసీఎస్ పిటిషన్   


ఆర్టీసీ బకాయిలపై సీసీఎస్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బకాయిలు చెల్లించాలని కోర్టు నోటీసులు పంపింది. ఆ నోటీసులను పట్టించుకోకపోవటంతో సీసీఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీంతో 2020లో దశల వారీగా రూ.200 కోట్లను ఆర్టీసీ విడుదల చేసింది. ఈ పిటిషన్ పై తుది తీర్పు రాకపోవటంతో దీనికి కొనసాగింపుగా ఇటీవల మరో పిటిషన్ దాఖలు చేశారు.  ఆగస్ట్ 2020 నుంచి సీసీఎస్ కు ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు చెల్లించడం లేదని.. అసలు, మిత్తీ కలిపి రూ.886 కోట్లు రావాలని పిటిషన్​లో సీసీఎస్ పేర్కొంది. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుందంటున్నారు.   
 

6,500 లోన్ అప్లికేషన్లు పెండింగ్ 

ఆర్టీసీ మేనేజ్ మెంట్ నుంచి బకాయిలు రాక కార్మికులకు సీసీఎస్ నుంచి లోన్లు అందట్లేదు. ప్రస్తుతం 6,500 మంది లోన్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, ఫండ్స్ లేకపోవటంతో వీరికి లోన్లు ఇవ్వలేదని సీసీఎస్ అధికారులు చెబుతున్నారు. సీసీఎస్ లో సభ్యత్వం ఉన్న వారిలో 90 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లే ఉన్నారు. తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయని అప్లికేషన్లు పెట్టుకోగా లోన్లు రావటం లేదని వాపోతున్నారు. 
 

మెంబర్ షిప్ రద్దు చేసుకుంటున్రు  

సీసీఎస్​లో ఆర్టీసీ కార్మికులు, అధికారులు మొత్తం 47 వేల మందికి మెంబర్ షిప్ ఉండగా లోన్లు రాకపోవటంతో 10 వేల మంది కార్మికులు మెంబర్ షిప్ ను రద్దు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో 250 మంది అధికారులకు సీసీఎస్ మెంబర్ షిప్ ఉండగా ఎండీ తరువాత హోదాలో ఉండే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు సైతం మెంబర్ షిప్ రద్దు చేసుకున్న వారిలో ఉన్నారు. వీరికి జీతం, అలవెన్సులు కలిపి ప్రతి నెలా  రూ.3 లక్షలపైనే వస్తోంది. ఇంత పెద్ద అధికారులే మెంబర్ షిప్ క్యాన్సిల్ చేసుకోవటంతో కార్మికులు కూడా రద్దు చేసుకుంటున్నారు. ఆర్టీసీ మేనేజ్ మెంట్ నుంచి బకాయిలు రూ. వెయ్యి కోట్లకు సమీపిస్తుండటం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా  బకాయిలను చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఈడీలు మెంబర్ షిప్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
 

ఎన్నికలు పెట్టకుండా ఒత్తిడి తెస్తున్రు  

సీసీఎస్ పాలకమండలి గడువు నిరుడు నవంబర్ లో ముగిసింది. అన్ని డిపోల నుంచి కార్మికులు ఓట్లు వేసి సీసీఎస్ పాలకమండలి డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అయితే, గడువు ముగిసినా సీసీఎస్​కు ఎన్నికలు పెట్టకుండా కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్ అధికారులపై ఆర్టీసీ మేనేజ్ మెంట్ ఒత్తిడి తెస్తోందని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికే 4 సార్లు పాలక మండలి టర్మ్​ను పొడిగించారు. ఆఖరు సారి ఇచ్చిన పొడిగింపూ వచ్చే నెల 22న ముగియనుందని చెప్తున్నారు. సీసీఎస్ కు ఎన్నికలు పెడితే మళ్లీ ఆర్టీసీలో రాజకీయాలు మొదలవుతాయనే ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. 2 పీఆర్సీలు, డీఏలు, సీసీఎస్ బకాయిలు, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, పని భారం, ఇతర సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఎన్నికలు పెడితే అధికార పార్టీకి ఇబ్బంది అనే ఆపుతున్నారని నేతలు అంటున్నారు. 

జీతాల్లో కట్ చేసి.. సీసీఎస్​కు ఇస్తలే  

ఆర్టీసీ కార్మికులు తమ పిల్లల ఉన్నత చదువులకు, ఇండ్లు కట్టుకునేందుకు, పిల్లల పెండ్లిండ్లకు, ఇతర ఖర్చుల కోసం సీసీఎస్ నుంచి లోన్లు తీసుకునేందుకు వారి జీతాల్లోంచి ప్రతి నెలా7 శాతం కట్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నెలా సీసీఎస్​కు ఆర్టీసీ యజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై వడ్డీ యాడ్ చేసి సీసీఎస్ నుంచి కార్మికులకు లోన్లు ఇస్తుంటారు. అయితే, ఆర్టీసీకి నిధుల కొరత, నష్టాలు, అప్పులు పెరగటంతో సీసీఎస్ కు ఇవ్వాల్సిన నిధులను మేనేజ్ మెంట్ ఆగస్ట్ 2020 నుంచి చెల్లించట్లేదు. సీసీఎస్​కు ఇవ్వాల్సిన నిధులతోనే కార్మికులకు జీతాలు, లోన్లకు వడ్డీ చెల్లిస్తున్నారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.