ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులిస్తం.. ప్రైవేట్​ వడ్డీ వ్యాపారుల నయా దందా

ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులిస్తం.. ప్రైవేట్​ వడ్డీ వ్యాపారుల నయా దందా

 

  •     బ్యాంకుల చుట్టూ తిరగలేక వడ్డీ వ్యాపారుల వద్దకు జనాలు..
  •     వారి అవసరాలను అదనుగా చేసుకుని అధిక వడ్డీ వసూలు
  •     ఇరువర్గాల మధ్య తేడా వస్తే భవిష్యత్​లో ఇబ్బందులు
  •     ఇల్లీగల్​ అగ్రిమెంట్లు వద్దంటున్న పోలీస్​ఆఫీసర్లు, న్యాయనిపుణులు

నల్గొండ, వెలుగు :  అప్పు కోసం ఆస్తులు అమ్ముకుంటున్న సంఘటనలు ఈమధ్య పెరిగిపోతున్నాయి. కరోనా దెబ్బకు మూడేండ్ల పాటు ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులు, చాలీచాలని సంపాదన ఉన్న  జనాలు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకుంటున్నారు.  బ్యాంకుల చుట్టూ తిరగలేక, ప్రైవేటు ఫైనాన్స్​ కంపెనీల వడ్డీలు భరించలేని ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  దీన్ని అదనుగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆస్తులు లేనివాళ్లు ఒంటిమీద బంగారం కుదువపెట్టుకుని అప్పు తీసుకుంటున్న వాళ్లు కొందరైతే..  చాలా మంది ఉన్న కొద్దిపాటి ఆస్తులను ఏకంగా అమ్మకానికి పెడ్తున్నారు.  దీనివల్ల  భవిష్యత్​లో ఇబ్బందులు ఎదురవుతాయని  లాయర్లు, పోలీస్​ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. 

ప్రైవేటు వ్యాపారుల కొత్త దందా..

అప్పు కోసం బ్యాంకర్లను  ఆశ్రయిస్తే  లేనిపోని కొర్రీలతో ఇబ్బందులు పెడ్తున్నారని, ఫైనాన్స్ కంపెనీల్లో నాలుగైదు రూపాయల వడ్డీ వసూలు చే స్తున్నారని చెప్పి సులువుగా డబ్బు లభించే మార్గాలను వెతుక్కుంటున్నారు.  దీనిలో భాగంగా మార్కెట్​లో నెలకు ఒక రూపాయి, రెండు రూపా యిలు వడ్డీ వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు.  గతంలో ప్రామిసరీ నోటు, చెక్కులను గ్యారెంటీగా పెట్టుకుని వడ్డీలు నడిపే ఇలాంటి వాళ్లు ఇప్పుడు డబ్బు అవసరం పెరిగిపోవడంతో ఏకంగా ఆస్తులు రిజిస్ట్రేషన్​ చేసుకునే కొత్త దందాకు తెరలేపారు. చట్ట ప్రకారం మార్టిగేజ్ చేసుకు ని అప్పు ఇచ్చే పద్ధతిని పక్కన పెట్టి ఏకంగా ఆస్తులను తమ పేరు మీద సేల్​డీడ్​ చేయించుకుంటున్నారు. ఎకరం భూమికి రూ.పదిలక్షలు, రెండొం దల గజాల ప్లాటుకు మార్కెట్​ రేటును బట్టి రూ.పది, పదిహేను లక్షలు ఇస్తున్నారు. ప్రతీ నెల వడ్డీ చెల్లించాలనే కండీషన్​ మీద అప్పులు ఇస్తున్నారు. 

రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్లు..

రిజిస్ట్రేషన్​ చేయిస్తే ఆస్తిపై హక్కులు కోల్పోయినట్లే.  రెండు పార్టీల మధ్య బాండ్​ పేపర్ల మీద పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు.  ఫలానా టైమ్​కు ​అప్పు చెల్లిస్తానని, లేనిపక్షంలో భూమిపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందని ఇల్లీ గల్​ అగ్రిమెంట్లు ఇరువర్గాల మధ్య జరుగుతున్నాయి.  చట్టప్రకారం రిజిస్ట్రేషన్​ జరిగాక ఎలాంటి అగ్రిమెంట్లు చెల్లవని న్యాయవాదులు చెప్తున్నారు. మార్టిగేజ్​ చేసుకుంటేనే ఆస్తి పై హక్కులు ఇరువర్గాలకు ఉంటాయని, మార్టిగేజ్​ ప్రాపర్టీలకు 12 ఏళ్ల టైమ్​ ఉంటుందని, అప్పటిలోగా అప్పు తీర్చకపోతే చట్ట ప్రకారం ప్రొసీడ్​ కావొచ్చని అంటున్నారు. ఇదే పద్ధతి అగ్రికల్చర్​ భూములకు వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వ్యవసాయ భూములను మార్టిగేజ్​ చేసుకునే లోన్లు ఇస్తున్నాయని, 

ధరణిలో ఇలాంటి ఆప్షన్​ అందరికీ వర్తిస్తుందని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. వ్యవసాయ భూములను అమ్మకుండా ధరణిలో మార్టిగేజ్​ చేసుకోవడం వల్ల భూములపై హక్కులు మారవని, ఇన్​టైంలో అప్పు చెల్లించకుంటే కోర్టులో దావా వేసుకునే రైట్స్​ ఉంటాయని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. కానీ మార్టిగేజ్​పై నమ్మకం లేని ప్రైవేటు వ్యాపారులు రిజిస్ట్రేషన్​ చేస్తేనే అప్పులు ఇస్తామని లేదంటే కుదరదని తేల్చి చెప్తున్నా రు. ఇటీవల కాలంలో ప్రైవేటు వ్యాపారులు భూములు,  ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేసుకుంటున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు.
నల్గొండ జిల్లాలోని ఓ రాజకీయ నాయకుడు మార్కెట్ చైర్మన్​పదవి పొందేందుకు తనకు భూమి లేకపోతే తన ఫ్రెండ్​ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయమని కోరాడు.  దోస్తే కదా అని అతడు తనకున్న నాలుగు ఎకరాలు  సదరు నాయకుడి పేరు మీద రిజిస్ట్రేషన్​ చేశాడు. చైర్మన్​గా ఎన్నికైన ఆరు నెలల్లో తిరిగి భూమి రిజిస్ట్రేషన్​ చేస్తా అని నమ్మించాడు. ఇప్పటికీ  ఏడాది దాటింది. అయినా ఆ చైర్మన్​​ భూమి రిజిస్ట్రేషన్​ చేయలేదు.  దీంతో ఆ ఫ్రెండ్​ లాయర్​ నుంచి  నోటీసు ఇప్పించాడు. చివరకు కోర్టులో దావా వేశాడు. చైర్మన్​కు భూమి రిజిస్ట్రేషన్​​ చేయకముందు నాలుగు ఎకరాలు పది లక్షలు పలికింది. ఇప్పుడు అదే భూమి ఎకరం పది లక్షలు.  ల్యాండ్​ వ్యాల్యూ పెరగడంతో ప్లేట్​ ఫిరాయించిన ఆ చైర్మన్​..తన ఫ్రెండ్​కు భూమి రిజిస్ట్రేషన్​ చేయకపోగా, ఆ భూమి తనకు అమ్మాడని, దాని పైన ఎలాంటి  రైట్స్​ లేవని కోర్టులో రివర్స్​ కేసు ఫైల్​ చేశాడు. ఇప్పుడా కేసు కోర్టులో నడుస్తోంది. 

సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు తన వ్యాపారం కోసం ఓ ప్రైవేటు వ్యక్తి దగ్గర రూ.15 లక్షల అప్పు తీసుకున్నాడు. దీనికి బదులు తనకున్న ఎకరంన్నర భూమిని సేల్​డీడ్​ చేశాడు. కరోనా వల్ల నష్టపోయిన తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరగలేక, ఫైనాన్స్ వడ్డీలు కట్టలేక అప్పటికే అప్పుల పాలైన యువకుడు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్​ చేశాడు. చట్ట ప్రకారం మార్టిగేజ్​ చేసుకునే అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తులు అందుకు ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేక ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్​ చేశాడు. దీంతో ఆ భూమిపైన తనకున్న సర్వహక్కు లు కోల్పోయినట్లేనని, ఇద్దరి మధ్య ఎలాంటి అగ్రిమెంట్లు జరిగినా వాటిని కోర్టు అంగీకరించదని లాయర్లు చెప్తున్నారు.

చట్ట ప్రకారం అగ్రిమెంట్లు చెల్లవు.. 

మార్టిగేజ్​ ప్రాపర్టీకే  లీగల్​రైట్స్​ ఉంటాయి. అప్పుల కోసం ఆస్తులు రిజిస్ట్రేషన్​ చేసుకోవడం సరికాదు. ఇంటర్నల్​గా రెండు పార్టీలు బాండ్​ పేపర్ల మీద, తెల్లకాగితాల పైన చేసుకునే అగ్రిమెంట్లు కోర్టు అంగీకరించదు. సేల్​ డీడ్​ అంటే ఆస్తిపై సర్వహక్కులు కోల్పోయినట్లే.  అప్పుతీసుకున్న వ్యక్తి దగ్గర ఒరిజినల్​ డాక్యుమెంట్ ఉన్నా.. కబ్జాలో తామే ఉన్నట్టు రుజువు చూపిస్తే కొంత వరకు సేఫ్​.  కానీ ఆ విషయాన్ని కోర్టులో ప్రూవ్​ చేయడానికి చాలా టైమ్​ పడుతుంది.  బ్యాంకులు మార్టిగేజ్​ చేసుకుంటాయి తప్పా ఆస్తులను అనుభవించవు. కానీ ఇక్కడ ప్రైవేటు వ్యాపారులు తమ పేరు మీదనే ఆస్తులు రిజిస్ట్రేషన్​ చేసుకోవడం మంచి విధానం కాదు.
- అక్కినేపల్లి మురళీధర్​రావు, న్యాయవాది, నల్గొండ

నేరాలు జరిగే ప్రమాదం ఉంది 

ప్రతీ సోమవారం గ్రీవెన్స్​కు  ఫైనాన్స్ బాధితులు వస్తుంటారు. వాళ్లలో అధిక  వడ్డీల బారిన పడ్డవాళ్లే ఎక్కువ. ప్రజల్ని మోసం చేసినట్లు రుజువైతే  కే సులు పెడ్తున్నాం. ఇటీవల ఓ వ్యక్తి పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాం. అగ్రిమెంట్లు రాసుకుని, ఆస్తులు రిజిస్ట్రేషన్​ చేసుకుని అప్పులు ఇవ్వడం కరెక్ట్​ కాదు. చట్ట ప్రకారం సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో నేరాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఆవిధంగా ఎవరైనా మోసపోతే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయవచ్చు.
- అపూర్వరావు, ఎస్పీ, నల్గొండ