5 ఏండ్లలో రైటాఫ్ చేసిన లోన్లు రూ.10 లక్షల కోట్లు

5 ఏండ్లలో రైటాఫ్ చేసిన లోన్లు  రూ.10 లక్షల కోట్లు
  • లోక్​సభలో ప్రకటించిన మంత్రి నిర్మలా సీతారామన్​
  •     వీటి వసూలుకు చర్యలుంటాయని ప్రకటన

న్యూఢిల్లీ:షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకులు గడచిన ఐదేళ్లలో రూ.10.09 లక్షల కోట్ల విలువైన లోన్లు రైట్​ఆఫ్​ చేశాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో సోమవారం ప్రకటించారు. బారోవర్ల నుంచి అన్ని రకాల బకాయిలను వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బకాయిల్లో రైట్​ఆఫ్​ చేసిన లోన్లనూ చేరుస్తామని వివరణ ఇచ్చారు. ఆర్​బీఐ లెక్కల ప్రకారం ఇదేకాలంలో బ్యాంకులు  రూ.4,80,111 కోట్ల  (రైట్​ఆఫ్​ చేసిన రూ.1,03,045 కోట్లతో సహా) బకాయిలను వసూలు చేశాయని వివరించారు. రైట్​ఆఫ్​ చేసిన లోన్ల బకాయిలను వసూలు చేయడానికి అందుబాటులో ఉన్న విధానాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. సివిల్ కోర్టులు లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌‌లో కేసులు వేయడం, ఫైనాన్షియల్ అసెట్స్ సెక్యూరిటైజేషన్  రీకన్‌‌స్ట్రక్షన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం,   నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌లో ఇన్‌‌సాల్వెన్సీ  కోడ్ కింద కేసుల దాఖలు,  చర్చలు, ఎన్​పీఏల అమ్మకం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైటాఫ్​ వల్ల బారోవర్లకు ప్రయోజనం ఏమీ ఉండదని ఆమె చెప్పారు. ఆర్‌‌బీఐ మార్గదర్శకాలు,  బ్యాంకుల బోర్డుల పాలసీ ప్రకారం ఎన్​పీఏలను ప్రొవిజనింగ్ చేశాక వాటిని బ్యాంకు బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగిస్తారని మంత్రి చెప్పారు.  బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌‌ను క్లీన్ చేయడం, పన్ను ప్రయోజనాలను పొందడం,  మూలధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి రైట్-ఆఫ్‌‌లపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.  ఎగవేతదారుల నుంచి వసూలు అయిన మొత్తం నుంచి చిన్న డిపాజిటర్లకు డబ్బు చెల్లించడం కష్టంగా మారిందన్నారు. చట్టపరమైన ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని,  బ్యాంకులు,  ఇతర ఆర్థిక సంస్థలు జప్తు చేసిన ఆస్తులకు చాలా మంది హక్కుదారులు ఉంటారని ఆమె వివరించారు. డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తనకు తెలుసునని, ఈ ప్రక్రియను ఎలా సులభతరం చేయాలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.   అంతకుముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌‌రావ్ కరద్ మాట్లాడుతూ, ఆర్‌‌బీఐ రూల్స్‌ కారణంగా ఎగవేతదారుల పేర్లను వెల్లడించడం లేదని,  వారి ఆస్తులను వేలానికి ఉంచిన తర్వాత  పేర్లను బయటపెట్టవచ్చని అన్నారు.

రూ.907 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తుల అటాచ్​

ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ రూ. 907 కోట్ల విలువైన   క్రిప్టో ఎక్స్ఛేంజీల ఆస్తులను అటాచ్ చేసిందని, మనీలాండరింగ్‌‌కు సంబంధించిన కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. దేశంలోని12 క్రిప్టో ఎక్స్ఛేంజీలు రూ. 87.60 కోట్ల విలువైన జీఎస్టీని ఎగ్గొట్టినట్టు అధికారులు గుర్తించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వడ్డీ, జరిమానా రూపంలో  వీటి నుంచి రూ.111 కోట్ల రికవరీ జరిగిందని చెప్పారు. 8 కేసుల్లో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, నాలుగు కేసులు మూసివేశామని మంత్రి తెలిపారు. వజీర్‌‌ఎక్స్‌‌ నిర్వహించే జన్మై ల్యాబ్స్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు  దాని డైరెక్టర్ల నుండి రూ. 289.68 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు చౌదరి తెలిపారు. 

మూన్​లైటింగ్​ కుదరదు

ఉద్యోగులు మూన్​లైటింగ్​ చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడాన్ని మూన్​లైటింగ్​గా పిలుస్తున్నారు.   యజమాని ఆసక్తికి వ్యతిరేకంగా కార్మికుడు ఏ రకమైన పనిని చేయకూడదని, అయితే ఈ సమస్యపై ప్రభుత్వం స్టడీ చేయలేదని సోమవారం కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగుల్లో కొందరు మూన్‌‌లైటింగ్‌‌ను ఆశ్రయించడంతో ఈ సమస్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐటీ నిపుణులలో చాలా మంది మూన్​లైటింగ్​చేస్తారని చెబుతుంటారు. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌‌మెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) యాక్ట్ 1946 ప్రకారం యజమానికి తెలియకుండా మరో ఉద్యోగం చేయడం తప్పని కార్మిక,  ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్‌‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  

బ్యాంకుల ‘ప్రైవేట్‌’..చర్చల తర్వాతనే
సంబంధిత శాఖలు,  రెగ్యులేటర్‌‌తో సంప్రదించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ) ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయానికి వస్తామని లోక్​సభలో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే బాధ్యతను సంబంధిత క్యాబినెట్ కమిటీకి అప్పగిస్తామని ఈ శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ లోక్‌‌సభకు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌‌లో, రెండు పీఎస్​బీల్లో,  ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌‌ఇ)లో పెట్టుబడులను అమ్ముతామని ప్రకటించారు. ప్రైవేట్ మూలధనం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధిని చేయడం, తద్వారా ఆర్థిక వృద్ధికి, కొత్త ఉద్యోగాలకు తోడ్పడడం, సామాజిక రంగానికి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించడం ప్రైవేటీకరణ లక్ష్యమని చెప్పారు.

చెలామణిలో రూ.32 లక్షల కోట్ల నోట్లు

ప్రస్తుత సంవత్సరం డిసెంబర్ రెండో తేదీ నాటికి చెలామణిలో ఉన్న నోట్ల (ఎన్​ఐసీ) విలువ వార్షికగా 7.98 శాతం పెరిగి రూ. 31.92 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్​సభలో తెలిపారు.   ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల స్థాయితో సహా పలు స్థూల ఆర్థిక అంశాలపై కరెన్సీకి డిమాండ్ ఆధారపడి ఉంటుందని ఆమె ఎంపీలకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లేదా నోట్ల పరిమాణం, జీడీపీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, మురికిగా ఉన్న నోట్లను మార్చడం,  క్యాష్​లెస్​ పద్ధతుల్లో పెరుగుదల కారణంగా నోట్లకు డిమాండ్‌‌ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. నల్లధనం చెలామణిని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నామని   స్పష్టం చేశారు. ప్రభుత్వంతోపాటు ఆర్​బీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నాయని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.