మే 3 వరకూ లాక్​డౌన్: మోడీ​

మే 3 వరకూ లాక్​డౌన్: మోడీ​
  • మరో 19 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగింపు
  • కరోనా హాట్ స్పాట్లపై ఎక్కువగా ఫోకస్
  • ఈ నెల 20 వరకూ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తాం
  • ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో షరతులతో మినహాయింపులు
  • కేసులు పెరిగితే మళ్లీ లాక్​డౌన్​ అమలు చేస్తాం
  • లాక్​డౌన్​కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు
  • దేశప్రజలనుద్దేశించి 25 నిమిషాలపాటు ప్రధాని ప్రసంగం
  • లాక్ డౌన్ పై రేపు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: మే 3వ తేదీ వరకూ లాక్​ డౌన్​ కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మరో 19 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ నెల 20 వరకు దేశంలో పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తామని, హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలకు షరతులతో మినహాయింపు ఇస్తామని తెలిపారు. కరోనా కేసులు తగ్గితేనే ఈ సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే వారం రోజులు చాలా కీలకమని, హాట్​ స్పాట్లలో మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామని ప్రకటించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్‌ను బుధవారం విడుదల చేస్తామన్నారు. మంగళవారం ఉదయం ఆయన దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ.. దేశ ప్రజలంతా లాక్‌డౌన్‌ను ఒక బాధ్యతగా పాటించాలని కోరారు. ‘‘లాక్​ డౌన్​కు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. లాక్​ డౌన్​ తో చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. తినడానికి, ప్రయాణాలకు కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలను తట్టుకుంటూ వారంతా దేశాన్ని కాపాడుకుంటున్నారు. ఎకానమీ కంటే జీవితం గొప్పది. మే 3 వరూ ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఒక్క రోగి కొత్తగా కరోనా బారిన పడకూడదనేదే మా లక్ష్యం” అని మోడీ చెప్పారు.

ప్రజల త్యాగాల వల్లే నష్టాలు తగ్గాయి​
21 రోజుల లాక్​డౌన్​ సంతృప్తికరంగా అమలైందని, ఈ విజయంలో ప్రజలదే కీలకపాత్రని, వారి త్యాగాల వల్లే కరోనా నష్టాలను తగ్గించుకున్నామని మోడీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర ఎలా ఉందో అందరికీ తెలుసని, యూరోప్, అమెరికాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించిందని, ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడిలో మనం ముందున్నామని మోడీ చెప్పారు. దేశంలో ఒక్క కరోనా కేసు రాకముందే.. ఫారిన్ నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్​ చేయడం మొదలుపెట్టామని, కరోనా మహమ్మారిగా మారకముందే చర్యలు చేపట్టామన్నారు. ‘‘దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ ప్రకంటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనాను అడ్డుకునే ప్రయత్నం చేశాం. కరోనా వ్యాప్తి విషయంలో ఒకప్పుడు ఇండియాతో సమానంగా ఉన్న దేశాల్లో.. ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు పెరిగాయి. మనం కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. ఈరోజు మన పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. సోషల్​ డిస్టెన్స్, లాక్‌డౌన్‌ వల్లే మంచి ఫలితాలు వచ్చాయి”అని మోడీ చెప్పారు.

అంబేడ్కర్​కు ఇదే నిజమైన నివాళి
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు మనమంతా నివాళులు అర్పిస్తున్నామని, కరోనాపై పోరు, లాక్​డౌన్​ సమయంలో రాజ్యాంగంలోని ‘‘వియ్​ ద పీపుల్​ ఆఫ్ ఇండియా” స్ఫూర్తి కనిపించిందని, ఈ స్ఫూర్తిని చూపించడం ద్వారా అంబేడ్కర్​కు మనం నిజమైన నివాళి అర్పించామని మోడీ అన్నారు. కష్టమైనా, నష్టమైనా దేశం కోసం జనం నిలబడ్డారని, వారి ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. భిన్న మతాలు, కులాలు ఉన్న మనదేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయని, అనేక రాష్ట్రాల్లో కొత్త ఏడాది ప్రారంభమైందని, పండగలు ఉన్నా ప్రజలు ఇండ్లలోనే ఉండి తమను తాము కంట్రోల్​ చేసుకున్నారని, ప్రజలందరి ఆరోగ్యం కోసం తను దేవుడిని ప్రార్థిస్తున్నానని మోడీ చెప్పారు.

అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి
లాక్​డౌన్​, సోషల్​ డిస్టెన్సింగ్​ వల్ల చాలా మేలు జరిగిందని, దేశంలోని ప్రతి పౌరుడు కరోనాపై ఒక సైనికునిలా పోరాటం చేస్తున్నాడని మోడీ ప్రశంసించారు. ‘‘ఈ నెల 20 వరకు దేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా, పట్టణం, గ్రామంలో ఏం జరుగుతుందో పరిశీలిస్తాం. హాట్‌స్పాట్‌ల సంఖ్య తగ్గి.. కొత్త కేసులు పెరగకపోతే 20వ తేదీ తర్వాత పేదల కోసం కొన్ని చోట్ల మినహాయింపు ఇస్తాం. ఒకవేళ కేసులు పెరిగితే మినహాయింపులు తీసేస్తాం. అందువల్ల మనం కరోనా కట్టడికి జాగ్రత్తగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు ఎదువ్వకుండా దేశంలో కరోనా కోసం ప్రత్యేకంగా లక్ష బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. 600 ప్రత్యేక హాస్పిటల్స్‌ ఏర్పాటు చేశాం. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’’ అని మోడీ పిలుపునిచ్చారు.