
భూపాలపల్లి రూరల్, వెలుగు : భూపాలపల్లి పట్టణంలోని లక్ష్మినగర్ లో శనివారం రాత్రి తాళం వేసిన తొమ్మిది ఇండ్లలో చోరీ జరిగింది. భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ వివరాల ప్రకారం.. రాఖీ పండుగ సందర్భంగా లక్ష్మీ నగర్ లోని తొమ్మిది ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు.
ఆదివారం ఇండ్ల యజమానులు తిరిగి రాగా, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ముఖాలు కనిపించకుండా టార్చ్ లైట్లను సీసీ టీవీలకు కొట్టినట్లు కనపిస్తోంది. ఈ చోరీలో సుమారు 25 తులాల బంగారం, 50 తులాల వెండి, మూడున్నర లక్షల నగదు అయినట్లు సీఐ తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు. దుండగులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.