రోజుకో సర్వే.. పూటకో రిపోర్ట్

రోజుకో సర్వే.. పూటకో రిపోర్ట్
  •     ఎన్నికల వేళ.. పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా సర్వేలు
  •     ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో కనీసం 15 లక్షల ఓటర్లు
  •     5 వేల మందిని కూడా ప్రశ్నించకుండానే సర్వే నివేదికలు
  •     పార్టీల గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం
  •     మీడియా చానెల్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతో ఫేక్ సర్వేలూ వ్యాప్తి

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో, రాష్ర్టంలో నిత్యం సర్వే రిపోర్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సర్వేలు ఎపుడు చేశారో, ఏ ప్రాంతాల్లో చేశారో, ఎంత మందితో మాట్లాడారో కూడా అర్థం కావటం లేదని నేతలు అంటున్నారు. కేవలం 5 వేలలోపు మందితో మాట్లాడి ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీదే విజయం.. పలనా అభ్యర్థే గెలుస్తున్నాడంటూ సర్వే రిపోర్టులను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లు వీటిని ప్రసారం చేస్తూ పోటీ చేస్తున్న అభ్యర్థులకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయని నేతల అనుచరులు చెబుతున్నారు. 

కొన్ని సర్వే ఏజెన్సీలు ఎన్నికల టైమ్ లో ఏర్పాటు చేస్తూ కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేస్తూ రిపోర్టులు ఇస్తున్నాయని అంటున్నారు. ఇక ప్రముఖ మీడియా చానెల్ సర్వే రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో పార్టీల అనుచరులు కార్యకర్తలు ఫేక్ సర్వే రిపోర్ట్ లు రెడీ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ చానెల్స్ కు ఉన్న క్రెడిబిలిటీతో వీటిని పబ్లిక్ ను ఈజీగా నమ్మించవచ్చన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.  

15 లక్షలకు పైనే ఓటర్లు

రాష్ర్టంలో లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక్కో సీటులో యావరేజ్ గా15లక్షలకుపైనే ఓటర్లు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో అయితే సుమారు 32 లక్షల ఓటర్లు ఉంటారు. యూత్, మహిళలు, కార్మికులు, రైతులు, వృద్ధులు, డైలీ వర్కర్లు, సెటిలర్స్, ఇతర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్లు ఇలా ఎన్నో వర్గాల ఓటర్లు ఉండగా కేవలం 5 వేల మంది శాంపిల్స్ తో సర్వే చేసి ఓటర్లు ఇలాగే జడ్జిమెంట్ ఇస్తున్నారని చెప్పటం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని వర్గాల ఓటర్లతో మాట్లాడకుండా, నియోజకవర్గంలో  ఏం సమస్యలు ఉన్నాయి, గత ఎంపీలు ఏ సమస్యలు పరిష్కరించిండ్రు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా, ఇపుడు గెలిపిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నరు? ఇలాంటి ప్రశ్నలు లేకుండానే చాలా సర్వేలు చేస్తున్నట్లు చెప్తున్నారు. 

అభ్యర్థుల పేర్లూ తప్పు

సర్వేలు చేసి రిపోర్ట్ లు ఇస్తున్న సమయంలో వాటి డొల్లతనం బయటపడుతోంది. రాష్ర్టంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైమ్ లోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో బయటకు వచ్చాయి. పార్టీలు అభ్యర్థులను  ప్రకటించకముందే పలానా అభ్యర్థికి టికెట్ ఇస్తున్నరని, ఆయనే గెలుస్తున్నరని పలు సర్వేల రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఇక పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చిన సీట్లలో కూడా.. పోటీ చేయని పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని సర్వే రిపోర్ట్ లు ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. 

ఇటీవల ఓ ఎంపీ సీటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విన్ అవుతున్నారని ఓ సర్వే రిపోర్ట్ విడుదల చేశారు. చివరకు ఆ పార్టీ వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో సర్వే రిపోర్ట్ తుస్సుమంది. అయితే, ఇలాంటి ఫేక్ సర్వేలు, విశ్వసనీయత లేని సర్వేల వల్ల జెన్యూన్ ఏజెన్సీలకు విలువ ఉండటం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతోనూ.. 

అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతో కూడా ఫేక్ సర్వే రిపోర్ట్ లు బయటకు వచ్చాయి. ఎన్నికల్లో పలానా పార్టీ విన్ అవుతుందని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్తూ రిపోర్ట్ క్రియేట్ చేశారు. అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇలాంటి పొలిటికల్ సర్వేలు ఎందుకు చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అంత ఖాళీగా ఉన్నారా? అని సోషల్ మీడియాలో ఈ సర్వేలు బాగా ట్రోల్ అయ్యాయి. 

అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పోలిటికల్ సర్వేలు చేయరన్న కనీస నాలెడ్జ్ కూడా వీటిని సర్క్యులేట్ చేసే వారికి లేదని ఈ రిపోర్ట్ లు చూస్తే అర్థమవుతోందని చెప్తున్నారు. ఇక ఈ సర్వేలను ప్రముఖ న్యూస్ చానెల్స్ టెలికాస్ట్ చేసినట్లు కూడా వీడియోలు క్రియేట్ చేసి పార్టీల గ్రూప్ లలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో ఆయా చానెళ్ల యాజమాన్యాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నాయి.