మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర

మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో చివరి రోజు జాతీయ స్థాయి అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో  ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కూడా కేంద్రమంత్రులు, అగ్ర నేతలు చివరి రోజు క్యాంపెయినింగ్ లో పాల్గొననున్నారు. ప్రచారంలో భాగంగా  రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజ స్కంధాలపై వేసుకున్నారు.

 ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి, మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కొన్నిసార్లు ఒక్క రోజే  వివిధ నియోజకవర్గాల్లో నాలుగైదు మీటింగ్‌ల్లో  పాల్గొన్నారు. ఆయనతో కలిసి  కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ కూడా కొన్ని సభల్లో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార సభల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్రమంత్రులు కూడా  ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్​ బస్సు యాత్ర చేస్తూ ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు కూడా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో క్యాంపెయినింగ్​ చేశారు.

సిద్ధం కండి : సీఈఓ వికాస్​ రాజ్​

ఎన్నికలకు 72 గంటల ముందు చేపట్టాల్సిన పనులపై సీఈఓ వికాస్​ రాజ్​ జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే సైలెన్స్​ పీరియడ్​ మొదలువుతుందని.. వైన్స్​లు, బార్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్​ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లన్ని కేంద్ర బలగాల పర్యవేక్షణలోకి వెళ్లాయి. ప్రతి కదలిక వీడియోగ్రఫీ చేయనున్నారు.