
2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఎన్డీఏ (NDA)కూటమి 293, ఇండియా అలయన్స్ 234, ఇతరులకు 16 సీట్లు వచ్చాయి. మన దేశంలో ఒకసారి ఎంపీ అయితే ఎంత జీతం ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం.
ప్రతీ ఎంపీ నెలకు రూ. లక్ష జీతం ఉంటుంది. అంతేకాకుండా రోజుకు రూ.2 వేల చొప్పున అలవెన్సులు అందుతాయి. ఇవే కాకుండా నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు రూ.70 వేలు, ఆఫీస్ ఖర్చుల కింద నెలకు మరో రూ.60 వేలు కూడా ప్రతీ ఎంపీకి చెల్లిస్తారు. ఇందులో స్టేషనరీ ఖర్చులు, టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి. దీంతో ప్రతీ ఎంపీకి నెలకు రూ.2.30 లక్షలతోపాటు రోజుకు రూ.2 వేల అలవెన్సు లభిస్తుంది.
ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. ఫస్ట్‌క్లాస్ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం. రోడ్డు రవాణా అయితే కి.మీకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా 3జీ ప్యాకేజీలో అదనంగా 1.50 లక్షల కాల్స్ మాట్లాడుకునే వీలుంటుంది. తమ నివాసంలో లేదా ఆఫీసులో ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా పొందుతారు.
మాజీ ఎంపీలు ఒక సారి పార్లమెంటులో ఎన్నికైన తర్వాత వారికి నెలకు రూ.25,000 పెన్షన్ పొందుతారు. ప్రతి సంవత్సరం రూ. 2,000 ఇంక్రిమెంట్ పొందుతారు. ఎంపీలకు ఏటా 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు అందించబడుతుంది. ఎంపీలు, వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఉచిత వైద్య సంరక్షణకు అర్హులు. ఇక ఎంపీల జీతభత్యాలను 2023 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒకసారి పెంపు ఉంటుంది. అయితే కరోనా సమయంలో ఏడాది పాటు ఎంపీల జీతాల్లో కోత విధించారు.