కరోనా తగ్గాక 200 రకాల సమస్యలు.. ఎన్ని నెలలు ఉంటాయంటే?

కరోనా తగ్గాక 200 రకాల సమస్యలు.. ఎన్ని నెలలు ఉంటాయంటే?
  • పోస్ట్ కొవిడ్ హెల్త్ సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. నీరసంగా అనిపించడం, తల తిరుగుతున్నట్టుగా ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్ పని తీరులో సమస్యలు వంటివి కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ లేదా లాంగ్ కొవిడ్ అని పిలుస్తోంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. లాంగ్ కొవిడ్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు కచ్చితంగా వైద్య సాయం తీసుకోవాలని సూచించింది.  బుధవారం జెనీవాలో డబ్ల్యూహెచ్‌వో కరోనా టెక్నికల్ లీడ్ మరియా వన్ కెర్ఖోవ్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయనేది ఒక మిస్టరీగా ఉందని అన్నారు. కరోనా బారినపడిన వారిలో చాలా మంది లాంగ్ కొవిడ్ సింప్టమ్స్​తో బాధపడుతున్నట్లు తాము గుర్తించామన్నారు. దీనిని కచ్చితంగా నిర్వచించేందుకు రీసెర్చ్ కొనసాగుతోందని మరియా చెప్పారు. ఈ సమస్యలనను అధిగమించేందుకు తాము రీహబిలిటేషన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడంపై పని చేస్తున్నామన్నారు.

అలాగే డబ్ల్యూహెచ్‌వో క్లినికల్ కేర్ లీడ్ జనెట్ డియాజ్ మాట్లాడుతూ లాంగ్ కొవిడ్ సింస్టమ్స్‌పై సుదీర్ఘంగా సెమినార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. సైంటిస్టులు, డాక్టర్లతో పాటు పేషెంట్లు కూడా ఇందులో పాల్గొంటున్నారన్నారు. శ్వాస, గుండె, మెదడు, నరాల సమస్యలతో పాటు దాదారు 200 రకాల లక్షణాలను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. చెస్ట్ పెయిన్, చేతులు కాళ్లు తిమ్మిరిపట్టడం, దద్దుర్లు రావడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తల తిరగడం, నిద్ర పట్టకపోవడం లాంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జనెట్ అన్నారు. ఈ సమస్యలు కొందరిలో మూడు నెలలు ఉంటే, మరికొందరిలో ఆరు నెలలు, కొద్ది మందిలో 9 నెలల వరకు కూడా ఉంటున్నాయని చెప్పారు. చైనాలో 2019లో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి తాము పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్​పై  స్టడీ చేస్తున్నామని, ఇప్పటి వరకు చేసిన అధ్యయనాల ఆధారంగా వైరస్ కేవలం లంగ్స్ పైనే కాక ఇతర అవయవాలపైనా వ్యాపించి ఎఫెక్ట్ చూపిస్తోందని ఒక అంచనాకు వచ్చామని, పూర్తి స్థాయి కారణాలను ఇంకా తేల్చలేకపోతున్నామని అన్నారు.