కొవిడ్ పేరుతో ఆసుపత్రుల్లో దోపిడీ..రూ. 5వేల టెస్టులు చేసి..  ఏం లేదన్నరు

కొవిడ్ పేరుతో ఆసుపత్రుల్లో దోపిడీ..రూ. 5వేల టెస్టులు చేసి..  ఏం లేదన్నరు
  •     తాజాగా ఖమ్మంలో పాజిటివ్​ కేసు నమోదు
  •     ఇదే అదనుగా వసూళ్ల పర్వం షురూ చేసిన ప్రైవేట్ హాస్పిటళ్లు 
  •     మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఆర్​ఎంపీలు 

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి కొవిడ్​ పేరుతో కొన్ని ప్రైవేట్​హాస్పిటళ్లు దోపిడీ షురూ చేశాయి. ఈ ఏడాది మే తర్వాత ఖమ్మం నగరంలో తొలిసారిగా బుధవారం ఒక కొవిడ్ పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో అందరిలో కొంత ఆందోళన పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజ్​మెంట్లు అందినకాడికి దోచుకోవడంపై ఫోకస్ ​పెట్టాయి. 

మధ్యవర్తులుగా ఆర్​ఎంపీలు.. 

జిల్లాలో ఇటీవల చలి తీవ్రత పెరిగింది. చాలా మందికి జలుబు, దగ్గు వస్తోంది. ఇది ఆర్​ఎంపీలకు, హాస్పిటళ్లకు పండుగలా మారింది. పేషెంట్లకు, ప్రైవేట్​ ఆసుపత్రులకు మధ్యవర్తులుగా ఆర్​ఎంపీలు ఉంటూ  అవసరం ఉన్నా.. లేకున్నా వివిధ రకాల టెస్టులు చేయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ టెస్టులు ఉచితంగా చేస్తున్నా.. అక్కడికి పంపించకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్​ సెంటర్లకు రెఫర్ చేస్తున్నారు. దీంతో వారు  పలు రకాల టెస్టులు చేసి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. పేషెంట్లను ఆస్పత్రి వరకు తీసుకువచ్చిన పీఆర్వోలకు

ఆర్​ఎంపీలకు వాటా ఇస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ​300కు పైగా ప్రైవేట్ ఆస్పత్రులు, పదుల సంఖ్యలో డయాగ్నస్టిక్​ సెంటర్లు ఉండడంతో ఎవరికి వారు ఆదాయం కోసం పేషెంట్లను ఆస్పత్రికి తీసుకువచ్చే వారికి ప్రోత్సాహాకాలిస్తున్నారు.  దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇప్పుడే కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. 

అలర్ట్​గా ఉన్నామంటున్న వైద్యశాఖ

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తాము అన్ని విధాలుగా అలర్ట్​గా ఉన్నామని జిల్లా వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 2,724 కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి మరిన్ని బెడ్స్​ పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. రెండురోజుల కింద కొవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులతో సమీక్షించారు.

లక్షణాలున్న వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కరోనా నియంత్రణ డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రితో పాటు సీహెసీలు, పీహెచ్​సీలలో ర్యాపిడ్​ టెస్టులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రూ.5వేల టెస్టులు చేసి..  ఏం లేదన్నరు

నాలుగు రోజుల కింద దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడ్డాను. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్తే వైరా రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చెస్ట్ ఎక్స్ రే, సీబీపీ, మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేశారు. పరీక్షల్లో ఎలాంటి రోగాలు బయటపడలేదు. టెస్టులన్నీ కలిపి మొత్తం రూ.5వేల వరకు బిల్లు అయింది. చివరికి జ్వరం ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది.  

కె.రామస్వామి, ఎం.వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్​ మండలం