భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అంతకుముందు స్వామి వారి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేసి, బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి బేడా మండపానికి తీసుకొచ్చారు.
అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద విన్నపాలు చేశారు. నాళాయర దివ్యప్రబంధం, వేదపారాయణం పఠించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తిరుప్పావై సేవాకాలం జరిగింది. ఊరేగింపుగా మిథిలాప్రాంగణంలోని వేదికపైకి కోలాటాలు, భక్తుల జయజయధ్వానాలు, రామనామ సంకీర్తనలు మధ్య కూర్మావతార రాముణ్ణి తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈవో దామోదర్‌రావు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం కూర్మావతార రామయ్యకు తిరువీధి సేవను చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
