రాష్ట్రంలో నత్తనడకన వడ్ల సేకరణ

రాష్ట్రంలో నత్తనడకన వడ్ల సేకరణ
  • కోటి టన్నుల లక్ష్యంలో ఇప్పటిదాకా కొన్నది 6.40 లక్షల టన్నులే
  • సెంటర్ల వద్ద తప్పని తిప్పలు.. తరుగు పేరుతో క్వింటాల్‌‌కు 5 కిలోల కోత
  • లోడ్లను దించుకోక మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్ల బారులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై నెల రోజులు కావస్తున్నా రైతులకు కష్టాలు తీరలేదు. ధాన్యం సేకరణ కోసం సర్కారు చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యం కారణంగా ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఓవైపు సెంటర్లకు వడ్లు వస్తున్నా కొనుగోలు ప్రక్రియ జోరందుకోవడం లేదు. పలు జిల్లాల్లో వడ్లు కాంటా వేసి పంపినా మిల్లర్లు లోడును దించుకోవడం లేదు. దీంతో మిల్లుల బయట వడ్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒక వైపు హమాలీల కొరత, మరోవైపు ఇప్పటికే రెండు సీజన్ల ధాన్యం మిల్లింగ్‌‌ కాకుండా మిల్లర్ల వద్దే నిల్వ ఉండడంతో దించుకునే పరిస్థితి లేకుండా పోతున్నది. ధాన్యం కొన్న వెంటనే కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాలని సర్కారు చెబుతున్నా సరిపడా రవాణా వ్యవస్థ లేక ముందుకు సాగడం లేదు. లారీల ఏర్పాటు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ బాధలు పడలేక కొన్ని జిల్లాల్లో రైతులు ఏజెంట్లకు క్వింటాల్‌‌కు రూ.200 పైగా నష్టానికి అమ్ముకుంటున్నారు. ఈ వానాకాలం సీజన్‌‌లో కోటి టన్నులు కొనుగోళ్ల టార్గెట్‌‌ పెట్టుకోగా.. గత 23 రోజుల్లో 6.40 ల క్షల టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,067 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటిదాకా 4,284 సెంటర్లు తెరి చారు. తెరిచిన వాటిలోనూ పూర్తి స్థాయి కొనుగోళ్లు జరగడం లేదు. 14 జిల్లాల్లో కొనుగోళ్లు చాల్‌‌ చే యలేదు. కొన్న వడ్లలోనూ సగం ధాన్యం మిల్లులకు చేరలేదు. నిజానికి వరి కోతలు ప్రారంభమయ్యే నాటికే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తామని ప్రభు త్వం చెప్పినా.. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర పొలిటికల్‌‌ లీడర్లు వచ్చి ప్రారంభించిన తర్వాతే కేంద్రాలు తెరుచుకుంటున్నాయి.

ప్రతి సీజన్‌‌లో ఇట్లనే

కొనుగోలు సెంటర్లలో ముందస్తు ఏర్పాట్లు చేయలే దు. హమాలీల కొరత ఉంది. చాలా సెంటర్లలో టోకెన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, తూకం మెషీన్లు లేవు. మాయిశ్చర్‌‌ మెషీన్లు పని చేయడం లేదు. చైనా బ్రాండ్‌‌ మిషన్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. పలు జిల్లాల్లో ధాన్యం కొనాలంటూ రైతులు రాస్తారోకోలు చేపడుతున్న పరిస్థితులున్నాయి. వడ్లు తెచ్చి 2వారాలైనా కొనుగోళ్లు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఎప్పుడు వానొస్తుందోనని బుగులు పడుతున్నారు.

తరుగు పేరుతో దోపిడీ

సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ 40 కేజీల గోనె సం చుల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నది. సెంటర్లలో తాలు, తరుగు పేరుతో ఒక్కో బస్తాకు 2 కిలోల వడ్లు కోత పెడుతున్నారు. ఇలా క్వింటాల్‌‌కు 5 కిలోల దాకా తరుగు తీస్తున్నారు. ఎకరం పొలంలో కనీసం 20 నుంచి 23 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తున్నది. రైతు కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే ఎకరంలో పండిన వడ్లలో దాదాపు క్వింటాల్‌‌కు పైగా తరుగు రూపంలోనే పోతున్నదని రైతులంటున్నారు. దీంతో కొందరు రైతులు వరి పొలాల్లోనే పచ్చి వడ్లను ఏజెంట్లకు రూ.200 నుంచి రూ.250 వరకు తక్కువకు అమ్ముకుంటున్నరు. ఏజెంట్లు సైతం క్వింటాల్‌‌కు 4 కిలోలు కోత పెడుతున్నారు. 20 రోజుల్లో డబ్బులు ఇస్తామని డేట్‌‌ పెట్టి ఏజెంట్లు కొంటున్నా.. తప్పని పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటున్నారు.

మిల్లుల్లో రెండు సీజన్ల వడ్ల నిల్వ

ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాలు సేకరించిన ధాన్యాన్ని కాంటా పెట్టి.. లారీల్లో లోడ్ చేసి మిల్లర్లకు పంపిస్తే కొన్ని జిల్లాల్లో రోజుల తరబడి దించుకోవడం లేదు. ఒక్కో మిల్లులో రోజుకు నాలుగైదు లారీలను దింపుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. లారీలు రోజుల తరబడి ఆగకుండా వరుస క్రమంలో అన్‌‌లోడ్‌‌ చేయాలని, రోజూ 24గంటల పాటు ఈ ప్రక్రియ వేగంగా కొనసాగాలని అధికారులు మిల్లర్లకు చెబుతున్నా అవేవీ అమలు కావడం లేదు. దీంతో ధాన్యం లోడ్‌‌తో మిల్లులకు వచ్చిన వాహనాలు రోడ్లపైనే ఉంటున్నాయి. ప్లేస్‌‌ లేకపోవడంతో దించుకోవడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పటికే మిల్లర్ల వద్ద రెండు సీజన్లకు సంబంధించిన వడ్లు నిల్వ ఉన్నాయి. దీంతో ఇప్పుడు కొత్తగా వడ్లను దించుకునేందుకు చోటు లేక ఈ పరిస్థితి ఏర్పడుతున్నది.

సెంటర్లలో కొంటలే

వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. చాలా సెంటర్లు ఓపెన్‌‌ చేసినా కొనుగోళ్లు జరగడం లేదు. లారీలు రావడం లేదు. సేకరించిన ధాన్యం వారం పది రోజుల్లో తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. కాంటా పెట్టిన వడ్ల లారీ లోడ్లను రెండు మూడు రోజులు మిల్లర్లు దించుకుంటలేరు. - వెంకటేశ్, నిజామాబాద్‌‌ జిల్లా

5 కిలోల తరుగు తీస్తున్నరు

40 కిలోల బస్తాకు 500 గ్రాములు అదనంగా తీసుకోవచ్చు. బస్తాకు 2 కిలోలు కోత పెడుతున్నారు. అట్లయితేనే తీసుకుంటం లేక పోతే అవసరం లేదంటున్నరు. మా రేగోడు మండలం చుట్టుపక్కల శంకరంపేట, కొత్తపల్లి తదితర కేంద్రాల్లో 15, 20రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నరు. - సర్దార్‌‌, రేగోడు, మెదక్‌‌ జిల్లా