
జహీరాబాద్, వెలుగు : లారీ, కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
జహీరాబాద్ పట్టణ సమీపంలోని మహీంద్రా కాలనీకి చెందిన వెంకట్ (25), సాయి (20), వరలక్ష్మి, భవానీ, రిషికేశ్, హరిచందన, జాన్వి కలిసి కారులో న్యాల్కల్ మండలంలోని ముంగి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీదర్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న వెంకట్ అక్కడికక్కడే చనిపోగా.. మిగతా ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. సాయి మార్గమధ్యలో చనిపోయాడు. మిగతా ఐదుగురు జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదం తర్వాత కారులో చిక్కుకుపోయిన వెంకట్ డెడ్‌బాడీని అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా.. 12 మంది స్టూడెంట్లకు గాయాలు
గోదావరిఖని, వెలుగు : ఆటో బోల్తా పడి 12 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా రామగుండం యైటింక్లయిన్ కాలనీ సమీపంలోని పోతనకాలనీ వద్ద ఆదివారం జరిగింది. పోతనకాలనీకి చెందిన పలువురు స్టూడెంట్లు ఆదివారం క్రికెట్ ఆడేందుకు సెక్టార్ 3 సింగరేణి స్కూల్‌కు వెళ్లారు.
ఆట ముగిసిన తర్వాత సాయంత్రం ట్రాలీ ఆటోలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పోతన విగ్రహం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 12 మంది స్టూడెంట్లు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వీరిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పాటు సింగరేణి హాస్పిటల్‌కు తరలించారు.