నిర్మల్ జిల్లాలో టిప్పర్​ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

నిర్మల్ జిల్లాలో టిప్పర్​ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి
  • గద్వాల జిల్లాలో మరో యాక్సిడెంట్ 
  • టైర్ మారుస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మృతి

లక్ష్మణచాంద/గద్వాల, వెలుగు : నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. నిర్మల్ జిల్లాలో టిప్పర్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు, హైవే పక్కన టైర్ మారుస్తుండగా కారు ఢీకొట్టడంతో గద్వాల జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

నిర్మల్ జిల్లా మామడ మండలం పులిమడుగు గ్రామ శివారులో యాక్సిడెంట్ జరిగింది. నేషనల్ హైవే నంబర్ 44పై కేఎన్ఆర్ కన్​స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన టిప్పర్ రోడ్డు పక్కన ఆగి ఉంది. అక్కడే కూలీలు పనులు చేసుకుంటున్నారు. అదే టైమ్​లో ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న లారీ వేగంగా టిప్పర్​ను ముందు నుంచి ఢీకొట్టింది. దీంతో టిప్పర్ లో ఉన్న డ్రైవర్ లాల్ సింగ్ (45), కూలీ కొమరం రాజేంద్ర ప్రసాద్ (31) స్పాట్​లోనే చనిపోయారు. లారీ క్లీనర్  షేక్ ఖాసీంకు తీవ్ర గాయాలయ్యాయి. 

అతన్ని నిర్మల్ హాస్పిటల్​కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. లారీ డ్రైవర్ అల్లా బకాస్ సేఫ్​గా బయటపడ్డాడు. మృతులు లాల్​సింగ్​ది నేరడిగొండ మండలం పాషా తండా, రాజేంద్రప్రసాద్​ది చించోలి గ్రామం. మరో మృతుడు షేక్ ఖాసీం ఏపీలోని అనంతపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ అల్లా బకాస్​ను అదుపులోకి తీసుకున్నామని మామడ ఎస్​ఐ రాజు తెలిపారు.

టైర్ మారుస్తుండగా ఢీకొట్టిన కారు

కర్నాటకలోని హసన్ నుంచి అశోక్ లే లాండ్ లైట్ మోటర్ వెహికల్ అల్లం లోడుతో హైదరాబాద్ కు వెళ్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలోని కృష్ణా నది బ్రిడ్జి దగ్గర వెనుక టైర్ పంక్చర్ అయింది. కర్నాటకకు చెందిన ముత్తు రాజు(22), ముబారక్ (19) టైర్ మారుస్తున్నారు. అదే టైమ్​లో కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు, వీరిని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. 

ఈ యాక్సిడెంట్​లో ముత్తురాజు, ముబారక్ స్పాట్​లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. కార్ డ్రైవర్ జోషిత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇటిక్యాల ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు.