
ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 19) జిల్లాలో బ్రిడ్జి పైనుంచి లారీ కింద పడటంతో ప్రమాదం జరిగింది. లారీ ముందు భాగం బురదలో కూరుకు పోవడంతో డ్రైవర్ క్లీనర్లు లారీలోనే ఇరుక్కుపోయారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండా మండలం కుట్టి బ్రిడ్జ్ పై నుండి లారీ బోల్తా పడింది. భారీ వర్షానికి అదుపుతప్పిన లారీ బ్రిడ్జిపై నుంచి నిలువునా పడిపోయింది. ముందలి భాగం మట్టిలో కూరుకుపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండడంతో ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాను వర్షం వీడటం లేదు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జైనథ్ మండలంలో 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మావల, సిరికొండ మండలాల్లో 7 సెంటీమీటర్లు, బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మండలాల్లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మత్తడివాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కులు, సాత్నాల్ ప్రాజెక్టు 2 గేట్లు ఓపెన్ చేసి 12,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు