ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు మృతి, 20మందికి గాయాలు

ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు మృతి, 20మందికి గాయాలు

ఓ లారీ, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీ శనివారం తెల్లవారుజామను కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ఇనుము లోడ్ తో రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు.. చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.