ఓ రూమర్.. వధూవరుల్ని రాత్రంతా స్టేషన్ లో ఉండేలా చేసింది

ఓ రూమర్.. వధూవరుల్ని రాత్రంతా స్టేషన్ లో ఉండేలా చేసింది

నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరుగుతుందని పెద్దలు చెప్పిన సామెత ఈ ఘటనకు కరెక్ట్ గా సరిపోతుంది.

ఉత్తర్ ప్రదేశ్ ఖుషీనగర్ కు చెందిన హైదర్ అలీ మొదటి భార్య అనారోగ్యం కారణంగా మృతి చెందింది. దీంతో  ఆజంగఢ్ జిల్లాకు చెందిన షబీలాను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరికొద్ది క్షణాల్లో హైదర్ అలీ – ‌‌షబీలాలు వివాహం జరగాల్సి ఉండగా… ఖుషీనగర్ పోలీసులు రంగప్రవేశం చేశారు. బలవంతంగా మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటున్నారంటూ వధూవరుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. రాత్రంతా స్టేషన్ లో ఉంచి వరుడు హైదర్ ను చిత్రహింసలకు గురి చేశారు.

సమాచారం అందుకున్న బాధితుడి మొదటి భార్య అన్న పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. హైదర్ తన చెల్లిని వివాహం చేసుకున్నాడని, అనారోగ్యం కారణంగా ఆమె మృతి చెందిందని చెందాడు. దీంతో కంగుతిన్న పోలీసులు వధూవరుల్ని వదిలి పెట్టారు.

ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని  పోలీస్ ఉన్నతాధికారులు ఖుషీనగర్ పోలీసుల్ని ఆదేశించారు. అయితే హైదర్ బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని స్థానికంగా ప్రచారం జరిగిందని, ఓ గుర్తు తెలియని వ్యక్తి తమకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో బాధితుడిపై చర్యలు తీసుకున్నామని ఖుషీనగర్ పోలీసులు..ఉన్నతాధికారులకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఫోన్ చేసిన అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.