మంచిర్యాల: రాళ్లవాగుపై రాస్తా బంద్..భారీ వరదలకు కొట్టుకుపోయిన కాజ్ వే బ్రిడ్జి

మంచిర్యాల: రాళ్లవాగుపై రాస్తా బంద్..భారీ వరదలకు కొట్టుకుపోయిన కాజ్ వే బ్రిడ్జి
  • మంచిర్యాల టౌన్ లోని  కాలనీల వాసుల ఇబ్బందులు 
  • కిలోమీటర్ల దూరం ప్రయాణించి టౌన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి  
  • ఏండ్లుగా హై లెవల్ ​బ్రిడ్జి నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం 
  • త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలంటున్న స్థానికులు 

మంచిర్యాల, వెలుగు:  భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ ​రోడ్డులోని రాళ్ల వాగుపైన లో లెవల్ ​కాజ్​వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో అవతలివైపు వెళ్లే కాలనీలవాసులకు రాస్తా బంద్ అయింది. ఈ నెల13న కురిసిన వానకు భారీగా వరద పారడంతో మట్టి కోతకు గురైన కాజ్ వే పూర్తిగా ధ్వంసమైంది. దీంతో  పవర్​హౌస్ ​కాలనీ, రంగంపేట, అండాలమ్మ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. బైక్ లపై అతికష్టంగా వెళ్తుండగా, ఫోర్ ​వీలర్స్ ​రాకపోకలు పూర్తిగా బంద్ ​అయ్యాయి. మంచిర్యాల టౌన్ లోకి వచ్చేందుకు ఆయా  కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏసీసీ రోడ్, పాత మంచిర్యాల వైపు నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి టౌన్​కు చేరుకుంటున్నారు. 

ఏండ్లుగా అవస్థలే..

మంచిర్యాల బైపాస్​రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం సమీపంలో రాళ్లవాగుపై 2005లో రూ.80 లక్షల మున్సిపల్​ఫండ్స్​తో లో లెవల్​కాజ్​వే నిర్మించారు. అప్పటి నుంచి రంగంపేట, పవర్​హౌస్​కాలనీ, అండాలమ్మ కాలనీల ప్రజలు కాజ్​వే మీదుగా సిటీలోకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అంతకుముందు అండాలమ్మ కాలనీ వాసులు ఏసీసీ మీదుగా 3 కిలోమీటర్లు దూరం ప్రయాణించేవారు. కాజ్​వే నిర్మాణంతో అర కిలోమీటరు సమీపంలోనే ఉన్న మంచిర్యాలకు చేరుకుంటున్నారు. పాలు, కూరగాయాలు వంటి నిత్యావసరాలు అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకు టౌన్​కు ప్రజలు వస్తుంటారు. 2019లో రాళ్ల వాగుకు భారీ వరదలు రావడంతో కాజ్​వే పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది.

హై లెవల్ ​బ్రిడ్జి పనులు లేట్ 

రాళ్లవాగుపై హైలెవల్​బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు రూ.13.50 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​తో 2024 మార్చిలో భూమిపూజ చేశారు. ఏడాదిన్నర కావస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. తర్వాత బ్రిడ్జి అంచనా వ్యయాన్ని రూ.20 కోట్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపారు. అనంతరం రూ.196 కోట్లతో రాళ్లవాగు మీదుగా సిక్స్​లేన్​రోడ్డు సాంక్షన్​అయింది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగానే  హైలెవల్​ బ్రిడ్జి నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేశారు. 

ఈ ఏడాది మే నెలలో వాగులో డ్రిల్లింగ్​చేసి సాయిల్​టెస్టు చేశారు. ఆ తర్వాత బ్రిడ్జి పనులు ముందుకు సాగలేదు. ఎప్పటిలాగే మొన్నటి వరదకు కాజ్​వే కొట్టుకుపోయింది. మళ్లీ మట్టిపోసి టెంపరరీగా రిపేర్​ చేసినా ఉపయోగంగా ఉండదు. వీలైనంత తొందరగా హైలెవల్​బ్రిడ్జి నిర్మించాలని స్థానిక కాలనీల వాసులు  డిమాండ్​చేస్తున్నారు.