ఆస్పత్రుల అప్ గ్రేడ్..డాక్టర్లు లేక పేషెంట్స్ ఇక్కట్లు

ఆస్పత్రుల అప్ గ్రేడ్..డాక్టర్లు లేక పేషెంట్స్ ఇక్కట్లు
  • బెడ్ల సంఖ్య పెరుగుతున్నా పెరగని ఆస్పత్రుల స్టాఫ్
  • ఆస్పత్రుల్లో వైద్యులు లేక రోగుల ఇబ్బందులు 
  • తూతూమంత్రంగా అప్ గ్రేడ్ చేస్తున్న ప్రభుత్వం

జయశంకర్​ భూపాలపల్లి/ నెట్​వర్క్​, వెలుగు : ఇటీవల పీహెచ్​సీలను, ఏరియా హాస్పిటళ్లను అప్​గ్రేడ్​ చేస్తూ బెడ్ల సంఖ్యను పెంచుతున్న ప్రభుత్వం ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలేదు. కొత్తగా డాక్టర్లను, స్థాఫ్​ను నియమించడంలేదు.  సర్కారు ఇచ్చే జీతాలు తక్కువగా ఉండడంతో పనిచేసేందుకు  డాక్టర్లు ముందుకు రావడం లేదు.  దవాఖానాల పేర్లు మారుతున్నాయే తప్ప ట్రీట్​మెంట్​ మెరుగుపడడంలేదు.  సరిపడా టెక్నికల్​ స్టాఫ్​, ఎక్విప్​మెంట్​ కూడా లేకపోవడంతో టెస్టులూ చేయడం లేదు.  దీంతో పేషెంట్లు ఎప్పట్లాగే ప్రైవేట్ ​హాస్పిటల్స్​కు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  

 కేవలం బెడ్లు పెంచి వదిలేస్తున్నరు.. 

స్టేట్​వైడ్​ పెద్దసంఖ్యలో పీహెచ్​సీలను కమ్యూనిటీ హస్పిటళ్లుగా మార్చి, బెడ్ల సంఖ్యను 10 నుంచి 30కి పెంచారు. కొన్ని సెంటర్లలో 50 బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల్లోని అన్ని ఏరియా దవాఖానాలను జిల్లా స్థాయికి, మెడికల్​ కాలేజీలు మంజూరైన చోట్ల జిల్లా స్థాయినుంచి జనరల్​ హాస్పిటళ్లుగా అప్​గ్రేడ్​ చేశారు. కానీ ఆ స్థాయిలో స్టాఫ్​ను కేటాయించలేదు. ముఖ్యంగా స్పెషలిస్టులను నియమించకపోవడం, అవసరమైన ఎక్విప్​మెంట్​ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేటు హాస్పిటల్స్​కే పోతున్నారు. వాస్తవానికి వంద పడకల హాస్పిటల్​లో 40 మంది డాక్టర్లు ఉండాలి. ఇందులో 15 మంది జనరల్, 25 మంది స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి. కనీసం 100  మంది నర్సులుండాలి. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్​ ను నియమించలేదు. ఏరియా, జిల్లా దవాఖానాలుగా మారిన చోట్ల ఎక్కడా కొత్త  పరికరాలను మంజూరు చేయలేదు. చాలాచోట్ల ఎక్స్​రే మెషీన్లు,  స్కానింగ్​ పరికరాలు కూడా లేక పేషెంట్లు ప్రైవేట్​ ల్యాబ్​లకు వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తున్నారు. గతంలో కొన్ని పరికరాలున్నా టెక్నీషియన్లు లేక అవన్నీ మూలనపడ్డాయి. ఎక్స్​రే రూమ్​లకు చాలాకాలంగా తాళాలు పడ్డాయి. 

డాక్టర్లు ముందుకురావట్లే.. 

జిల్లాల్లోని వివిధ దవాఖానాల్లో డాక్టర్ ​పోస్టుల భర్తీకి కలెక్టర్లు తరుచూ నోటిఫికేషన్లు ఇస్తున్నా స్పందన రావడం లేదు. బయట ఎంబీబీఎస్​ చేసిన డాక్టర్లకు రూ.2లక్షల దాకా, స్పెషలిస్టులకు రూ.4 లక్షల నుంచి 5లక్షల దాకా జీతాలున్నాయి. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఎంబీబీఎస్​ డాక్టర్లకు నెలకు రూ.50 నుంచి రూ.60వేలు, స్పెషలిస్టులకు రూ. లక్షా 20వేలు మాత్రమే ఇస్తోంది. పైగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమిస్తుండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఉదాహరణకు పాలమూరు జిల్లా బాలానగర్ పీహెచ్​సీని 30 పడకల కమ్యూనిటీ హెల్త్​సెంటర్​గా అప్​గ్రేడ్ చేశారు. దీన్ని ఈ ఏడాది జనవరి 18న మంత్రి  హరీశ్​రావు ఓపెన్ చేశారు. ఇక్కడ ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఆరుగురు నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు.. మొత్తం 16 మంది ఉండాలి. కానీ ఇప్పటికీ ఒక్క డాక్టర్​ను కూడా నియమించలేదు. షాద్​నగర్​ నుంచి ఒక డాక్టర్​ను డిప్యూటేషన్ మీద పంపారు.  పీహెచ్​సీలో గతంలో ఉన్న ఇద్దరు నర్సులే పని చేస్తున్నారు. దీంతో పేషెంట్స్​రాక బెడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా కట్టిన వంద పడకల హాస్పిటల్​లో బెడ్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి.  5 ఎకరాల్లో  రూ.35 కోట్ల ఖర్చుతో అన్ని హంగులతో కట్టిన ఈ మూడంతస్తుల దవాఖానాను ఇటీవల ప్రారంభించారు. స్పెషలిస్టు డాక్టర్లు, సరిపోయినంతమంది​ స్టాఫ్ లేకపోవడంవల్ల  రోగులకు సేవలందడంలేదు. ఇక్కడ 40 మంది డాక్టర్లు, వంద మంది నర్సులతోపాటు ల్యాబ్‌‌ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని నియమించవలసి ఉండగా.. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం డెలివరీలు మాత్రమే చేస్తుండడంతో ఫస్ట్​ఫ్లోర్​లో వివిధ వార్డుల్లో వేసిన 90 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.