శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తక్కువ పోలింగ్

 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తక్కువ పోలింగ్
  • శేరిలింగంపల్లిలో కేవలం  48.85 శాతం పోలింగ్​

గచ్చిబౌలి, వెలుగు: దేశంలోనే అత్యధిక ఓటర్లు, అత్యధిక పోలింగ్ స్టేషన్లు ఉన్న నియోజక వర్గం శేరిలింగంపల్లి. అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, దేశంలోని అన్నీ రాష్ట్రాల ప్రజలు ఈ సెగ్మెంట్​లో ఉన్నారు. అయితే ఇంత పెద్ద నియోజకవర్గంలో చాలా తక్కువ పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరితే ఈసారి శేరిలింగంపల్లిలో ఓటింగ్ శాతం 60కి చేరుకుంటుందని పలువురు భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పడిపోయింది. ఓటింగ్ ముగిసే సరికి 48.85 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

శేరిలింగంపల్లిలో మొత్తం 7 లక్షల 32 వేల 506 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయని పరిస్థితి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 11 గంటలకు వరకు 21.05 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. ఫైనల్ గా కేవలం 48.85 శాతం పోలింగ్  నమోదైనట్లు ఆర్వో రాత్రి 9 గంటలకు ప్రకటించారు. పోలింగ్ శాతం తగ్గడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఐటీ ఉద్యోగులు ఎప్పటిలాగే ఈసారి కూడా ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.