
- 7.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేనట్టే !
- త్వరలో కాకతీయ కెనాల్‌కు నీటి విడుదల
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల రైతుల సాగునీటి అవసరాలు తీర్చే లోయర్ మానేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో మిడ్‌మానేరు, ఎస్సారెస్పీతో పాటు మోయతుమ్మెదవాగు నుంచి భారీగా వరద వస్తుండడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎల్‌ఎండీలో 21 టీఎంసీల నీరు చేరింది.
పది రోజుల కిందటి వరకు 7 టీఎంసీల నీటితో వెలవెలబోయిన ఎల్‌ఎండీ ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. ఎల్‌ఎండీ గరిష్ట నీటిమట్టానికి చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
7.11 లక్షల ఎకరాలకు సాగు నీరు
లోయర్ మానేరు డ్యామ్ నిండడంతో ఎస్పారెస్పీ స్టేజ్ 2 పరిధిలోకి వచ్చే కరీంనగర్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా వరకు సుమారు 7.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇందులో కరీంనగర్ జిల్లాలో 1,39,787 ఎకరాలు, వరంగల్‌లో 1,10,982 ఎకరాలు, హనుమకొండలో 45,212 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 81,765 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1,19,941 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,13,175 ఎకరాలకు ఎస్పారెస్పీ జలాలు అందనున్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లితో పాటు మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాముల్లో నీటి నిల్వలు లేకపోవడంతో సాగుపై ఆశలు వదులుకున్న రైతులు.. తాజా వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ
ఈ నెల 20 వరకు ఎల్‌ఎండీలో ఏడున్నర టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. ఈ నెల 23న మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేయగా రోజుకు అర టీఎంసీ చొప్పున ఎల్‌ఎండీలోకి చేరాయి. బుధవారం వరకు 13 టీఎంసీలు నీరు ఉండగా.. గురువారం ఒక్క రోజే 72 వేల క్యూసెక్కుల వరద రావడంతో రాత్రి వరకు 17 టీఎంసీల చేరుకున్న నీటినిల్వ శుక్రవారం రాత్రి వరకు 20.500 టీసీఎంలకు చేరింది.
ప్రస్తుతం 11 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండడంతో మరో మూడు రోజుల్లో ఎల్ఎండీ గరిష్ట నీటినిల్వ 24 టీఎంసీలకు చేరుకోనుంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే క్రస్ట్ గేట్ల ద్వారా గానీ, కాకతీయ కెనాల్ ద్వారా గానీ నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కెనాల్‌కు నీటి విడుదల విషయమై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని ఇరిగేషన్ ఇంజినీర్లు వెల్లడించారు. ఈ కాల్వ ద్వారా ఆయకట్టు పరిధిలోని జిల్లాల్లో చెరువులు, కుంటలు నింపనున్నారు.
ఆదుకుంటున్న ఎస్సారెస్పీ
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారడంతో... కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల ఆయకట్టు మూడేండ్లుగా ఎస్పారెస్పీ జలాలే ఆధారమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ.. గోదావరి నీళ్లు ఎప్పట్లాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడ వరకు చేరుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుల అవసరాలను ఎస్పారెస్పీ జలాలే తీర్చనున్నాయి.