
- నగదు లావాదేవీలను తగ్గించేందుకు కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ లేకపోతే క్యాష్ రూపంలో కంటే యూపీఐ ద్వారా తక్కువ టోల్ వసూలు చేయనుంది. ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఫాస్టాగ్ లేకుండా నగదు చెల్లింపు చేసినవారికి రెండు రెట్లు టోల్ చార్జీ పడుతోంది.
రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, నగదు లావాదేవీలను తొలగించేందుకు ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఫీ రూల్స్, 2008లో సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్టాగ్ లేకుండా నగదు చెల్లిస్తే 2 రెట్లు టోల్ కట్టాలి. అదే ఫాస్టాగ్ లేకుండా యూపీఐ ద్వారా చెల్లిస్తే 1.25 రెట్లు మాత్రమే టోల్ కట్టాలి.
ఈ మార్పులతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయని, టోల్ కార్యకలాపాల్లో పారదర్శకత మెరుగుపడుతుందని, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.