
స్టూడెంట్ వీసా పర్మిట్లను అమెరికా గణనీయంగా తగ్గించేస్తోంది. మార్చి నుంచి జులై మధ్య బిజీ వీసా సీజన్. ఇలాంటి సమయంలో గతేడాదితో పోల్చితే ఎఫ్-1 వీసాలను జారీ చేసే విషయంలో అమెరికా భారీగా కోత పెట్టింది. 2024తో పోల్చుకుంటే 2025లో అమెరికా జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 27 శాతానికి పడిపోయింది. ఇప్పటికి కేవలం 9వేల 906 ఎఫ్-1 వీసాలను మాత్రమే భారతీయ విద్యార్థులకు అమెరికా జారీ చేసింది. 2024లో అమెరికా వెళ్లి చదువుకోవాలని ఆశపడిన భారతీయ విద్యార్థులకు 13 వేల 478 ఎఫ్-1 వీసాలను అమెరికా జారీ చేసింది. రెండేళ్ల క్రితం చూసుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ కు 14 వేల 987 ఎఫ్-1 వీసాలను అమెరికా ఇవ్వడం గమనార్హం. కరోనాతర్వాత స్టూడెంట్ వీసా దరఖాస్తుల తిరస్కరణ బాగా పెరిగిందని పలు నివేదికలు వెల్లడించాయి.
కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల్లో అమెరికా భారీగా కోతపెడ్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఎఫ్ 1 కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తులలో ఏకంగా 41% అప్లికేషన్లు తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఎఫ్1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఇక 2024 నవంబర్ తర్వాత ట్రంప్ పాలసీలు, పొలిటికల్ ఐడియాలజీలతో అమెరికాలో విద్యనభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడడం లేదని కీస్టోన్ఎడ్యుకేషన్ గ్రూప్సర్వేలో తేలింది. వివిధ దేశాలకు చెందిన 42 శాతం మంది విద్యార్థులు యూఎస్లో స్టడీకి విముఖత చూపినట్టు వెల్లడించింది.
ALSO READ :అమెరికాలో భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు.. కారణం ఇదే..
గతేడాది డిసెంబరు 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో ఎఫ్-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో ఎఫ్ 1 వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్‌కు ఎఫ్-1 వీసాలను జారీ చేశారు. 2018 లో 42 వేల మంది ఇండియన్ స్టూడెంట్లకు స్టడీ వీసా దక్కగా.. 2022లో 1.15 లక్షలకు, 2023 లో 1.31 లక్షల మంది విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఎఫ్1 వీసా మంజూరు చేసింది.
అమెరికాలో నిబంధనలు కఠినతరం కావడం, ఫీజులు కూడా భారంగా మారుతుండడంతో విద్యార్థులు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. జర్మనీలో ఏడాదికి కేవలం రూ.లక్షన్నరకు మించి చదువులకు ఖర్చు కావని నిపుణులు చెబుతున్నారు. చదువయ్యాక 18 నెలలపాటు వీసా వ్యాలిడ్ స్టేటస్‌లో ఉంటుంది. ఫ్రాన్స్‌లో ఖర్చు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. చదువు అనంతరం రెండేండ్ల పాటు వీసా ఉంటుంది. ఇటలీలోనూ చదువుల ఖర్చు రూ.10 లక్షల లోపే ఉంటున్నదని అంటున్నారు. కాగా, 2023లో ఇటలీ, జర్మనీకి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్లలో 20% మంది తెలుగు వాళ్లే ఉన్నారు. మరోవైపు ఎంబీబీఎస్‌కు రష్యాకే మొగ్గు చూపుతున్నారు.
ట్రంప్అధికారంలోకి వచ్చాక ప్రైవేట్, ప్రభుత్వ వర్సిటీలపై అనేక ఆంక్షలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్కు ఎన్రోల్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మింగుడుపడని నిబంధనలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు.. అమెరికాలో ఏదైనా వర్సిటీలో చదువుతూనే విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం ట్రంప్ దానికి బ్రేకులేశారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే విద్యార్థులు.. అమెరికాలో చదువుకునే సమయంలో 5 నెలలకు మించి బయట దేశాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఇటు గతంలో క్యాంపస్‌లో పార్ట్‌టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా.. ఇప్పుడు అనేక రూల్స్‌ను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక, బయట పార్ట్‌టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసినా.. ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.