మహిళలకు కేంద్రం రాఖీ, ఓనం గిఫ్ట్

మహిళలకు కేంద్రం రాఖీ, ఓనం గిఫ్ట్
  • మహిళలకు కేంద్రం రాఖీ, ఓనం గిఫ్ట్ 
  • ఉజ్వల’ లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.400 తగ్గింపు
  • ఇయ్యాల్టి నుంచే అమల్లోకి కొత్త ధరలు 
  • కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం

న్యూఢిల్లీ: మహిళలకు కేంద్ర ప్రభుత్వం రాఖీ, ఓనం గిఫ్ట్ ఇచ్చింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించింది. ఒక్కో సిలిండర్​పై రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇది రాఖీ, ఓనం పండగల సందర్భంగా మహిళలకు ప్రధాని ఇస్తున్న గిఫ్ట్” అని ఆయన చెప్పారు. ‘‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కనెక్షన్లు పొందిన లబ్ధిదారులకు ప్రస్తుతం రూ.200 సబ్సిడీ అందిస్తున్నాం. ఇప్పుడు సిలిండర్ ధర రూ.200 తగ్గించడంతో.. వీళ్లకు రూ.400 వరకు ధర తగ్గనుంది” అని తెలిపారు. కొత్త ధరలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103 ఉంది. ఇకపై ఇది రూ.903కి లభిస్తుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకైతే రూ.703కే లభిస్తుంది. 

గ్యాస్ కనెక్షన్లు 33 కోట్లు.. 

దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 33 కోట్లు ఉన్నాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘‘2014లో మేం అధికారంలోకి వచ్చే నాటికి 14.5 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. మేం ఆ సంఖ్యను 33 కోట్లకు పెంచినం. ఇందులో ఉజ్వల పథకం కింద ఇచ్చిన కనెక్షన్లు 9.6 కోట్లు ఉన్నాయి” అని చెప్పారు. ఈ పథకం కింద మరో 75 లక్షల కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఉజ్వల పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.200 సబ్సిడీ కోసం ఈ ఏడాది రూ.7,680 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కాగా, ఉజ్వల యోజన కింద పేదలకు కేంద్రం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది. వీళ్లకు సిలిండర్ పై రూ.200 సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇది డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది.

చంద్రయాన్ 3పై తీర్మానం.. 

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్ర కేబినెట్ శుభాకాంక్షలు తెలిపింది. చంద్రయాన్ 3పై తీర్మానం ప్రవేశపెట్టింది. ‘‘ఇది కేవలం ఇస్రో విజయమే కాదు. మన దేశ అభివృద్ధికి సంకేతం. శాస్త్రవేత్తలు ఎన్నో సవాళ్లను అధిగమించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించారు. ఇది సైంటిస్టుల స్ఫూర్తికి నిదర్శనం” అని అందులో పేర్కొంది.