క్యాన్సర్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ కోసం సైకిల్‌‌ యాత్ర

క్యాన్సర్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ కోసం సైకిల్‌‌ యాత్ర

ప్రతీ ఒక్కరికి జీవితంలో ఎప్పటికైనా నెరవేర్చుకోవాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. కొందరికి డబ్బు బాగా సంపాదించాలని, ఇల్లు కట్టుకోవాలని, కార్‌‌‌‌ కొనుక్కోవాలని, ఎక్కడికైనా పెద్దటూర్ వేయాలని ఉంటుంది. అందరిలాగానే ఇంగ్లాండ్‌‌లోని బ్రిస్టల్‌‌కు చెందిన 28 ఏండ్ల ‘ల్యూక్ గ్రెన్‌‌ ఫెల్‌‌ షా’ తన బైక్‌‌ పైన వరల్డ్ టూర్‌‌‌‌ వేయాలను కొన్నాడు. కానీ ఇప్పుడు సైకిల్‌‌ తొక్కుతూ వరల్డ్‌‌ టూర్‌‌‌‌ చేస్తూ మోటివేటర్‌‌‌‌గా మారాడు.

పింక్‌‌ కలర్ టెన్డం సైకిల్‌‌, హెల్మెట్‌‌, వెనకాల చిన్న గ్యాస్‌‌ స్టవ్‌‌, ల్యాప్‌‌టాప్‌‌, రెండు జతల బట్టలు, చిన్న గిన్నె, స్పూన్‌‌, తలకు పెట్టుకునే టార్చ్‌‌లైట్‌‌, చిన్న టెడ్డీ బేర్‌‌‌‌ అంతే. ఇవే ల్యూక్‌‌ వరల్డ్ టూర్‌‌‌‌ బ్యాక్‌‌ ప్యాక్‌‌లో సామాన్లు. వీటిని పట్టుకొని ఇప్పటికే రొమేనియా, ఉక్రెయిన్‌‌, టర్కీ, జార్జియా దేశాలు తిరుగుతూ మోటివేషన్‌‌ స్పీచ్‌‌లు ఇస్తూ ఇప్పుడు భారతదేశానికి వచ్చాడు. ఇంతకీ ఏ విషయంలో మోటివేట్‌‌ చేస్తున్నాడు? ఆ జర్నీ విశేషాలేంటి? తెలుసుకోవాలంటే... ఇది చదవండి.

అలా ఎందుకయ్యాడంటే...

కాలం చాలా విచిత్రమైనది. ఎప్పుడు? ఎవరికి? ఏం జరుగుతుందో చెప్పలేం. ల్యూక్ జీవితంలో ఆనందాలను స్టేజ్‌‌–4 (సర్కోమా) క్యాన్సర్‌‌‌‌ దూరం చేసింది. ఎన్నాళ్లు బతుకుతాడో తెలియదు.  తను లేకపోతే కుటుంబం ఏమవుతుంది? అనే ఆలోచనల మధ్య రోజూ కుమిలి పోతుండేవాడు ల్యూక్‌‌. హాస్పిటల్‌‌లో చేరాక ‘‘కోలుకుంటానా? లేదా?’’ అనే భయం ఉండేదట. కానీ అక్కడ తనలాంటి వాళ్లే క్యాన్సర్‌‌‌‌ నుండి కోలుకున్నది చూసి తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి రెండు సంవత్సరాలు క్యాన్సర్‌‌‌‌తో పోరాడి గెలిచాడు ల్యూక్‌‌. ప్రపంచంలో తనలాగ చావంటే భయపడే వాళ్లు, చికిత్స తీసుకుంటూ నాకేమవుతుందో అని భయపడే వాళ్లు ఉన్నారు. ‘క్యాన్సర్ అనేది పెద్ద జబ్బు. దాని నుండి కోలుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు మాదగ్గర లేదు. చికిత్స తీసుకున్నా బతుకుతామా! ఇక మాకు చావే దిక్కు’ అని ధైర్యం కోల్పేయేవాళ్లు ఉన్నారు. ఇలాంటి అపోహలన్నీ పెట్టుకొని యేటా కొన్ని లక్షల మంది క్యాన్సర్‌‌‌‌ పేషెంట్స్‌‌ చనిపోతున్నారు. ఈ చావులు ఆపాలని క్యాన్సర్‌‌‌‌పైన అవగాహన కల్పించాలని అనుకున్నాడు ల్యూక్. 2019 నుండి సైకిల్ మీద దేశాలన్నీ తిరుగుతూ, అవేర్‌‌‌‌నెస్‌‌ ప్రోగ్రామ్స్‌‌ పెడుతూ, క్యాన్సర్‌‌‌‌ హాస్పిటల్‌‌లో చికిత్స తీసుకుంటున్న వాళ్లకు మోటివేషన్‌‌ ఇస్తూ, బతుకుపైన ఆశ, ధైర్యాన్ని నింపుతున్నాడు.

దారిపొడవునా అడ్డంకులే

ఇతని సైకిల్‌‌ యాత్ర నచ్చిన కొందరు వాళ్ల దేశానికి రాగానే ల్యూక్‌‌తో పాటు నడుస్తున్నారు. కొందరు వాళ్ల వంతు సాయంగా షెల్టర్‌‌‌‌, ఫుడ్‌‌ ఇస్తున్నారు. ‘‘ఈ టూర్‌‌‌‌లో చాలా రకాల అడ్డంకులు ఎదుర్కొన్నా. టూర్‌‌‌‌ మధ్యలో కరోనా వచ్చినా భయపడలేదు. ఎడారి మధ్యలో దాదాపు 55 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌ ఉన్నా ఎండలో కూడా సైకిల్ తొక్కడం ఆపలేదు. లాక్ డౌన్‌‌, రాత్రి కర్ఫ్యూ ఉన్నచోట ప్రయాణానికి చాలా అడ్డంకులు వచ్చేవి. అప్పుడు ఆ ఊర్లోని వాళ్లు హెల్ప్‌‌ చేసేవాళ్లు. కొన్నిసార్లు బార్డర్ ఇష్యూలు వచ్చేవి. పర్మిషన్‌‌ ఉన్నా అనుమతించేవాళ్లు కాదు’’ అని తన బ్లాగ్‌‌ వీడియోలలో చెప్పాడు. ఇలా చలి, ఎండ, వాన అనే తేడాలేకుండా కష్టపడి సైకిల్ తొక్కుతూ మన దేశానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోల్‌‌కత్తాలో ఉన్న ల్యూక్ ‘నాకు ఇక్కడి ఆచారాలు, మనుషులు, ఫుడ్‌‌, కళాత్మక కట్టడాలు బాగా నచ్చాయి. బంగ్లాదేశ్‌‌ మీదుగా చైనా వెళ్లడానికి వీసాకోసం ఎదురుచూస్తున్నా’ అని అంటున్నాడు ల్యూక్‌‌.