యూట్యూబ్​తో కోట్ల డాలర్ల సంపాదన

 యూట్యూబ్​తో కోట్ల డాలర్ల సంపాదన

ఒక్కొక్కరికి కోట్లాది మంది అభిమానులు

న్యూయార్క్​: వ్లాడ్, నికీ, డయానా,  నాస్త్యాలు అందరు పిల్లల్లా కారు.  చిన్నతనంలోనే లగ్జరీ లైఫ్, కోట్లాది మంది అభిమానులు, బిజినెస్​ డీల్స్​.. వీరి ప్రత్యేకతలు​. విలాసవంతమైన పడవల్లో పార్టీ చేసుకుంటారు. ఫెరారీ కార్లలో ప్రపంచాన్ని చుట్టేస్తారు.   మూడు సంవత్సరాల క్రితం వారిలో ఒకరి పుట్టినరోజు సంబరాల్లో భాగంగా 97 అడుగుల పడవలో మియామీలో చుట్టూ చక్కర్లు కొట్టారు. యూట్యూబ్​ నుంచి వచ్చే సంపాదనతో వీళ్లు ఇంతటి లగ్జరీ లైఫ్ ​గడుపుతున్నారు.  ఈ చిన్నారులు మూడు యూట్యూబ్ ఛానెల్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ప్రపంచమంతటా పాపులర్​ అయ్యారు. అవి:“వ్లాడ్  నికీ," “లైక్ నాస్త్యా”,  “కిడ్స్ డయానా షో ” ఇవి ప్రపంచంలోనే మూడు అత్యంత ప్రసిద్ధ లైవ్- యాక్షన్ యూట్యూబ్ కిడ్స్ ఛానెల్స్​. వీటికి దాదాపు 30 కోట్ల మంది యూట్యూబ్ సబ్‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు.  ఇప్పుడు వారు స్ట్రీమింగ్ షోలు మొదలుకొని బ్రాండెడ్ బొమ్మల ప్రమోషన్​, లైసెన్సింగ్ డీల్స్​ సహా అన్నింటిలోనూ అడుగుపెట్టారు.

ఈ బిజినెస్​ల విలువ పది మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. ఈ నలుగురు పిల్లలు మిక్కీ మౌస్ కంటే ఎక్కువ పాపులర్​ అయ్యారని యూట్యూబ్ ఎనలిస్ట్​ ఇయల్ బామెల్ చెప్పారు. వీళ్ల ఛానెల్స్​లో వీడియోలు సబర్బన్ ఫాంటసీ ల్యాండ్‌‌‌‌లో లైవ్-యాక్షన్ కార్టూన్‌‌‌‌ల మాదిరిగా ప్లే అవుతాయి. పిల్లలు సూపర్‌‌‌‌హీరోల వేషాల్లో కనిపిస్తారు. పెద్ద కూరగాయలపై పాకుతూ వెళ్తారు.  మోటరైజ్డ్​ బొమ్మ కార్లలో తిరుగుతారు.  వెంట అమ్మానాన్న పాత్రలూ ఉంటాయి. ఈ షోలోని బొమ్మలు,  విహారయాత్రలు చాలా ఆదరణ పొందాయి.  ఈ సంవత్సరం వచ్చిన మరో వీడియోలో "కిడ్స్ డయానా షో" రోడ్డుపైకి వచ్చింది. మాల్దీవుల్లో రిసార్ట్‌‌‌‌లో చక్కర్లు కొట్టింది.  ఈ వీడియోల్లో మాటలు తక్కువగా ఉంటూ, ఉత్సాహపరిచే చప్పుళ్లు ఎక్కువగా ఉంటాయి.  వ్లాడ్ (7),  నికీ (9)లను చాలా మంది పిల్లలు తమ స్నేహితులని భావిస్తారని వారి తల్లి విక్టోరియా వాష్కెతోవ్ అన్నారు.  

జోరుగా వ్యాపారం

బొమ్మల తయారీదారులు తమ ఉత్పత్తులతో ఆడుకునే యువ సెలబ్రిటీలకు 75 వేల నుంచి మూడు లక్షల డాలర్ల వరకు చెల్లిస్తారు.  వ్లాడ్​, నికీలతోనూ అనేక బొమ్మల తయారీ కంపెనీలు చేతులు కలిపాయి. కొన్ని కంపెనీలు ఈ యూట్యూబర్ల పేరుతో ప్రత్యేకంగా బొమ్మలను తయారు చేశాయి. మరో విశేషం ఏంటే యూట్యూబ్​తో పాటు హెచ్​బీఓ మ్యాక్స్ , అమెజాన్‌‌‌‌తో సహా పలు ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు వీరి వీడియోలను చూపిస్తున్నాయి.  వ్లాడ్,  నికీ తల్లిదండ్రులు మొదట్లో మాస్కోలోని వారి ఇంటి నుండి రష్యన్​లో వీడియోలను తీయడం ప్రారంభించారు.   కోకా-కోలా బాటిళ్లతో, లైఫ్-సైజ్ బ్యాగ్‌‌‌‌లతో ఆడుకోవడం వంటి వాటిని చూపించేవారు. ఈ మూడు ఛానెల్స్​ చాలా చిన్నస్థాయిలో మొదలయ్యాయి. కిచెన్ టేబుల్ వద్ద,  లోకల్​ పార్కు  వంటి చోట్ల ఫోన్​తో షూటింగ్​ చేసేవాళ్లు. యూట్యూబ్  వీడియోలకు మిలియన్ల కొద్దీ హిట్స్​ వచ్చాక, వీళ్ల తల్లిదండ్రులు పెద్ద వ్యాపారాన్ని నిర్మించారు.

భారీ బొమ్మలతో, ఆటవస్తువులతో కూడిన క్వాలిటీ వీడియోలను తయారు చేశారు. వీటికి విపరీతంగా ఆదరణ రావడంతో ఈ  కుటుంబాలు ఉక్రెయిన్,  రష్యా నుండి దుబాయ్,  థాయ్‌‌‌‌లాండ్ వంటి దేశాలకు మారాయి.  నాలుగు సంవత్సరాల క్రితం  మూడు కుటుంబాలు మయామీలో కలుసుకున్నాయి.  స్నేహాన్ని మొదలుపెట్టాయి. వీడియోల సంఖ్యను మరింతగా పెంచాయి. ఇప్పుడు థాయ్​లాండ్​, హవాయ్​, ఫ్రెంచ్​ ఆల్ప్స్​లోనూ షూటింగ్స్​ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ మూడు కుటుంబాలకు షూటింగ్స్​ కోసం ప్రత్యేకంగా టీమ్స్​ ఉన్నాయి. వీడియోలను ఇంగ్లిష్​తోపాటు ఇతర భాషల్లోనూ డబ్​ చేస్తున్నారు. మొబైల్​ గేమ్స్​ కూడా డెవలప్​ చేస్తున్నారు. నాస్త్యా టీమ్​ విల్​స్మిత్​ ప్రొడక్షన్​ కంపెనీతో కలిసి యానిమేటెడ్​ సిరీస్​ను తీస్తోంది. నెట్​ఫ్లిక్స్​తోనూ చర్చలు జరుగుతున్నాయి. డయానా, రోమాలు పారామౌంట్​ బ్యానర్​లో తీసిన పా పెట్రోల్​లో నటిస్తున్నారు.

ఈ అక్కాతమ్ముళ్లు యూట్యూబ్ ​ వీడియోలతోనూ చిన్నారులను అలరిస్తున్నారు. వీళ్ల సంపాదన భారీగా పెరగడంతో పోటీ కూడా ఎక్కువయింది. ముఖ్యంగా డయానా, నాస్త్యాలు విపరీతంగా పోటీ పడుతున్నారు. నాస్త్యాకు దాదాపు 104 మిలియన్ల మంది, డయానాకు 104 మిలియన్ల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. అంతేకాదు కొన్నిసార్లు వీళ్లను ప్రమోట్​ చేసే కంపెనీల మధ్య కూడా వ్యాపారపరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మరో సమస్య ఏంటంటే వీళ్లంతా మరికొన్ని ఏళ్లలో పెద్దవాళ్లు అవుతారు. అప్పుడు ఎలాంటి వీడియోలు తీయాలనే విషయమై గందరగోళం నెలకొంది. ఫ్యూచర్​ ప్లాన్లపై చాలా చర్చలు జరుగుతున్నాయని ఈ నలుగురు తల్లిదండ్రులు అంటున్నారు.