మానవత్వానికి ప్రతిరూపం ఎం.నాగార్జున

మానవత్వానికి ప్రతిరూపం ఎం.నాగార్జున

మానవత్వం, సేవా భావం, నిజాయితీ, కార్యదక్షత ఉన్న అధికారులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా ఏ శాఖలో పనిచేసినా అటువంటి గొప్ప విలువల ముద్ర వేసిన ఎం.నాగార్జున(1955-–2002) మరణించి 19 ఏండ్లు అయ్యింది. ఏండ్లు గడుస్తున్నా ఆయనతో పనిచేసిన, ఆయనలో చూసిన సమున్నత విలువల జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. ప్రముఖ చరిత్రకారుడు మామిడిపూడి వెంకట రంగయ్య కుమారుడైన నాగార్జున ఐఏఎస్‌‌‌‌ సాధించిందే ప్రజల సేవ కోసం అనిపిస్తుంది. దాన్ని ఒక హోదాగా ఏనాడూ భావించలేదు. ప్రజలకు మేలు చేసే ఒక బాధ్యత అనుకునేవారు. తన సమయాన్నంతటినీ ప్రజల సమస్యలు విని అర్థం చేసుకునేందుకు, వాటిని సానుభూతితో పరిష్కరించే దిశగా సిబ్బందిని సిద్ధం చేసేందుకు వెచ్చించేవారు. సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నంలో శాఖ కార్యక్రమాలు, లక్ష్యాలు ఆయన క్షుణ్ణంగా తెలుసుకునేవారు. ఏ ఫైలును గంటసేపు ఆపినా స్టూడెంట్లు, టీచర్లు ఏదో ఇబ్బంది పడతారని భావించేవారు. ఏనాడూ టేబుల్‌‌‌‌ మీద పెండింగ్‌‌‌‌ ఫైల్‌‌‌‌ ఒక్కటి కూడా ఉండేది కాదు. తన సిబ్బంది, అధికారులు మంచివారైతే చాలదు. సామర్థ్యం కూడా ముఖ్యం అనేది నాగార్జున సిద్ధాంతం. ఫైలు పరిష్కరిస్తే  దాని ద్వారా నాకేమైనా ఇబ్బంది వస్తుందేమోనని భయపడే అధికారుల వైఖరిని ఒప్పుకునే వారు కాదు. మౌనం కూడా ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆయన భావన. ఒకసారి ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌‌‌‌లో మధ్యలోనే బడి మానేసిన పిల్లల కోసం ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న రెసిడెన్షియల్‌‌‌‌ బ్రిడ్జ్‌‌‌‌ కోర్సుకు ఒక అధికారి నిధులు విడుదల చేయడం ఆలస్యం చేశారు. పిలిచి ఎందుకలా చేశావని అడిగితే ఆ సంస్థ నిధులు దుర్వినియోగం చేస్తున్నదని, అందుకని విడుదల చేయలేదని సమాధానం చెప్పారు.

నిజానికి మరో అధికారి అయితే మంచిపని చేశావనే వారు. కానీ నాగార్జున అలా కాదు.. ఫిర్యాదులుంటే తగిన ఏజెన్సీతో విచారణ చేయించి చట్టప్రకారం చర్య తీసుకోవాలి. అలా చేయకుండా నిధులు ఆపితే బ్రిడ్జ్‌‌‌‌ కోర్సు చేస్తున్న  పిల్లలు ఆకలితో అలమటిస్తారు కదా? అన్నారు. వెంటనే నిధులు విడుదల చేశారు. అలాంటి సంఘటనలు ఎన్నో. మనం ప్రజలకు సేవకులం. వారికి జవాబుదారీగా పనిచేయాలని అనే వారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు అనవసరంగా వృథా అవుతున్నాయి అనుకుంటూ ప్రతి లబ్ధిదారుడిని అనుమానంగా చూడడం సరికాదు. సానుకూల ధృక్ఫథం కలిగి ఉండాలని చెప్పేవారు. ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుందా అని ఆలోచించేవారు. ప్రభుత్వ అధికారిగా నిబంధనలను అధ్యయనం చేయాలి. ఆ ఫైలును నిబంధనలకు అనుగుణంగానూ, ప్రజలకు మేలు జరిగే విధంగానూ పరిష్కరించాలని చెప్పేవారు. అలా చేసేవారు కూడా. నాగార్జున ఒక సామాన్యమైన వ్యక్తిలా ప్రవర్తించేవారు తప్ప ఒక ఉన్నతాధికారిని అని ఏనాడూ భావించేవారు కాదు. ఆయన నిరాడంబరంగా జీవించేవారు. నిరంతరం పనిచేస్తూనే కనిపించేవారు. అంతటి ఉన్నతాధికారి అయి ఉండీ మధ్యాహ్నం భోజనం వేళ ఆయన వద్దకు ఏ ఉద్యోగి అయినా వెళితే పట్టుబట్టి తన భోజనంలో సగం పెట్టాల్సిందే. హోదా చూసేవారు కాదు. ఆప్యాయంగా, ఆదరంగా చూసేవారు. ఆయన జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌‌‌‌గా పనిచేసినప్పుడు సన్నిహితంగా పనిచేసి ఆయన ఔన్నత్యాన్ని గమనించాను. వైద్య విద్యా డైరెక్టర్‌‌‌‌గా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చి వెయ్యి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలను నిర్మించారు. ఇది జరిగి 20 ఏండ్లు గడిచాయి. కానీ, ఆ భవనాల్లో రోగులకు లభిస్తున్న ఉచిత సేవలకు వెల కట్టగలమా? అలాంటి ఎన్నో మంచి పనులు చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించి 48 ఏండ్లకే అనారోగ్యంతో 2002 మార్చి 28న నాగార్జున కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా, నాలాంటి ఎందరో ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడమంటే ప్రభుత్వ అధికారిగా, ఒక మానవునిగా కర్తవ్యాన్ని గుర్తెరగడమే. 
ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి.