ఇన్​స్పిరేషన్ : ఇండియా రోడ్లకు పర్ఫెక్ట్‌ గ్రిప్‌

ఇన్​స్పిరేషన్ : ఇండియా రోడ్లకు పర్ఫెక్ట్‌ గ్రిప్‌

ఎలాగైనా సక్సెస్‌ కావాలనే పట్టుదల.. భవిష్యత్తు మీద నమ్మకంతోనే ఓ వ్యక్తి మద్రాస్‌ వీధుల్లో రబ్బరు బెలూన్లు అమ్ముతూ తిరిగాడు. కట్‌ చేస్తే... నాలుగేండ్లు తిరగకముందే అతని కంపెనీ బెలూన్ల బిజినెస్‌లో నెంబర్‌‌ వన్ పొజిషన్‌ దక్కించుకుంది. ఆ తర్వాత టైర్ల బిజినెస్‌లోకి వచ్చి లీడింగ్‌ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఆ కంపెనీ ఏంటనేది అర్థమై ఉంటుంది. అదే ఎం.ఆర్‌.‌ఎఫ్​. దీని ఫౌండర్​ కె.ఎం. మమ్మెన్ మాపిళ్లై. 

మోటార్ వెహికిల్స్‌ నడుపుతున్న ప్రతి ఒక్కరికీ ఎం.ఆర్‌.‌ఎఫ్. గురించి తెలుస్తుంది. ఎం.ఆర్‌.‌ఎఫ్.​ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ)ఇండియాలోనే టాప్ టైర్ల కంపెనీ అయినా.. కొంతమంది పిల్లలు అది క్రికెట్​ బ్యాట్లు తయారుచేసే కంపెనీ అనుకుంటారు. ఒకప్పుడు సచిన్, ఇప్పుడు కోహ్లీ వాడే బ్యాట్ల మీద ఎం.ఆర్‌.‌ఎఫ్‌. లోగో రాసి ఉండడమే అందుకు కారణం. ఇలాంటి మార్కెటింగ్‌ స్ట్రాటజీలతో టైర్ల మార్కెట్‌లో లీడింగ్ కంపెనీగా ఎదిగింది ఎం.ఆర్‌‌.ఎఫ్​. అయితే.. ఈ సక్సెస్‌ ఒక్కరోజులో వచ్చింది కాదు. దాని కోసం కంపెనీ ఫౌండర్‌‌ మమ్మెన్‌ మాపిళ్లై ఎంతో కష్టపడ్డారు. 

పెద్ద కుటుంబం

కె.ఎమ్. మమ్మెన్ మాపిళ్లై 1922లో కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిపెరిగాడు. ఎనిమిది మంది అన్నలు, ఒక చెల్లెలుతో మాపిళ్లైది చాలా పెద్ద కుటుంబం. అతని తండ్రికి వార్తాపత్రిక, బ్యాంకు ఉండేవి. అయితే, అతని తండ్రిని ట్రావెంకోర్ రాజ వంశస్తులు రెండేండ్లు జైలులో పెట్టారు. కుటుంబ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. దాంతో కుటుంబానికి ఏమీ మిగల్లేదు.

పెద్ద కుటుంబం కావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. అలా ఇబ్బంది పడుతూనే మాపిళ్లై చదువుకున్నాడు. తండ్రిని అరెస్ట్‌ చేసినప్పుడు మాపిళ్లై దగ్గర డబ్బులు లేక కాలేజీలోని సెయింట్ థామస్ హాల్‌లో పడుకునేవాడు. అలా చాలా కష్టపడి చదువు పూర్తి చేశాడు.  

బిజినెస్‌లోకి.. 

మాపిళ్లై భార్య కుంజమ్మ ఒక కెమిస్ట్. అందుకే 1946లో ఆమెతో కలిసి మద్రాసులోని తిరువత్తియూర్‌లోని ఒక చిన్న షెడ్‌లో బెలూన్‌ బొమ్మలు తయారుచేసే యూనిట్‌ పెట్టుకున్నాడు. దానికి ‘మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ’ అని పేరు పెట్టాడు. రోజూ భార్యాభర్తలిద్దరూ కలిసి బొమ్మలు తయారుచేసేవాళ్లు. మాపిళ్లై వాటన్నింటినీ ఒక సంచిలో వేసుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. అయితే.. చేసేది చిన్న వ్యాపారమైనా పూర్తి శ్రద్ధతో చేయాలి అనుకునేవాడు మాపిళ్లై.

అందుకే చాలా కష్టపడి పనిచేశాడు. ప్రతి సంవత్సరం ప్రొడక్షన్‌ పెంచుతూ వెళ్లాడు. కస్టమర్లను ఆకర్షించే అతని స్కిల్స్‌ వల్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. లాభాలు బాగా వచ్చాయి. దాంతో 1949 నాటికి కంపెనీ రబ్బరు గ్లౌజ్‌లు, గర్భనిరోధకాలను తయారుచేసింది. తర్వాత మద్రాసులోని తంబు చెట్టి వీధిలో మొదటి ఆఫీస్‌ని కూడా ప్రారంభించారు.

టైర్ల రంగంలోకి

మాపిళ్లై బంధువుల్లో ఒకరికి టైర్ రీట్రేడింగ్ ప్లాంట్‌ ఉంది. అతను ట్రెడ్ రబ్బరుని విదేశీ టైర్ కంపెనీల నుంచి కొనుక్కునేవాడు. అది గమనించిన మాపిళ్లై తాను కూడా ట్రెడ్ రబ్బర్ తయారీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. పైగా ఆ టైంలో మార్కెట్‌లో టైర్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే అతను మార్కెట్‌లోకి వచ్చిన కొద్దికాలంలోనే టైర్ల లైఫ్‌ పెంచే ఎం.ఆర్‌.‌ఎఫ్.​ ‘ట్రెడ్ రబ్బర్’ సక్సెస్‌ అయ్యింది. అంతేకాదు.. ఈ రకమైన ట్రెడ్ రబ్బర్‌ను తయారు చేసిన ఏకైక భారతీయ యాజమాన్య యూనిట్‌గా ఎం.ఆర్‌.‌ఎఫ్‌. అవతరించింది.

మంచి క్వాలిటీ వల్ల కొన్నేండ్లలోనే మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. ఏకంగా మార్కెట్‌లో 50 శాతం వాటా చేజిక్కించుకుంది. ఎం.ఆర్‌‌.ఎఫ్‌. ఎఫెక్ట్‌ వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్​ కంపెనీలు కూడా మార్కెట్‌లో కనిపించకుండా పోయాయి. ఎం.ఆర్‌.‌ఆఫ్‌. లాభాలు మరింత పెరిగాయి. వెంటనే మాపిళ్లై కంపెనీని విస్తరించాలని డిసైడ్​ అయ్యాడు. దాంతో ఇదివరకు ట్రెడ్‌ రబ్బర్‌‌ మాత్రమే తయారు చేసిన మాపిళ్లై... ​ టైర్ల తయారీ మొదలుపెట్టాలి అనుకున్నాడు. 

విదేశీ కంపెనీలే!

అప్పట్లో ఇండియన్‌ ఆటోమొబైల్ టైర్ ఇండస్ట్రీ ‘డన్‌లప్, ఫైర్‌స్టోన్, గుడ్‌ఇయర్‌’ కంపెనీల చేతుల్లోనే ఉండేది. టైర్లు తయారు చేసేవన్నీ విదేశీ కంపెనీలే. ఈ విదేశీ కంపెనీలు పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయే విషయం ప్రభుత్వం గుర్తించింది. సైన్యం వాడే వెహికల్స్‌కి కూడా ఈ కంపెనీల నుంచే టైర్లు వచ్చేవి. కాబట్టి, యుద్ధం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ కంపెనీలు ఒక ముఠాగా ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం టైర్ల పరిశ్రమలోకి ఇండియన్‌ కంపెనీలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం మొదలుపెట్టింది. సరిగ్గా ఆ టైంలోనే ఎం.ఆర్‌.‌ఎఫ్‌. ఎంట్రీ ఇచ్చింది. 

సవాళ్లు

ఎం.ఆర్‌.‌ఎఫ్‌. టైర్ల తయారీ మొదలుపెట్టినప్పుడు మార్కెట్‌లో ప్రధానంగా మూడు మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉన్నాయి. వాటినుంచి పోటీని తట్టుకోవడం ఎం.ఆర్‌.‌ఎఫ్‌.కు చాలా కష్టమైంది. పైగా ఆ కంపెనీల దగ్గర కావాల్సినంత క్యాపిటల్‌ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రొడక్షన్‌ని పెంచగలవు. కానీ.. ఎం.ఆర్‌‌.ఎఫ్.​ పరిస్థితి అలా కాదు. లిమిటెడ్‌ క్యాపిటల్‌తో నడుస్తోంది. పైగా ఆ కంపెనీలు ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉండడం వల్ల వాటికి మేకింగ్‌ టెక్నాలజీ బాగా తెలుసు.

అయినా.. వెనక్కి తగ్గకుండా వాటితో పోటీ పడి మరీ ప్రొడక్షన్‌ మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీ కోసం అమెరికాలో ఉన్న ఓహియోలోని మాన్స్‌ఫీల్డ్ టైర్ అండ్‌ రబ్బర్ అనే చిన్న  కంపెనీ సాయం తీసుకున్నారు. టైర్ ఫ్యాక్టరీని 1961లో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవరహర్‌‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. అదే ఏడాది కంపెనీ ఐపీవోకి కూడా వెళ్లింది. 

దాంతో నష్టాలు!

ఎం.ఆర్‌.‌ఎఫ్​.కు యూఎస్‌ కంపెనీ సాయం చేసిన టెక్నాలజీ ఇండియన్‌ రోడ్లకు సెట్‌ కాలేదు. వాళ్లు అమెరికా రోడ్లకు తగ్గట్టు టైర్లను డిజైన్‌ చేస్తారు. కానీ.. మన దగ్గర పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి. పైగా ఓవర్‌‌లోడ్‌ని తట్టుకోవాలి. కానీ.. ఎం.ఆర్‌.‌ఎఫ్‌. టైర్లు అలా తట్టుకునేవి కాదు. దాంతో అమ్మకాలు పెరగకపోవడంతో కంపెనీ నష్టాలు చూడాల్సి వచ్చింది. అప్పటి విదేశీ కంపెనీలు.. ఇండియన్‌ కంపెనీలు టైర్లను తయారు చేయలేవని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. 

మార్కెటింగ్ వ్యూహాలు 

తర్వాత టైర్ల క్వాలిటీని పెంచడంతోపాటు మార్కెటింగ్‌ మీద కూడా దృష్టి పెట్టారు. కొత్త స్ట్రాటజీలతో మార్కెటింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టారు. కొన్నేండ్లలో టైర్ల అమ్మకాలు పెరిగాయి. బ్రాండ్‌ ఇమేజ్ క్రియేట్‌ అయ్యింది. అడ్వర్టైజ్​మెంట్స్​ బాధ్యతను భారతీయ ప్రకటనల పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ‘అలిక్ పదమ్‌సీ’కి అప్పగించారు. కస్టమర్లకు ఎం.ఆర్‌.‌ఎఫ్‌. టైర్ల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆయన. కొంతమంది ట్రక్ -డ్రైవర్లను కలిశాడు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. టైర్లు బలంగా, శక్తిని ప్రతిబింబించేలా ఉండాలని అర్థం చేసుకున్నాడు. అందుకే 1964లో కండలు తిరిగిన ఒక పురుషుడి బొమ్మతో ‘లోగో’ తయారు చేయించాడు.

ఎం.ఆర్‌.‌ఎఫ్.​ టైర్ల పటిష్టతను ఆ ‘మజిల్‌ మ్యాన్’ ద్వారా చెప్పాడు. ఈ యాడ్‌ 80వ దశకంలో సిగ్నేచర్ మ్యూజిక్‌తో టీవీ ప్రకటనల్లో టెలికాస్ట్ అయ్యింది. ఆ బొమ్మ వల్లే ఎం.ఆర్‌.‌ఎఫ్. చాలా పాపులర్‌‌ అయ్యింది. అంతేకాదు.. జనాల్లోకి బలంగా వెళ్లేందుకు మోటార్‌స్పోర్ట్స్‌ కూడా ఏర్పాటు చేసింది. అలా కొత్త ఎత్తుగడలతో తొలినాళ్లలో అడ్డంకులుగా ఉన్న డన్‌లప్, ఫైర్‌స్టోన్‌ లాంటి కంపెనీలను అధిగమించడమే కాకుండా.. ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ కంపెనీ అయిన ‘మిచెలిన్’ లాంటి విదేశీ బ్రాండ్లను కూడా విజయవంతంగా ఓడించింది. 

ఎక్స్​పోర్ట్​ చేసిన మొదటి కంపెనీ

డీలర్ల రూపంలో దేశవ్యాప్తంగా ప్రతి మూలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. అందుకే.. ఎం.ఆర్‌.‌ఎఫ్.​ బలమైన డీలర్ల వ్యవస్థను నిర్మించుకుంది. ఈ డీలర్ల ద్వారా దేశంలోని ప్రతి మూలకు టైర్లను సరఫరా చేస్తోంది. అంతేకాదు.. టైర్ల తయారీ కోసం కొత్త ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది కంపెనీ. 1970ల్లో కొట్టాయంలో రెండో ప్లాంట్‌, 1971లో గోవాలో మూడవ ప్లాంట్‌, 1972లో అరక్కోణంలో నాల్గవ ప్లాంట్ మొదలుపెట్టారు. తొలినాళ్లలో అమెరికా నుంచి టెక్నాలజీ తెచ్చుకున్న కంపెనీ ఇప్పుడు అమెరికాకే టైర్లను ఎగుమతి చేస్తోంది.

అతేకాదు.. ఎం.ఆర్‌.‌ఎఫ్‌. యూఎస్‌కు టైర్లు ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇండియాలో 24 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా సొంతం చేసుకుంది. ప్రపంచ మార్కెట్‌లో 12 శాతం వాటాతో 65 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ప్రస్తుతం ఎం.ఆర్‌.‌ఎఫ్​. ప్రపంచంలోనే 15 వ అతిపెద్ద టైర్ కంపెనీ.  ఎం.ఆర్‌.‌ఎఫ్.​ కన్వేయర్ బెల్ట్​, పెయింట్స్ లాంటి ఇతర బిజినెస్‌ల్లోకి  కూడా విస్తరించింది. 

క్రికెట్ 

ఈ కంపెనీ చాలా కాలం నుండి భారీగా పెట్టుబడి పెట్టిన మరో రంగం క్రికెట్. ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇవ్వడానికి 1987లో ‘ఎం.ఆర్‌.‌ఎఫ్.​ పేస్ ఫౌండేషన్‌’ని స్థాపించారు. ఇందులో అన్ని ప్రత్యేక సదుపాయాలతో బౌలర్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు. దీన్ని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ సాయంతో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, శ్రీశాంత్, చమిందా వాస్, గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ... ఇలా ఎంతోమంది క్రికెటర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక అడ్వర్టైజ్​మెంట్ల విషయానికి వస్తే.. బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ లాంటి ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లు వాడే బ్యాట్స్‌ మీద ఎం.ఆర్‌.‌ఎఫ్​. అనే పేరు కనిపిస్తుంటుంది.