కథ : మా శ్రీనివాసనగర్ కాలనీ పార్కు 

కథ : మా శ్రీనివాసనగర్ కాలనీ పార్కు 

మొత్తానికి మా శ్రీనివాసనగర్ కాలనీ పార్కు రిబ్బన్ కటింగ్​ అయింది. కాలనీ వాసుల పదేళ్ల కల ఇన్నాళ్లకు నిజమైంది. హైదరాబాద్ శివారు, విలేజీ అని పేరు పడ్డ లింగంపల్లి  గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వేషం కట్టి రెండేండ్లయింది. ఈ మార్పు మాయతో పంట పొలాల గొంతులెండిపోయినా కరెన్సీ కంకుల్ని పండించాయి. పల్లెటూరి రకం పాతకాలపు ఇళ్లు, పశువుల కొట్టాలు అన్నీ బుల్ డోజర్ల  కాళ్ళ కింద కకావికలమై అదే నేల మీద రంగురంగుల ఐదంతస్తుల భవంతులు రెక్కలు కట్టుకొని వాలినట్లు నిలబడ్డాయి. అయినప్పటికీ ఆ ప్రాంతమంతా ఇంకా విలేజి కుబుసం విడుస్తున్నట్టే ఉంటుంది.  

ఏళ్ల తరబడి సర్పంచులుగా, పంచాయతీ మెంబర్లుగా ఉన్న పక్కా లోకల్ పంచె కట్టు, బుర్ర మీసాల నేతలు ఊహాతీతమైన ఈ మార్పు అర్థం కాక  పక్కకు తప్పుకొని పాత కాపులుగా మిగిలిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లాల మనుషులిక్కడ వార్డుకొక్కరు  కార్పొరేటర్లయి ‘ఈ ఊరు మనదిరా’ అన్న రేంజిలో ఎదిగిపోయారు. ఇలాంటి చోట మా శ్రీనివాసనగర్ కాలనీ ఓ వార్డు. లెక్కేస్తే ఇరవై మిడిల్ క్లాసు అపార్టుమెంట్ల భూభాగం. మా ఇళ్ళకెదురుగా ఉన్న ఓ చిన్నపాటి చెరువు వర్షాకాలం వరద నీళ్లతో, మిగతా కాలం గుర్రపు డెక్కల ఆకులతో బతుకీడ్చేది. ఈ మాత్రం దానికే మా చుట్టూ కొత్తగా వెలుస్తున్న అపార్టుమెంట్లను బిల్డర్లు లేక్ వ్యూ అంటూ బిల్డప్ ఇచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. తన స్తన్యమే తాగి కాలనీలు పెరిగినట్లు కొన్నాళ్ళకు ఆ చెరువు ఒట్టిపోయిన గేదెలా కుంచించుకుపోయింది. చెరువో, చేలుకో ఏదైనా గజానికి కనీసం ముప్పై వేలు పలికే నగరంలో నిర్జన భూమి ఎవరినైనా ఊరిస్తుంది. ముందే జాగ్రత్త పడ్డ మేము ఎండిన చెరువులో ఓ రెండెకరాల జాగా కాలనీ పార్కుకోసం కావాలని కార్పొరేటర్​ను వదలకుండా పట్టుబట్టాం. ‘వచ్చే ఎన్నికల్లో మా ఓట్లన్నీ మీకేన’ని ఒట్టు పెట్టాం. పదవిపై ప్రేమను చంపుకోలేక, చేజేతులారా భూమిని పళ్లెంలో పెట్టి ఈయలేక సతమతపడ్డ కార్పొరేటర్ దీర్ఘకాలజ్ఞుడై చివరకు చెరువు భూమిలో ఓ ముక్కని  పార్కు కోసం కేటాయించి మున్సిపల్ తీర్మానం కాపీని మ్యాప్​తో సహా మా  చేతిలో పెట్టాడు. విజయసూచకంగా మేమంతా ఆ నేలపై సంబరంగా వనభోజనాన్ని ఏర్పాటు చేసుకొని అదే ఊపులో కార్పొరేటర్​ను సత్కరించాం. అక్కడే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటే మున్సిపాలిటీ తరఫున వెలుగుజిలుగుల ఏర్పాట్లు జరిగాయి.

   ఎందుకైనా మంచిదని స్థలం ‘మాది’ అనేందుకు మా కాలనీ అసోసియేషన్ల ఖర్చుతో సరిహద్దుల్లో రాళ్లు పాతించి ఇనుప కంచె వేయించాం. ‘ఈ స్థలం పార్కు కోసం కేటాయించింది’ అని మున్సిపాలిటీ పేరిటనే  బోర్డు పెట్టించాం. అదంతా చూస్తుంటే ఇది మా అందరిది అనే భావన మాలో దృఢపడిపోయింది. అందువల్లే అక్కడ పిల్లలు క్రికెట్ ఆట మొదలెట్టారు. మార్నింగ్ వాక్ చేసేవాళ్లు రౌండ్లు కొడుతున్నారు. కూచుంటానికి వసతి లేదని కొందరు వాళ్ళ విగత తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. మా కాలనీలో బోర్​వెల్ బిజినెస్ ఉందని ఉచితంగా బోరు వేసి మోటార్ పంపు బిగించారు. కార్పొరేటర్ కరెంటు కనెక్షన్ ఇప్పిస్తే మా ఖర్చుతో వెలుగులు తెచ్చాం. హరితహారంలో భాగంగా మొక్కలు తెచ్చి పార్కు నిండా నాటాం. ఎవరికి తోచిన ప్రకారం వాళ్లు ఓ చెయ్యేసి దాన్ని మామూలు మున్సిపల్ పార్క్ కన్నా గొప్పగా తీర్చిదిద్దారు.

    అలా సర్వాంగ సుందరంగా నిలబడ్డ పార్కు పనులు చూసుకునేందుకు ఒక వాచ్ మన్  కావాలని కాలనీ అసోసియేషన్ నిర్ణయించి మా బడ్జెట్​లోంచే కొంత సొమ్ము కేటాయించింది. పార్కులో ఏ కార్యక్రమానికైనా మా అనుమతి తీసుకొనే విధంగా అనధికారికంగా దానిపై మాకు హక్కు వచ్చింది. పార్కు వార్షికోత్సవాన్ని కాలనీ వాళ్లతో ఆటలపోటీలు జరిపి సంబరంగా చేసుకున్నాం.

   అంతా సజావుగా సాగుతున్న తరుణంలో ఓ రోజు రాకాసి నోరున్న జేసీబీ వాహనం వచ్చి గేటును పీకేసి, లోపల బెంచీలను విరగ్గొట్టి చెట్లను తొక్కేస్తూ... విలయతాండవమాడింది. వాచ్​మన్ పరుగున వచ్చి కాలనీ అంతా వినబడేలా బిగ్గరగా అరుస్తూ బుల్డోజింగ్ విషయం చెప్పాడు. సైరన్ మోతకు పరిగెత్తినట్లు అందరం అక్కడికి చేరాం. మాలో ఒకాయన జేసీబీ డ్రైవర్​ను కిందికి దింపి, బయటికి లాక్కొచ్చాడు. మా కోపం చూసిన డ్రైవర్ భయంతో ఎవరికో ఫోన్ చేయగానే మోటార్ సైకిల్​పై ఒకాయన వచ్చి పని ఆపటానికి మీరెవరు అన్నట్లు ఎగాదిగా చూశాడు.

ఆయన చూపులను పట్టించుకోక ‘ఏంటయ్యా! ఎవరు నువ్వు. ఈ పనేంటి?’ అని కోపంగా అడిగాడు మా సంఘనేత.  ‘నేను కాంట్రాక్టర్​ను, ఇది మున్సిపల్ స్థలం. అదే ఆఫీసు నుంచి ఈ వర్క్ ఆర్డర్ నాకు దొరికింది’ అన్నాడు. ‘అంతా చక్కగా ఉన్నదానిని కూలదోసేయమని నీకు కాంట్రాక్ట్ ఎవరిచ్చారు?’ అని అడిగింది గుంపులోంచి ఒకావిడ. వెంటనే ఆయన కార్పొరేటర్​కు ఫోను కలిపి స్పీకర్ ఆన్ చేసి  ‘ఏందన్నా! ఈ కాలనీ వాళ్లు పని జరగనిస్తలేరు. ఓసారి మాట్లాడు’ అని మా నేత చేతిలో ఫోను పెట్టాడు.
‘పార్క్ డెవలప్​మెంట్ కోసం కోటి రూపాయలు మంజురైనాయి. పనులు జరగాలి కదా! ఇన్నాళ్లు మీరు టెంపరరీగా ఏవో కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిని తీసేయక తప్పదు’ అన్నాడు కార్పొరేటర్.

 అది విన్న మా అందరి గొంతులు తడారిపోయాయి. ఇక పక్కకు తప్పుకోక తప్పలేదు. పెద్దల స్మారకంగా విరాళంగా ఇచ్చిన పార్కు గేటు, సిమెంట్ బెంచీలు మా ముందరే ముక్కలు చెక్కలై పోతున్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండేశాయి. నా చెట్టు, నీ చెట్టు అని పిల్లలు అపురూపంగా నాటుకున్న పూల మొక్కలు, అవి చిగురులేసి పూలు పూస్తుంటే పిల్లల సంబరాలు అన్నీ తొక్కుడులో కలిసిపోయాయి. పచ్చని పార్కు మట్టి దిబ్బల స్మశానంలా మారిపోయింది. 

   కోటి రూపాయల ఖర్చుతో పార్కు కొత్తగా మరింత మంచిగా తయారవుతుంది. అది అయ్యాక మళ్లీ  తాము కోరినట్లు మలుచుకోవచ్చని మేమంతా సర్దుకొని కుదుటపడ్డాం. అయితే పార్కును నేలమట్టం చేసి ఆర్నెల్లయినా పని ముందుకు సాగలేదు. మంజూరు ప్రకారం అందులో వాకింగ్ ట్రాక్ వేయాలి. వ్యాయామం చేసేవారి కోసం ఓపెన్ జిమ్ నిర్మించాలి. పిల్లల కోసం జారుడు బండ, ఉయ్యాల లాంటి ఆట సామాగ్రి బిగించాలి. వాష్ రూమ్స్ కట్టాలి. వాటిలో ఒక్క పనీ ఇంకా మొదలు కాలేదు. కార్పొరేటర్​ను అడిగితే ‘కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్​లో ఉంది. వారం రోజుల్లో మంజూరు చేయిస్తా. పని మొదలవుతుంది. గవర్నమెంట్ పనులు ఎట్లుంటయో మీకు తెల్వదా!’ అన్నాడు.

  మేము కొన్నాళ్ళు నిరాశగా స్థలం వైపు చూసి, ఇంకొన్నాళ్ళకి ఆ వైపు చూడడం మానేశాక ఓ రోజు ఎవరో వచ్చి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, జిమ్ కోసం మార్కింగ్ చేస్తూ కనిపించారు. మాలో మళ్ళీ ఆశలు చిగురించాయి. గుండ్రంగా వాకింగ్ ట్రాక్ కోసం మార్క్ చేసిన స్థలంలో ఎర్రమట్టి పోసి రోడ్ రోలర్​తో చదును చేశారు. ట్రాక్​కు ఇరువైపులా మూరెడు సైజు సిమెంట్ దిమ్మెలు పాతి వాటికి  తెలుపు, ఆకుపచ్చ రంగులు పూశారు. పార్క్ మెడలో పచ్చలహారంలా అది మెరిసిపోయింది. ఆడ, మగ వాకింగ్ ప్రియులు సంబరపడిపోయారు. పిల్లల కోసం ఓ జారుడుబండ, ఉయ్యాల తెచ్చి నిలబెట్టారు. అవి పార్కు చెవి దుద్దుల్లా అదిరిపోయాయి. ఇంకా జిమ్ వస్తువులు రావాల్సి ఉంది. కాంపౌండ్ వాల్ కట్టాలి, గేట్లు పెట్టాలి. 

 మున్సిపల్ మినిస్టర్ గారు పార్కు ఇనాగరేషన్​కు టైం ఇచ్చారని హడావిడి చేస్తూ కార్పొరేటర్ ఇలా రిబ్బన్ కట్ చేయించాడు. ‘మినిస్టర్ గారికి ఎలాంటి ఫిర్యాదు చేయవద్దు. ఆయనకు భారీగా సన్మానం చేసి పొగుడుతూ మాట్లాడాలి. దాంతో పార్క్ కోసం స్పెషల్ ఫండ్ మంజూరు చేయించుకోవచ్చు’ అని కార్పొరేటర్ ముందే  మమ్మల్ని ఆశ పెడుతూ రెడీ చేశాడు. ఆరంభ సంరంభ ఖర్చంతా మేమే ఫ్లాటుకింత వేసుకొని భరించాం. ఏర్పాట్లు అదిరిపోయాయి. మా కాలనీలో ఉన్న సభా సామ్రాట్లు మంత్రిగారిని పొగడ్తలతో ఆకాశానికెత్తారు.

  అంతలో వర్షాకాలం వచ్చింది. ఒక్క వర్షానికే వాకింగ్ ట్రాక్​లోని ఎర్రమట్టి పానకమైంది. పట్టు వదిలిన సిమెంటు దిమ్మెలు పుచ్చుపన్ను ఊడినట్లు పక్కలకు ఒరిగిపోయాయి. నాలుగురోజుల తర్వాత జిమ్ వస్తువులు తెచ్చిన ట్రక్కు లారీ దిమ్మెలని తొక్కుకుంటూ ఓ మూలన వాటిని దింపి వెళ్ళింది.

  ఇదంతా భరించలేక  మాలో ఒకాయన కార్పొరేటర్ కు ఫోను కలిపి ‘ఇలా ఒక పనిని తొక్కేస్తూ ఇంకో పని మొదలైతే మా పార్కు గతేమవుతుంది?’ అని  అడిగాడు.‘సార్! మీరు పార్కు  మీద బాగా ప్రేమ పెంచుకున్నట్లున్నారు. మంచిదే. కానీ, అది కార్పొరేషన్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం దాన్ని ఎలా పూర్తి చేయాలో మా ఇంజనీర్లు చూసుకుంటారు. శుభవార్త ఏమిటంటే వాకింగ్ ట్రాక్​లో టైల్స్, జిమ్ బేస్మెంట్ కోసం మరో 70 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. త్వరలో ఆ పని అవుతుంది. ఇంకేం మీ పార్క్ అదిరిపోద్ది’ అని ఫోన్ పెట్టేశాడు.

 కొన్ని రోజులకు వాకింగ్ ట్రాక్​లో టైల్స్ పరచి సిమెంట్ ఇటుకలను హద్దులుగా పెట్టారు. పార్కుకు ఓ పక్కన షాబాదు రాళ్లతో అరుగు తయారుచేసి, దానిపై జిమ్ పరికరాలను బిగించారు.అకాల వర్షాలకు ఇప్పుడు హైదరాబాద్ అడ్రసుగా మారిపోయింది. అలాంటి ఓ ముసురు దెబ్బకు వాకింగ్ ట్రాక్​పై వేసిన నెల రోజులకే టైల్స్ కొన్ని కదిలి, కొన్ని కుంగి విరిగి కాలు పెడితే నడుస్తామా? జారిపడతామా  తెలియని పరిస్థితి వచ్చింది. కార్పొరేటర్​కు చెప్తే ‘అది నేచర్స్ ఎఫెక్ట్. కాంట్రాక్టర్​ను ఏమి అనలేం. ఇట్లాగే మియాపూర్ పార్క్ లో జరిగితే రిపేర్లకి 20 లక్షల రూపాయలు మంజురైనాయి. అలా ప్రయత్నం చేస్తా..కమిషనర్ మనవాడే!’ అని చెప్పాడు.

 ఆయన మాటలు వింటుంటే ఎంత తొందరగా పనులు చెడిపొతే అంత లాభమన్నట్లుగా ఉన్నాయి. ముసలాళ్లు ట్రాక్ పై నడవడానికి భయపడి బయటే వాకింగ్ చేస్తున్నారు. వారి బాధ చూడలేక మేమే కొంత సొమ్ము జమ చేసి టైల్స్​ని గట్టిగా పరిపించాం. 
  జిమ్ పరికరాల క్వాలిటీ డిఫెక్టో, మెయింటెనెన్స్ లోపమో కానీ కొన్నాళ్లకే అవి వాడుతుంటే  సప్తస్వరాలు పలకడం మొదలుపెట్టాయి. మనుషుల బరువు మోయలేక మొరాయించి కొన్ని వికలాంగులయ్యాయి. ‘అవి లోకల్ మేడ్ ఐటమ్స్. వాటికి ఎలాంటి గ్యారెంటీ లేదు. కావాలంటే కొత్తవాటికి ఫ్రెష్ టెండర్ వేద్దాం! మీరేం దిగులు పడకండి” అని   కార్పొరేటర్ అన్నాడు. పోలీసు ఉద్యోగాలకు శరీరదారుఢ్యం పెంచుకునేందుకు వాటిపై ప్రాక్టీసుకి వచ్చే యువకులు దిగాలు పడిపోయారు. వారి బాధ చూడలేక మా అపార్ట్​మెంట్స్​లో ఉన్న జిమ్స్​లోంచి ఒక్కో వస్తువును తెచ్చి బిగించి సాయపడ్డాం. 

  ఓ రోజు ట్రాక్టర్ వచ్చి  పునాది రాళ్లను  తెచ్చి ఏకంగా వాకింగ్ ట్రాక్​పై వేసింది. అలా ట్రాక్ అంతా బండలతో నిండిపోయింది. చూడవచ్చిన కాంట్రాక్టర్ ఆ రాళ్లు పార్క్  ప్రహరీ గోడ కోసం అన్నాడు. ‘‘అయ్యా మహానుభావా! ఆ రాళ్లను బయట వేయొచ్చు కదా!’’ అని అడిగితే ‘‘పార్కులో ఇంత ఖాళీ జాగ ఉంటే బయట రోడ్డు మీద ఎలా వేస్తాం!’’ అని బదులిచ్చాడు. చుట్టూ ఉన్న కంచెను తీసేసి గోడ కడుతుంటే సిమెంట్, ఇసుక, రాళ్లు పడి చుట్టూరా పెరిగిన పూలమొక్కలు విరిగి, ఒరిగిపోయాయి. 
  గోడ అయ్యాక రాళ్లు తీసిన ట్రాక్ చూస్తే టైల్స్ తుక్కు తుక్కు అయిపోయాయి.‘‘కార్పొరేటర్ గారూ! మేము రిపేర్ చేయించుకున్న టైల్స్ ముక్కలైనాయి” అని చెప్తే ‘‘మీకు ముందే చెప్పాను కదా. టైల్స్ కోసం  ఫ్రెష్ టెండర్ వేస్తున్నా”అని ఫోను పెట్టేశాడు.  

      కాంపౌండ్ వాల్​తో పాటే  వాష్ రూమ్స్ కూడా కడతారని అన్నారు. కానీ, ఆ కాంట్రాక్టర్ గోడ కట్టేసి మళ్ళీ ఆ వైపు రాలేదు. చూసి చూసి కార్పొరేటర్​ని ఆరా తీస్తే ‘‘ఎస్టిమేషన్ పెరిగి 30 లక్షల రూపాయలు గోడకే సరిపోయాయి. అయిదు లక్షలు వాష్ రూమ్స్ కోసం విడిగా మంజూరవుతున్నాయి’’ అన్నాడు.   ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ చూసినా అధ్వాన్నమే. శానిటరీ ఫిట్టింగ్స్ నాలుగు రోజులాగవు. ఆ డబ్బు మనకే ఇస్తే శుభ్రంగా కట్టించుకోవచ్చు అనే చర్చ మాలో వచ్చింది. అదే విషయాన్ని కార్పొరేటర్​ని అడిగితే ‘‘బయటి వాళ్లకు ఇలాంటి పనులివ్వరు. మీలో ఎవరైనా మున్సిపాలిటీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉన్నారా?” అని అడిగాడు.  ‘‘లేర’’ని మా సమాధానం.  పనులన్నీ ముగిశాయని అనుకున్న మేము వాచ్ మన్​తో రోజూ పార్క్ ఊడిపించి, చెట్లకు నీళ్ళు పట్టించి, మొత్తానికి దానికి ఓ కళను తెచ్చాం.

 ఓ రోజు కార్పొరేటర్ స్వయంగా వచ్చి కాలనీ పెద్దలను పిలిపించి ‘‘మీ పార్క్ లో 40 లక్షలతో కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నా” అంటూ దాని కోసం అనువైన స్థలాన్ని ఇంజనీర్​కు చూపిస్తున్నాడు. అంతలోనే వచ్చిన మేయర్ ‘‘శ్రీనివాసనగర్ కాలనీ పార్క్ మన కార్పొరేషన్​లోనే నెంబర్ వన్​గా తయారు చేశారు. గ్రేట్!’’ అంటూ మమ్మల్ని అభినందించాడు. సంతోషపడుతున్న మాతో మరో మాట కూడా అన్నాడు. ‘‘ఈ పార్క్ ను నేను దత్తత తీసుకుంటా. పార్క్ మధ్యన మా తండ్రిగారి విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఆయన పేరిట తయారుచేయించిన 20 సిమెంట్ బెంచీలు పార్క్​కు విరాళంగా ఇస్తాం!’’ అన్నాడు ‘‘ఇవన్నీ మాకు వద్దు’’ అని మేము ముక్తకంఠంతో అన్నాం. అది ఎవరి చెవికీ ఎక్కినట్లు లేదు. కార్పొరేటర్​కు, ఇంజనీర్​కు ఏదో చెప్పి, మా వైపు తిరిగి నవ్వుతూ చేతులు జోడించి మేయర్  సెలవు తీసుకున్నాడు.

  మళ్ళీ రాళ్లు, సిమెంట్​, వాటిని మోసుకొచ్చే వాహనాలు అన్నీ మొదలవుతాయన్నమాట. అవసరం పడ్డప్పుడు డబ్బు పాలు పితుక్కునే గేదెలా పనికొస్తున్న ఈ పార్క్ పూర్తయ్యేదెన్నడు? చివరకు చెట్టు, చేమ ఏమైనా మిగుల్తాయా? అనే బెంగ క్రమంగా తగ్గి మాకు తెలియకుండానే ‘మా శ్రీనివాసనగర్ పార్కు’ అనే భావన తుడిచిపెట్టుకుపోయింది. పదేళ్ల కల పూర్తయిందని అనుకోవడం ఎంత తప్పో తెలిసొచ్చింది. బి. నర్సన్, ఫోన్:​ 9440128169