హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ కంచె ఐలయ్య తమ జాతి సూర్యుడు అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. శనివారం కర్నాటక రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ కనకపీఠం కంచె ఐలయ్యకు ప్రకటించిన ‘మా జాతి సూర్యుడు’ అవార్డును సీఎం సిద్ధరామయ్య ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంచె ఐలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. కులాధిపత్య సమాజానికి కంచె ఐలయ్య లాంటి వారి అవసరం చాలా ఉందన్నారు.
కంచె ఐలయ్య మాట్లాడుతూ.. కర్నాటక ప్రభుత్వం దళిత బహుజనుల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభించాలని కోరారు. కనక పీఠం ప్రతినిధులు మాట్లాడుతూ.. నేటి పరిస్థితులకు అనుగుణంగా కంచె ఐలయ్య రాసిన ‘వై ఐయామ్ నాట్ ఏ హిందు’, ‘బఫెల్లో నేషనలిజం’ వంటి రచనలు ఆలోచింపజేశాయన్నారు. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం పాపయ్యపేటలో పుట్టిన కంచె ఐలయ్య.. భారతదేశం గర్వించే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమన్నారు. అనంతరం కంచె ఐలయ్యకు కనక పీఠం పీఠాధిపతి శ్రీ సిద్ధరామానంద మహాస్వామి తలపాగా తొడిగి రూ. 50 వేల నగదును అందజేశారు. కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా, కర్నాటక మంత్రి భైరతి సురేశ్, బోసురాజు, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ విప్లవ్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
