- గత ఏడేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల విరాళాలిచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య
న్యూఢిల్లీ: జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ తన దాన గుణాన్ని మరోసారి చాటుకున్నారు. తన అమెజాన్ షేర్లలో ఏకంగా 42 శాతం వాటాను అమ్మి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 186 యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ గ్రూప్‌లకు విరాళాలిచ్చారు. కిందటేడాది 7.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 68 వేల కోట్ల) విలువైన దానాలు చేశారు. దానాలు చేయడం ఆమెకిది మొదటిసారేం కాదు. గత ఏడేళ్లలో ఏకంగా 26.4 బి.డాలర్ల (రూ.2.53 లక్షల కోట్ల)ను ప్రజలకు పంచారు. అమెరికాలో అత్యధిక డొనేషన్లు ఇచ్చిన వ్యక్తుల్లో వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తర్వాత ఆమె మూడో స్థానంలో నిలిచారు.
విద్యకు ప్రాధాన్యం
55 ఏళ్ల మెకెంజీ స్కాట్ కిందటేడాది హోవార్డ్ యూనివర్సిటీకి రికార్డు స్థాయిలో 80 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. అలాగే పేద, నల్లజాతీయుల ఉన్నత విద్య కోసం పనిచేసే ‘10,000 డిగ్రీస్’ సంస్థకు 42 మిలియన్లు, స్థానిక గిరిజన విద్యార్థుల నిధి (యూఎన్‌సీఎఫ్) కి భారీగా నిధులు కేటాయించారు. ఇందుకోసం ఆమె 12.6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రస్తుతం 8.11 కోట్ల షేర్లను హోల్డ్ చేస్తున్నారు.
ఈ భారీ విరాళాల తర్వాత కూడా ఫోర్బ్స్ అంచనా ప్రకారం మెకెంజీ స్కాట్ నికర ఆస్తి విలువ 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో జెఫ్ బెజోస్‌తో విడాకుల తర్వాత ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు. విడాకుల సెటిల్‌మెంట్ కింద 35 బిలియన్ డాలర్ల అమెజాన్ షేర్లను బెజోస్ నుంచి పొందారు. వీటి వాల్యూ తర్వాత మరింత పెరిగింది. తన ఆస్తిలో మెజారిటీ వాటాను దానాలు చేస్తానని ఆమె ప్రకటించారు.
