ఎకానమీ గ్రోత్ ఆగేదే లే..

ఎకానమీ గ్రోత్ ఆగేదే లే..
  • ప్రస్తుతం 9.2 శాతం జీడీపీ గ్రోత్ రేటు
  • వ్యవసాయ రంగంపై కరోనా ఎఫెక్ట్ తక్కువే
  • స్టార్టప్‌‌లు అమెరికా, చైనా తర్వాత ఇండియాలోనే ఎక్కువ
  • ఎకనామిక్ సర్వేలో వెల్లడి

దేశంలో కరోనా ఉన్నా ఎకానమీ గ్రోత్‌‌కు ఎలాంటి ఢోకా లేదని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్ రేటు 9.2 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8-.0 నుంచి 8.5 శాతంగా ఉంటుందని తేల్చింది.  సోమవారం ఎకనామిక్ సర్వేను పార్లమెంట్‌‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. 
 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: కరోనా థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  దేశ  జీడీపీ గ్రోత్ రేటు 9.2 శాతంగా నమోదవుతుందని  ఎకనామిక్ సర్వే అంచనావేసింది.  మంగళవారం బడ్జెట్‌‌‌‌ ఉండడంతో సోమవారం ఎకానమిక్ సర్వే 2021–22 ను  ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌‌‌‌లో విడుదల చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) లో జీడీపీ గ్రోత్‌‌‌‌ రేటు 8.0–8.5 శాతం వరకు ఉంటుందని ఈ సర్వే అంచనావేసింది. కానీ, ఇన్‌‌‌‌ఫ్లేషన్  దిగొస్తుందనే అంచనాలతో ఈ లెక్కలు వేశారు. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలతో పాటు మన ఎకానమీకి ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెద్ద సమస్యగా మారింది. దేశంలో దిగుమతుల రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఎకనామిక్ సర్వే పేర్కొంది. దీనికి ముఖ్య కారణం​ ఆయిల్ ధరలు పెరగడమే. హోల్‌‌‌‌సేల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌లో  ‘ఫ్యూయల్ అండ్ పవర్‌‌‌‌‌‌‌‌’ సెగ్మెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 20 % పెరిగిందని  ఈ సర్వే పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 70–75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాలతో 2022–23 గ్రోత్‌‌‌‌ రేటు అంచనాలను  ఎకనామిక్ సర్వే లెక్క కట్టింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లుగా ఉంది. ‘2022–23 లో వచ్చే సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి ఎకానమీ రెడీగా ఉందని మాక్రో ఎకనామిక్‌‌‌‌  ఇండికేటర్లు  సూచిస్తున్నాయి’ అని ఈ సర్వే పేర్కొంది. 2020–21  ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్‌‌‌‌ 7.3 శాతం తగ్గిన విషయం తెలిసిందే. కరోనా టైమ్‌‌‌‌లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను విధించడంతోనే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ గ్రోత్ పడిపోయింది. కానీ, 2021–22 లో డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉన్నా, దేశ ఎకానమీ గ్రోత్‌‌‌‌పై ప్రభావం పెద్దగా పడలేదని ఎకానమిక్ సర్వే పేర్కొంది. 2021–22 లో దేశ జీడీపీ గ్రోత్ రేటు 9.2 శాతంగా ఉంటుందని అంచనావేసింది.  ఇది కరోనా ముందు (2019–20) స్థాయి కంటే ఎక్కువ.

ఎకనామిక్ సర్వేలో వివిధ రంగాలపై ఇచ్చిన వివరాలు..
ఉద్యోగాలు..
 జాబ్ మార్కెట్‌‌‌‌  కోలుకుంటోందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. లాక్‌‌‌‌డౌన్ తర్వాత నుంచి  ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఇండికేటర్లు మెరుగ్గా రికార్డవుతున్నాయి. క్వార్టర్లీ పీరియాడిక్ లేబర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ సర్వే (పీఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌) డేటా ప్రకారం, కిందటేడాది మార్చి నాటికి కరోనాతో దెబ్బతిన్న అర్బన్ ఏరియాల్లోని ఎంప్లాయ్‌‌‌‌మెంట్ సెగ్మెంట్ రికవరీ అయ్యింది.   ఎంప్లాయీస్‌‌‌‌ ప్రావిడెంట్ ఫండ్‌‌‌‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌ఓ) డేటా ప్రకారం,  కరోనా సెకెండ్ వేవ్ టైమ్‌‌‌‌లో  ఉద్యోగాలు కోల్పోవడం తక్కువగా ఉంది. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఈపీఎఫ్‌‌‌‌ఓలో నికరంగా 13.95 లక్షల మంది మెంబర్లు యాడ్ అయ్యారు. 2017 తర్వాత ఏ నెలలోనూ ఇంత మంది ఈపీఎఫ్‌‌‌‌ఓలో యాడ్ కాలేదు.

 రూరల్ ఏరియాల్లోని ప్రజల కోసం తెచ్చిన మహాత్మా గాంధీ నేషనల్‌‌‌‌ రూరల్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌ కింద 2021 లో రూ. 73 వేల కోట్లను  ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ కేటాయింపులను రూ. 98 వేల కోట్లకు పెంచింది. 2020–21 లో ఈ కేటాయింపులు రూ. 61,500 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8.70 కోట్ల మందికి లేదా 6.10 కోట్ల కుటుంబాలకు ఈ స్కీమ్‌‌‌‌ కింద పనులు దొరికాయి. 
 లేబర్ చట్టాలను తీసుకొచ్చే ప్రాసెస్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు నాలుగు లేబర్ చట్టాలకు సంబంధించి డ్రాఫ్ట్‌‌‌‌ పేపర్లను రెడీ చేశా యి. కాగా, జీతాలు, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీయల్ రిలేషన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సేఫ్టీ, హెల్త్‌‌‌‌ అండ్ వర్కింగ్ కండిషన్స్‌‌‌‌కు సంబంధించి చట్టాలను కేంద్రం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. 

చదువులు..
కరోనా ప్రభావం ఎడ్యుకేషన్‌‌‌‌పై తీవ్రంగా ఉందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో  6 నుంచి 14 ఏళ్లు మధ్య ఉన్న పిల్లలు స్కూళ్లలో జాయిన్ కావడం తగ్గింది. ఈ ఏజ్ గ్రూప్‌‌‌‌ పిల్లలు స్కూళ్లలో జాయిన్ కాకపోవడం 2018 లో 2.5 శాతంగా ఉండగా 2021 నాటికి 4.6 శాతానికి పెరిగింది. 7–10 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు స్కూళ్ల నుంచి డ్రాప్‌‌‌‌ అవుట్ కావడం కూడా పెరిగింది. ఆడపిల్లల కంటే మగపిల్లలు స్కూళ్లు మానేయడం పెరిగింది. 
2) మరోవైపు ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌ బాగా పెరిగిందని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. కానీ, స్మార్ట్‌‌‌‌ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పేదవాళ్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ను పొందలేకపోయారని వివరించింది. 

బ్యాంకులు..
 దేశంలోని బ్యాంకులు కరోనా పరిస్థితులను చాక చక్యంగా ఎదుర్కొన్నాయని  ఎకనమిక్ సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌) ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ. 31,144 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌‌‌‌లో ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ. 14,688 కోట్లుగా ఉంది.  మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల నికర లాభం రూ. 32,762 కోట్ల నుంచి రూ. 38,234 కోట్లకు పెరిగింది. కేవలం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులనుతీసుకుంటే, వీటి నికర లాభం కిందటేడాది ఏప్రిల్‌‌‌‌–సెప్టెంబర్ మధ్య రూ. 78,729 కోట్లుగా ఉంది. 
బ్యాంకులు ఇచ్చే అప్పులు కూడా పెరిగాయి. బ్యాంకుల క్రెడిట్ గ్రోత్​ రేటు  కిందటేడాది డిసెంబర్ నాటికి 9.2 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ. 7.36 లక్షల కోట్లను రైతులకు అప్పులుగా ఇచ్చారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు వ్యవసాయ రుణాలు కింద రూ. 16.50 లక్షల కోట్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. బ్యాంకుల గ్రాస్ ఎన్‌‌‌‌పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏడాది ప్రాతిపదికన) 7.5 %  నుంచి 6.9 శాతానికి తగ్గాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల నికర ఎన్‌‌‌‌పీఏ రేషియో 2.2 శాతంగా రికార్డయ్యింది. 

రిటైల్ ఇన్వెస్టర్లు..
కిందటేడాది ఏప్రిల్‌‌‌‌– నవంబర్ మధ్య మార్కెట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ఈ టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లో 2.21 కోట్ల ఇండివిడ్యువల్ డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మార్కెట్‌‌‌‌లు లాభపడుతుండడంతో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌‌‌‌ కూడా పెరిగింది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో జరిగే రోజువారి టర్నోవర్‌‌‌‌‌‌‌‌లో  రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 2019–2‌‌‌‌‌‌‌‌0 లో 38.8 శాతంగా ఉండగా, కిందటేడాది ఏప్రిల్‌‌‌‌–అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నాటికి ఈ వాటా 44.7 శాతానికి పెరిగిందని ఎకానమిక్ సర్వే పేర్కొంది. 2019–20 లో ప్రతీ నెల సగటున 4 లక్షల డీమాట్‌‌‌‌ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెల సగటున 26 లక్షల డీమాట్‌‌‌‌ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయని వివరించింది. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌– నవంబర్ మధ్య మొత్తం 75 కంపెనీలు ఐపీఓకి వచ్చి రూ. 89 ,066 కోట్లను సేకరించాయి. ఎక్కువగా టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్‌‌‌‌ కంపెనీలు  మార్కెట్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఎఫ్‌‌‌‌డీఐల పరంగా చూస్తే, కిందటేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య నికరంగా 24.7 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు దేశంలోకి వచ్చాయి.  గ్రాస్‌‌‌‌గా చూస్తే 54.1 బిలియన్ డాలర్లు వచ్చాయి. 

ఎకనామిక్ సర్వేలో మరికొన్ని అంశాలు..
రైళ్ల కెపాసిటీని పెంచేందుకు వచ్చే పదేళ్లలో రైల్వే సెక్టార్ కోసం ప్రభుత్వం ఖర్చులు పెంచనుంది. దీని కోసం నేషనల్ రైల్వే ప్లానింగ్‌‌‌‌  ఇప్పటికే రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను రెడీ చేసింది.  2014 లో రైల్వేస్‌‌‌‌ కోసం ఏడాదికి రూ.45,980 కోట్లను క్యాపెక్స్ కింద  కేటాయించారు. 2021–22 లో ఈ కేటాయింపులు రూ. 2,15,000 కోట్లకు పెరిగాయి. 2014 లెవెల్‌‌‌‌తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ.
హైవేలు, రోడ్ల  నిర్మాణం 2013–14 తో పోలిస్తే బాగా పెరిగింది. 2020–21 లో 13,327 కిమీ నేషనల్ హైవేలు/ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. 2019–20 లో 10,237 కిమీల రోడ్లను వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3,824 కిమీ రోడ్లను వేశారు. దేశంలోని మొత్తం రోడ్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ 66.45 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఎరువుల కోసం ఇచ్చిన రాయితీలు రూ.85,300 కోట్లకు పెరిగాయి. ఇందులో రూ.49,800 కోట్లను యూరియాపై, రూ.35,500 కోట్ల సబ్సిడీని ఫాస్పటిక్‌‌‌‌& పొటాషియం ఎరువులపై ఇచ్చారు. కరోనా వల్ల  టూరిజం సెక్టార్ పరిస్థితి ఇంకా ఆందోళనగా ఉంది. ఇంటర్నేషనల్‌‌‌‌ టూరిజంపై ఇంకా కరోనా ఎఫెక్ట్‌‌‌‌ కొనసాగుతోంది. 

దేశంలో 630 బిలియన్ డాలర్ల  ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. పాలసీ డెసిషన్స్​ తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ కంపెనీలు, సంస్థలకు చెందిన ల్యాండ్‌‌‌‌ను మానిటైజ్ చేయడానికి  ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలకు చెందిన 3,400 ఎకరాల ల్యాండ్‌‌‌‌ను గుర్తించారు.టెలికం సెక్టార్‌‌‌‌‌‌‌‌లో తీసుకున్న రిఫార్మ్స్‌‌‌‌ వలన 4జీ  కనెక్టివిటీ పెరుగుతుంది. 5జీ తేవడానికి కంపెనీల దగ్గర అవసరమైన డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌ ఉద్యోగాలు పెరిగేందుకు అదర్ సర్వీస్ ప్రొవైడర్ (ఓఎస్‌‌‌‌పీ) వంటి రెగ్యులేషన్స్‌‌‌‌ను ప్రభుత్వం సింపుల్‌‌‌‌గా మార్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోషల్ సర్వీస్‌‌‌‌ల ( సంక్షేమ పథకాల) కోసం రూ. 71.61 లక్షల కోట్లను ఖర్చు చేశాయి.

ఎయిర్ ఇండియా సేల్‌‌‌‌  సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా పూర్తవ్వడంతో   ప్రభుత్వం చేపడుతున్న ఇతర ప్రైవేటైజేషన్ చర్యలకు బూస్టప్‌‌ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అగ్రికల్చర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ 3.9 శాతం వృద్ధి చెందుతుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది.  
కిందటేడాది ఏప్రిల్‌‌‌‌–సెప్టెంబర్ మధ్య దేశ ఫార్మా సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి రూ. 4,413 కోట్ల విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు (ఎఫ్‌‌‌‌డీఐలు) వచ్చాయి. 2020–21 లోని ఇదే టైమ్ పీరియడ్‌‌‌‌తో పోలిస్తే ఇది 53 % ఎక్కువ. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడానికి  1.4 లక్షల కోట్ల డాలర్లను ఇన్‌‌‌‌ఫ్రాస్ట్ర్చర్‌‌‌‌‌‌‌‌ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెమీ కండక్టర్ల కొరత వలన ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా ఏడు లక్షల ఆర్డర్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది.  వచ్చే ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌‌‌లో క్రూడాయిల్ బ్యారెల్‌‌ రేటు 70–75 డాలర్లుగా ఉండొచ్చు. ప్రస్తుతం క్రూడాయిల్ రేటు బ్యారెల్‌‌కు 90 డాలర్లుగా ఉంది.కరోనా ప్రభావం సాగుపై తక్కువగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్ 3.9% వృద్ధి సాధిస్తుంది. 2020–21 లో ఇది 3.6 శాతం.

దేశంలో నూనె గింజలు, పప్పులు, ఉద్యాన పంటల వైపు మారడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.2021–22లో ఇండస్ట్రియల్‌‌ సెక్టార్‌‌‌‌ 11.8% వృద్ధి సాధించొచ్చు. సర్వీస్‌‌ సెక్టార్‌‌‌‌ గ్రోత్‌‌ రేటు 8.2% ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఖర్చులు 9.8% పెరిగి రూ.71.61 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి.కరోనా వల్ల జాబ్‌‌ మార్కెట్‌‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈఎంఐలు కట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కిందటేడాది నవంబర్‌‌‌‌లో హోమ్‌‌ లోన్లు 8% పెరిగాయి.