ప్రజల చందాలతో గెలిచిన సురేందర్ మోసం చేసిండు : మదన్​మోహన్​రావు

ప్రజల చందాలతో గెలిచిన సురేందర్ మోసం చేసిండు : మదన్​మోహన్​రావు
  • డబ్బు సంపాదనే తప్ప అభివృద్ధి లేదు
  • బీఆర్ఎస్​ పాలనలో సర్వం అవినీతిమయం
  • మోసం చేసిన సురేందర్​కు తగిన బుద్ది చెప్పాలి
  • ఎల్లారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థిమదన్​మోహన్​రావు 

లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల చందాలతో ఎమ్మెల్యేగా గెలిచిన జాజాల సురేందర్ డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశాడే తప్ప, నియోజకవర్గ ప్రజల అబివృద్ధికి పాటు పడలేదని, కాంగ్రెస్ ​పార్టీకి ఓటేసి, జాజాలను ఇంటికి పంపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. సోమవారం​నాగి రెడ్డిపేట మండలంలోని వదల్​పర్తి, చీనూర్,వాడి, గోలిలింగాల,వెంకంపల్లి, బంజారా, గోపాల్​పేట, తాండూర్, అక్కంపల్లి గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు సురేందర్​పై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అతడు డబ్బులకు ఆశపడి కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరాడన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా పూరి గుడిసెలే  దర్శనమిస్తున్నాయని వాపోయారు. డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, నియోజకవర్గంలో ఎక్కడ డబుల్​బెడ్​రూమ్ ​ఇండ్లు  కనిపించడం లేదన్నారు. పేద ప్రజల అవసరాలు తీర్చలేని సురేందర్​ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు పాలన ఎక్స్​పైరీ డేట్ ​వచ్చేసిందన్నారు.

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ​జెండా ఎగరేస్తాం

ఎల్లారెడ్డి గడ్డ - కాంగ్రెస్​అడ్డా అని, ఈ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ జెండా ఎగరేస్తామని పార్టీ అభ్యర్థి మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్​పార్టీకి  ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల బాగోగులు చూడని ఎమ్మెల్యే సురేందర్ ​పట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సీఎం కేసీఆర్​ఇచ్చిన ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 నెలకు రూపాయి జీతం తీసుకుంటా

నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూపాయి జీతం తీసుకొని పనిచేస్తానని మదన్​మోహన్​ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్​ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిన వేలాది మంది రైతులు, ఓటర్లు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మదన్​మోహన్​రావు చెప్పారు. 

ALSO READ : కేసీఆర్, బాల్క సుమన్ లు జైలుకు వెళ్లడం ఖాయం

ఆయనవెంట కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్​లీడర్లు రాంచంద్రా రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​గౌడ్, నర్సింహా రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ జడ్పీటీసీ గీయాజోద్దీన్, బోయిని విఠల్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.