వెలుగు ఓపెన్ పేజీ.. దళిత ఆత్మగౌరవ ప్రతీక భాగ్యరెడ్డి వర్మ

వెలుగు ఓపెన్ పేజీ.. దళిత ఆత్మగౌరవ ప్రతీక  భాగ్యరెడ్డి వర్మ

మహాత్మాగాంధీ, అంబేద్కర్ కంటే ముందే అస్పృశ్యత నివారణ, అణగారిన వర్గాల హక్కుల కోసం గళమెత్తిన నాయకుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ. దళితుల అభ్యున్నతి కోసం 'భాగ్యనగర్' పత్రికను  ప్రారంభించిన సంపాదకుడు. 1906లో బాలికల కోసం తెలుగు మీడియం పాఠశాలను ఆయన ఏర్పాటు చేశారు.1917 నవంబర్​లో  బెజవాడ కేంద్రంగా దేశంలో  మొట్టమొదటి పంచమ మహాసభలను నిర్వహించారు.  ఆది హిందువుల చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి భాగ్యరెడ్డి వర్మ 1925లో  చేతివృత్తుల ప్రదర్శనను నిర్వహించారు. 1927 నుంచి 1931 వరకు జరిగిన జాతీయ నిమ్నవర్గాల సభలకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు.

హైదరాబాద్​లోని చాదర్ ఘాట్ వద్ద 'ఆది హిందూ భవనాన్ని' స్థాపించారు.  పంచములు, అవర్ణులు, మాల, మాదిగ, డక్కలి, సింధూ వంటి పేర్లకు బదులుగా తమను 'ఆది హిందువులు' అనే పేరుతో  పిలవాలని నిజాం ప్రభుత్వాన్ని భాగ్యరెడ్డి వర్మ కోరారు. 1931 జనాభా లెక్కల్లో  నిజాం ప్రభుత్వం వీరిని ఆది హిందువులుగా నమోదు చేసింది. 

న్యాయ పంచ కమిటీలు

1925లో కలరా, ప్లేగ్ వ్యాధులు విజృంభించినప్పుడు భాగ్యరెడ్డి వర్మ 'ఆరోగ్య సేవాదళ్'ను స్థాపించారు.  దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక మాదరి భాగ్యరెడ్డి వర్మ.  ఆది హిందూ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త,  నిమ్నజాతి జీవన వికాస భాగ్యరేఖ భాగ్యరెడ్డి వర్మ  హైదరాబాద్ ఇసామియా బజారులో నివాసముంటున్న మాదరి వెంకయ్య , రంగమ్మ దంపతులకు   1888 మే 22న నిరుపేద దళిత మాల కులంలో పుట్టారు.  భాగ్యరెడ్డి వర్మకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాదరి భాగయ్య.  

అయితే దళితులు ఈ దేశ మూలవాసులని, వారే మొదటి పాలకులు అనే అర్థాన్ని సూచించేందుకు రెడ్డి పదాన్ని వారి కులగురువు.. భాగయ్యకు రెడ్డి పదాన్ని చేర్చి 'భాగ్యరెడ్డి'గా మార్చారు. అనంతర కాలంలో సమాజానికి భాగ్యరెడ్డి చేసిన సేవకు ఆర్య సమాజం ఆయనకు వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది.   నిమ్న జాతుల పట్ల  వివక్షతను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. హైదరాబాద్,  సికింద్రాబాద్ జంట నగరాల్లో నిమ్న జాతులు నివాసముండే ప్రాంతాల్లో బస్తీలలో  తిరిగి జగన్ మిత్ర మండలి  ఏర్పాటుచేసి బస్తీ  సమస్యలను  పరిష్కరించే దిశగా శ్రీకారం చుట్టారు.  ఇందుకుగాను  జగన్  మిత్రమండలికి అనుబంధంగా న్యాయ పంచ కమిటీలను ఏర్పాటు చేశారు. 

దళితుల సమస్యలపై పోరాటం

దురాచారాలను  తొలగించాలని ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని రాత్రి బడులను ప్రారంభించారు. దీనితోపాటు  భజన మండలిని ఏర్పాటుచేసి బుర్రకథలు, హరికథల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.  ప్రతి పౌర్ణమి రోజున బస్తీలో సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బుద్ధ జయంతిని నిర్వహించేవారు. 1906లో కోఠి ఇస్లామియా బజారులో నిజాం స్టేట్ లో ఉర్దూ మీడియం అధికార భాషగా నడుస్తున్న సమయంలో బాలికల కోసం ప్రత్యేకంగా తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేశారు. 

అప్పటి నుంచి ప్రారంభమైన సంఘసేవా కార్యక్రమాలను  అన్ని రంగాల్లోకి  విస్తరించారు.  అప్పటి ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర ప్రదేశ్​లో  బెజవాడ కేంద్రంగా 1917 నవంబర్ 5 నుంచి 7 వరకు పంచమ మహాసభలను నిర్వహించారు. దేశంలోనే దళితుల సమస్యల పట్ల మూడు రోజులుపాటు చర్చించారు. ఈ సభకు అణగారిన కులాల నుంచి  ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి హాజరయ్యారు.  దళితుల సమస్యలపై  పోరాడి అంతర్గతంగా సంస్కరిస్తూనే వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కుల సాధనవైపు దృష్టి సాధించారు. జాతీయస్థాయిలో కూడా మహాత్మా గాంధీ, అంబేద్కర్​తో  మంచి సంబంధాలు కొనసాగించారు.  

దళితుల ఐక్యతకు కృషి

భాగ్యరెడ్డి వర్మ ఎంతో  దూరదృష్టితో  దళితుల్లో అంతర్గత ఐక్యతకు కృషి చేశారు.  మాల, మాదిగ, ఉపకులాల పేర్ల మీద సమాజం నుంచి వివక్షతను ఎదుర్కొంటున్న దళితులందరూ కూడా ఆది హిందువులుగా చెప్పుకోవాలని అప్పుడే కులాల జాడ్యం పోతుందని బోధించారు. తమ కార్యక్రమాలు బస్తీలవారీగా తెలియజేయడం కోసం భాగ్యనగర్  పత్రికను ప్రారంభించారు. అది హిందూ మాస పత్రికను స్థాపించి జాతీయస్థాయి అంశాలను  ప్రచురించేవారు.

హైదరాబాద్ చాదర్ ఘాట్ చౌరస్తాలో ఆది హిందూ భవననిర్మాణం చేపట్టారు. నిజాం స్టేట్ హైదరాబాదులో దళిత జాతి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఈ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు.  18 ఫిబ్రవరి 1939న 51 సంవత్సరాల వయసులో తుదిశ్వాస వదిలారు.  భాగ్యరెడ్డి వర్మ నిర్వహించిన సంఘసేవ కార్యక్రమాలను  ప్రభుత్వం గుర్తించి తెలంగాణ  పాఠ్యాంశాలలో భాగ్యరెడ్డివర్మ జీవిత చరిత్రను చేర్చారు.   తెలంగాణ  ప్రభుత్వం మహనీయుల్లో ఒకరిగా భాగ్యరెడ్డివర్మను గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. 

- అస శ్రీరాములు , సీనియర్ జర్నలిస్ట్