వెలుగు ఓపెన్ పేజీ.. దేశ భవిష్యత్తును నిర్ణయించబోయేది.. పెట్రోల్ ధరలేనా?

వెలుగు ఓపెన్ పేజీ.. దేశ భవిష్యత్తును నిర్ణయించబోయేది.. పెట్రోల్ ధరలేనా?

ప్రస్తుతం  భారత్  ఎదుర్కొంటున్న  పరిస్థితిని  చాలామంది సాధారణ  ద్రవ్యోల్బణ  సమస్యగా చూస్తున్నారు.  పెట్రోల్ ధరలు పెరిగాయి, వంటగ్యాస్  ఖరీదైంది,  కూరగాయలు మళ్లీ భారమయ్యాయి.  ప్రజల చర్చ ఇక్కడితో ముగుస్తోంది.  కానీ ఒక ఆర్థిక  విశ్లేషకుడి దృష్టిలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు మరింత లోతైనవి.  ఇవి కేవలం ఇంధన ధరల పెరుగుదల కాదు.  ఇవి  గత  మూడు దశాబ్దాలుగా ‘చౌకైన  ప్రపంచీకరణ’ మీద  ఆధారపడిన భారత ఆర్థిక నమూనా క్రమంగా  ఒత్తిడిలోకి వెళ్తున్న  సంకేతాలు.  

భారత్  అభివృద్ధి కథ  ఒక కీలకమైన ఊహపై  నిర్మితమైనది.  ప్రపంచం  ఎప్పటికీ చౌకైన ఇంధనాన్ని,  చౌకైన రవాణాను,   స్థిరమైన డాలర్ వ్యవస్థను అందిస్తుందని ఓ భావన. కానీ  ఇప్పుడు ఆ మూడు కూడా మారుతున్నాయి.  మధ్యప్రాచ్య అస్థిరత,  సరఫరా వ్యవస్థల విభజన,  అమెరికా, చైనా ఆర్థిక పోటీ,  పెరుగుతున్న అంతర్జాతీయ  రాజకీయ వర్గీకరణ  ప్రపంచ ఆర్థికవ్యవస్థను ప్రపంచీకరణ నుంచి వెనక్కి నెడుతున్నాయి.  ఈ మార్పుకు ప్రభావితమయ్యేవి అత్యంత  బలహీన దేశాలు.  తమవృద్ధికి అవసరమైన మూల వనరులను దిగుమతి చేసుకునే దేశాలు.  భారత్ అందులో ఒకటి. 

ఇక్కడ అసలు సమస్య పెట్రోల్ ధర కాదు.  ‘డాలర్ ఆధారిత జీవన నిర్మాణం’ ఖరీదవడం.  భారత్  తన చమురును  డాలర్లలో కొనాలి.  రూపాయి  బలహీనపడిన  ప్రతిసారి దేశం అదే జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి మరింత ఎక్కువ  చెల్లించాల్సి వస్తోంది.  ఇది కేవలం విదేశీ మారక ద్రవ్య సమస్య కాదు.  

ఇది దేశీయ వినియోగ నిర్మాణంపై దెబ్బ.  ఎందుకంటే  భారత  మధ్యతరగతి జీవనశైలి.  కార్లు, ఎయిర్  కండీషనర్లు, విమాన ప్రయాణాలు, విదేశీ ఎలక్ట్రానిక్  వస్తువులు,  ఆన్‌‌‌‌లైన్  వినియోగం ఇవన్నీ  చౌకైన ఇంధన,  చౌకైన  రవాణాయుగంలో  ఏర్పడ్డాయి.  ఇప్పుడు ఇంధన ఖర్చులు శాశ్వతంగా అధికస్థాయిలో ఉంటే,  భారత  మధ్య తరగతి  తన  వినియోగపు అలవాట్లను బలవంతంగా  మార్చుకోవాల్సి రావచ్చు. 

రుణాలతో మధ్యతరగతి అభివద్ధి

ప్రస్తుతం చాలామంది గుర్తించని ఒక కీలకమైన అంశం ఏమిటంటే..  భారత్‌‌‌‌లో కనిపిస్తున్న మధ్యతరగతి అభివృద్ధిలో పెద్ద భాగం నిజమైన ఆదాయాల వల్ల కాదు.  చౌకైన రుణాల వల్ల వచ్చింది.  గత  దశాబ్దంలో నెలసరి వాయిదా పద్ధతులు భారత ఆర్థికవ్యవస్థను  ముందుకునెట్టాయి. ఇళ్లు, కార్లు, ఎలక్ట్రానిక్  పరికరాలు,  జీవనశైలి ఇవన్నీ  భవిష్యత్తులో వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదలతోపాటు వడ్డీ రేట్లు పెరిగితే, మధ్యతరగతి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఆదాయం ఉంటుంది, కానీ చేతిలో మిగిలే  నగదు ఉండదు. ఇది వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకర దశ. 

ఎందుకంటే వినియోగం పడిపోతే భారత వృద్ధి యంత్రాంగం కూడా మందగిస్తుంది. ఇంకా లోతైన నిర్మాణాత్మక ప్రమాదం రవాణా రంగంలో ఉంది.  భారత ఆర్థికవ్యవస్థ పూర్తిగా చౌకైన డీజిల్ ఆధారంగా ఉంది.  రైతు పండించిన పంటసరుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి  ఆయా నగరాలకు  వస్తోంది.  పరిశ్రమలు ముడిసరుకును  దేశవ్యాప్తంగా తరలిస్తున్నాయి. కానీ దీర్ఘకాలంగా డీజిల్ ధరలు అధికంగా ఉంటే ఈ మొత్తం ఆర్థిక భౌగోళిక నిర్మాణం మారిపోతుంది.  ఇది కేవలం ధరల పెరుగుదల కాదు.  ఇది భారత పట్టణీకరణ నమూనాపై దెబ్బ. 

ఇంధన ప్రభావం...జనాభా ప్రభావితం

మహానగరాలలో  నిర్వహణ ఖర్చులు పెరిగితే,  భవిష్యత్తులో చిన్న పట్టణాలు,  స్థానిక ఉత్పత్తి కేంద్రాలు తిరిగి ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.  అంటే ఇంధన ప్రభావం చివరికి జనాభా కదలికలను కూడా ప్రభావితం చేయవచ్చు.  ఇక్కడ మరో ప్రమాదకరమైన అంశం ఉద్యోగాల నిర్మాణం. ఇప్పటివరకు భారత నగర మధ్యతరగతికి సమాచార సాంకేతిక, సేవల రంగం భద్రతను ఇచ్చాయి. కానీ  ఇప్పుడు  ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు ఆధారిత యంత్ర వ్యవస్థలు,  విదేశీ పనుల పునర్వ్యవస్థీకరణ,   అమెరికా రక్షణాత్మక ఆర్థిక విధానాలు కలిసి భారత వైట్​కాలర్ ఉద్యోగ నమూనాను బలహీనపరుస్తున్నాయి.

 ఇది చాలా పెద్ద  ప్రమాదానికి సంకేతం. ఎందుకంటే పెరుగుతున్న జీవన వ్యయం, అస్థిరమైన ఉద్యోగ భవిష్యత్తు కలిస్తే చదువుకున్న యువతలో అసంతృప్తి వేగంగా పెరుగుతుంది. చరిత్ర చెబుతున్న ఒక కఠినమైన నిజం ఏమిటంటే, సమాజాలు కేవలం పేదరికం వల్ల అస్థిరం కావు. ఆశలు పెరిగిన తర్వాత అవకాశాలు తగ్గినప్పుడు అస్థిరం అవుతాయి.  భారత్ ఇప్పుడు అదే దశలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. 

చౌకైన ఇంధనపై భారత వృద్ధి

ప్రభుత్వం ప్రజలకు ‘పెట్రోల్ వినియోగం తగ్గించండి, బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించండి’ అని చెప్పడం కూడా చాలా లోతైన సంకేతం.  ఇవి పొదుపు సలహాలు కాదు.  ఇవి ఒక దేశం తన విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని  నియంత్రించాలనుకుంటున్న  సంకేతాలు.  చరిత్రలో  ఇలాంటి భాష సాధారణంగా  విదేశీ  చెల్లింపుల ఒత్తిడి పెరుగుతున్న దశల్లో  కనిపించింది.  ఎందుకంటే  భారత్  సమస్య  చమురు ధరలు కాదు. చమురు కొనడానికి అవసరమైన డాలర్ల  భవిష్యత్తు. 

 ఇప్పుడు భారత్ ముందు ఉన్న అసలు ప్రశ్న వృద్ధి గురించికాదు.  నిలకడ గురించి.  గత 20 సంవత్సరాల భారత వృద్ధి నమూనా చౌకైన ఇంధనం, చౌకైన రవాణా, చౌకైన అంతర్జాతీయ మూలధనం మీద ఆధారపడింది.  కానీ,  ప్రపంచం ఇప్పుడు ఖరీదైన ఇంధనం, విభజిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలు,  వ్యూహాత్మక జాతీయతవైపు  వెళ్తోంది. ఈ కొత్త ప్రపంచంలో భారత్ తన వృద్ధి నిర్మాణాన్ని మార్చుకోకపోతే, బయటకు వేగంగా పరుగెడుతున్నట్లు కనిపించినా లోపల నిర్మాణాత్మక అలసట పేరుకుపోయే  ప్రమాదం ఉంది.  

పునరుత్పాదక ఇంధనం..కొత్త ఆర్థిక దిశ

 ప్రతి సంక్షోభంలో ఒక దాగి ఉన్న అవకాశం కూడా ఉంటుంది. అధిక ఇంధన ధరలు భారత్‌‌‌‌ను బలవంతంగా పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, రైల్వే రవాణా, స్థానిక తయారీ,  ప్రాంతీయ పారిశ్రామిక వ్యవస్థల వైపు నెట్టవచ్చు.  దీర్ఘకాలంలో ఇది భారత్‌‌‌‌కు  ఒక కొత్త  ఆర్థికదిశను కూడా ఇవ్వవచ్చు.  కానీ, ఈ మార్పు సాఫీగా జరగదు.  మధ్యలో  తీవ్రమైన మధ్యతరగతి ఒత్తిడి,  రాజకీయ ఉద్రిక్తత,  వినియోగ మందగమనం కనిపించే అవకాశం ఉంది.  

ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్నది కేవలం ఇంధన ధరల పెరుగుదల కాదు. ఇది చౌకైన  ప్రపంచీకరణ యుగం ముగిసిన తర్వాత ప్రారంభమైన ఒక నిశ్శబ్ద ఆర్థిక పునర్వ్యవస్థీకరణ.  ఇప్పుడు దేశం తీసుకునే నిర్ణయాలే రాబోయే దశాబ్దంలో భారత్‌‌‌‌ను ఇంధన భద్రత కలిగిన తయారీ శక్తిగా మార్చుతాయా,  లేక  అప్పుల ఆధారిత వినియోగ ఆర్థిక వ్యవస్థగానే  ఉంచుతాయా అన్నది  నిర్ణయించబోతున్నాయి.

- అమ్జాద్​ మియా,అడ్వకేట్​