Zimbabwe Cricket: డ్రగ్స్ వినియోగం.. జింబాబ్వే క్రికెటర్లపై 4 నెలల నిషేధం

Zimbabwe Cricket: డ్రగ్స్ వినియోగం.. జింబాబ్వే క్రికెటర్లపై 4 నెలల నిషేధం

జాతీయ జట్టు క్రికెటర్లు వెస్లీ మధవేరే, బ్రెండెన్ మవుతాలపై జింబాబ్వే క్రికెట్ బోర్డు నాలుగు నెలల నిషేధం విధించింది. వీరిద్దరూ డ్రగ్స్ వినియోగించినట్లు నిరూపితమవ్వడంతో ఈ చర్యలు చేపట్టింది. అలాగే, మరో జింబాబ్వే క్రికెటర్ కెవిన్ కసుజాపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున  అతన్ని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా నిషేదించింది. 

గతేడాది డిసెంబరులో జరిగిన డోప్ పరీక్షల్లో క్రికెటర్లు వెస్లీ మధవేరే, బ్రెండెన్ మవుతా నిషేధిత రిక్రియేషనల్ డ్రగ్‌ వాడినట్లు తేలింది. దాంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు వారిని తక్షణమే సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం విచారణకు హాజరవల్సిందిగా నోటీసులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరూ గతవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై డ్రగ్స్ వాడినట్లు అంగీకరించారు. దీనిపై పలుమార్లు సమావేశమైన జింబాబ్వే క్రికెట్ బోర్డు వీరిద్దరిని అన్ని ఫార్మాట్ల నుంచి నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తూ గురువారం(జనవరి 25) ప్రకటన చేసింది.

డ్రగ్స్ వాడకాన్ని జింబాబ్వే క్రికెట్ ఏమాత్రం సహించదన్న అధికారులు.. ఆంక్షలు విధించడంలో, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో వెనకాడబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల దేశానికి, క్రికెట్ ఆటకు చెడ్డపేరు వస్తున్నట్లు తెలిపారు. అలాగే, గత వారం జరిపిన డోప్ పరీక్షలో విఫలమైన కెవిన్ కసుజాపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున అతన్ని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధం విధించింది.